మాయలో పడొద్దు..!

- సినీ హీరో, హీరోయిన్ల పేరుతో పత్తి విత్తనాలు
- రైతులను ఆకట్టుకునేందుకు పలు కంపెనీల ఎత్తుగడ
- జాగ్రత్త అంటున్న అధికారులు
- నకిలీ విత్తనాల బారిన పడొద్దని సూచన
‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్టు పలు విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులను సులువుగా విక్రయించుకునేందుకు నూతన ఆలోచనలతో వస్తున్నాయి. తమ కంపెనీ ద్వారా విక్రయించే విత్తన ప్యాకెట్లకు హీరో, హీరోయిన్ల పేర్లతోపాటు హిట్ సినిమాల పేర్లు పెడుతూ మార్కెట్లోకి రైతులను ఆకర్షించేందుకు తమ ఉత్పత్తులను తీసుకెళ్తున్నాయి. అయితే నకిలీ కంపెనీల బారినపడొద్దని, రైతులు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు.
- నర్సింహులపేట/ ఐనవోలు
గతంలో విత్తన కంపెనీలు బ్రాండ్ నేమ్‌తో విత్తనాలను విడుదల చేసేవి. కానీ, ప్రస్తుతం రైతులను ఆకట్టుకునేందుకు హిట్ సినిమాల పేర్లు , సినీ హీరోహీరోయిన్ పేర్లు పెడుతూ మార్కెట్లోకి ఉత్పత్తుల ను విడుదల చేస్తున్నారు. వీటికితోడుగా పవిత్రమైన నదుల పేర్లను కూడా వాడుతున్నారు. నిజానికి అవి ఈ పేర్లు ఒక ఏడాది ఉంటే మరుసటి ఏడాది ఉంటాయో..? ఉండయో..? కూడా తెలియదు. కానీ, దుకాణ యజమానులు, కంపెనీ ప్రతినిధులతోపాటు కొందరు రైతుల మౌఖిక ప్రచారం వీరికి సహకరిస్తుంది. అయితే, ప్రస్తుతం పంటల సీజన్ ప్రారంభమవడంతో రైతులను ఆకట్టుకునేందుకు వివిధ పత్తి కంపెనీల ఎత్తుగడలను రైతులు గుర్తించి అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో సోమవారం విత్తనాల శాంపిళ్లను సేకరించి.. ఏయే కంపెనీల విత్తనాలు కొనవచ్చో..? ఏవి కొనరాదు/ అమ్మరాదు అనే అంశాలను అధికారులు ప్రకటించనున్నారు.
రైతులు నష్టపోకుండా చర్యలు
రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంటలు వేయాలో ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో జిల్లా, మండలాల వారీగా వ్యవసాయాధికారులతో రైతులకు అవగాహన కల్పించనున్నారు. రోహిణి కార్తె ప్రారంభమవడంతో రైతులు ఇప్పటికే తమ పొలాల్లో రేగడి, పశువుల పెంట పోస్తున్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన పంటలు సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
సలహాలు తీసుకోవాలి
వానకాలం సాగుకు సిద్ధమయ్యే రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించాలి.
- అడుప కవిత, మండల వ్యవసాయాధికారి, ఐనవోలు
విత్తనాల కొనుగోలు సమయంలో..
- వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి
- కొనుగోలు చేసే సమయంలో బిల్లులో విత్తన రకం, నంబర్, గడువు తేదీ, కొనుగోలు తేదీ, డీలర్ సంతకం, ఉండేలా చూసుకోవాలి.
- బిల్లుపై విక్రయదారుడి పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకపు నెంబర్, రైతు,గ్రామం పేరు. విక్రయదారుడి సంతకం, తేదీలు, రకం పేరు, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు నమోదు చేయించుకోవాలి.
- విత్తన ప్యాకెట్‌పై సీలు ఉందా లేదా నిర్ధారించుకోవాలి.
- మొలకెత్తే, పూల దశలో లోపాలు కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.
పురుగు మందుల కొనుగోలులో
- చీడపీడల నివారణకు వినియోగించే మందు ల కొనుగోలు సమయంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు చెందిన శాస్త్రవేత్తలు సూచించిన మందులనే వినియోగించాలి.
- నిల్వ ఉంచిన పురుగు మందులు వాడొద్దు.
- లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి.
- పురుగు మందు డబ్బాపై వజ్రాకారంలో మందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తు ఉంటుంది.
ఎరువుల కొనుగోలులో..
- లైసెన్స్ దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి. కొనుగోలు సమయంలో ఇచ్చిన బిల్లు, ఖాళీ సంచులు పంట పూర్తయ్యే వరకు భద్రపర్చాలి.
- మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులను మాత్రమే వాడాలి. ఒకవేళ చేతి కుట్టుతో ఉంటే బస్తా చివరన సీసం సీల్ ఉందో లేదో చూసుకోవాలి.
తాజావార్తలు
- మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి గంగుల
- హింస ఆమోదయోగ్యం కాదు: పంజాబ్ సీఎం
- భూ తగాదాలతో వ్యక్తి హత్య
- యాదాద్రిలో భక్తుల రద్దీ..
- పాత నోట్లపై కేంద్రం క్లారిటీ..!
- తిరుమలలో త్రివర్ణ పతాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో
- కాళేశ్వరం నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ
- అమర్నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు షురూ!
- రియల్మీ X7 సిరీస్ విడుదల తేదీ ఖరారు!
- అనైతిక బంధం : సోదరిని కాల్చిచంపిన వ్యక్తి