శనివారం 11 జూలై 2020
Warangal-rural - May 31, 2020 , 03:45:58

రూరల్‌ జిల్లాలో పది వేల టన్నుల మత్స్యసంపద

రూరల్‌ జిల్లాలో పది వేల టన్నుల  మత్స్యసంపద

వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ : వరంగల్‌రూరల్‌ జిల్లాలో 200 మత్స్య సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఇందులో మొత్తం 17,650 మంది మత్స్య కారులు సభ్యులుగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 851 చెరువులు, రిజర్వాయర్లు ఉన్నాయి. 2019-20 కోసం ప్రభుత్వం 810 చెరువులు, రిజర్వాయర్లలో 2.40 కోట్ల చేప పిల్లలను వంద శాతం సబ్సిడీపై వదిలింది. వీటి విలువ రూ.1.37 కోట్లు. బొచ్చె, రోహు, బంగారుతీగ రకాల చేప పిల్లలను మత్స్య శాఖ అధికారులు గత ఆగస్టు, సెప్టెంబరులో చెరువులు, రాయపర్తి మండలం మైలారం, శాయంపేట మండలం చలివాగు ప్రాజెక్టులో వదిలారు. జిల్లాలోని 810 చెరువులు, రిజర్వాయర్లలో నూరు శాతం సబ్సిడీపై వదిలిన చేప పిల్లలతో పది వేల టన్నులకు పైగా మత్స్య సంపద లభించనుందని అధికారుల అంచనా. ఇప్పటి వరకు 9,340 టన్నుల చేపలను పట్టుకుని విక్రయించారు.

ఇంకో వెయ్యి టన్నుల చేపలు చెరువులు, రిజర్వాయర్లలో ఉన్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి నరేశ్‌కుమార్‌ వెల్లడించారు. వాటిని జూన్‌ నెలలో మత్స్య కారులు పట్టుకోవాల్సి ఉంది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వచ్చిన గోదావరి జలాలతో కొన్ని చెరువులు నిండాయి. పది వేల టన్నుల చేపలను మత్సకారులు చెరువులు, రిజర్వాయర్ల వద్ద అమ్మితే వీటి విలువ రూ.83.20 కోట్లు వస్తాయి. అదే మార్కెట్‌లో విక్రయిస్తే రూ.104 కోట్లు వస్తాయి. మత్స్య కారులు చెరువులు, రిజర్వాయర్ల వద్ద చేపలను కిలోకు రూ.80 చొప్పున విక్రయించారు. మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.110 వరకు విక్రయిస్తున్నారని మత్స్య శాఖ జిల్లా అధికారి చెప్పారు. ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో వదులుతున్న చేప పిల్లలతో మత్స్య సహకార సంఘాల్లోని సభ్యులందరికీ లబ్ధి చేకూరనుంది. 


logo