బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - May 31, 2020 , 03:50:31

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, మక్కలు

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, మక్కలు

  • పలు గ్రామాల్లో కూలిన విద్యుత్‌ స్తంభాలు
  • వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో అపార నష్టం

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో శనివారం తెల్లవారుజామున, మధ్యాహ్నం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలైంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర, నడికూడ, నర్సంపేట, నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో వర్షం పడింది. శాయంపేట మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసిముద్దయ్యాయి. జోగంపల్లి కేంద్రంలో వర్షపు నీటిలో తడిసిన ధాన్యాన్ని రైతులు బయటకు తెచ్చి ఆరబోశారు. ఖానాపురం మండలం అశోక్‌నగర్‌, నల్లబెల్లి మండలం మేడపల్లిలో కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ, బయ్యారం, గూడూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొత్తగూడ మండలంలో కొత్తపెల్లి, బూర్కపల్లి వాగు, నర్సంపేట- కొత్తగూడ  మధ్యలో, గుంజేడు ముసలమ్మ తోగులు, బయ్యారం మండలంలోని పందిపంపుల వాగు వరద నీటితో ప్రవహించాయి. గూడూరు మండలంలోని గూడూ రు, అయోధ్యపురం, భూపతిపేట, తీగలవేణి, కొత్తగూడ మండలంలోని కొత్తగూడ, మైలారం సాధిరెడ్డిపల్లి, ఓటాయి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం, అన్నారం, చండ్రుపల్లిలో చెట్లు విరిగి పడిపోయాయి. మహాముత్తారంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మల్హర్‌ మండలం ఆన్‌సాన్‌పల్లిలో పిడుగుపాటుతో నెట్టెట్ల శంకర్‌కు చెందిన ఎద్దు మృతి చెందింది. 

తాడిచర్లలో బొగెల్లి మలహల్‌రావుకు చెందిన బర్రెపై చెట్టు విరిగి పడడంతో మృతి చెందింది. ములుగు జిల్లాలో 20.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వాజేడు మండలంలోని వెంకటాపురం (నూగూరు), ములుగులో వర్షం కురిసింది. పలు చోట్ల పంట ఉత్పత్తులు తడిశాయి. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో గాలివానకు పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇన్నాళ్లూ ఎండల తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు. 


logo