ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - May 29, 2020 , 00:40:31

నీళ్ల సౌలత్‌ ఉంటేపత్తి సాగు నయం

నీళ్ల సౌలత్‌ ఉంటేపత్తి సాగు నయం

  • 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం
  • అంతర పంటలతో అదనపు ఆదాయం
  • వరిలో సన్నరకాల సాగు అధికం
  • నియంత్రిత పంటల సాగుకు రైతులు సానుకూలం 
  • అందుబాటులో విత్తనాలు
  • ‘నమస్తే తెలంగాణ’తో డీఏవో ఉషాదయాళ్‌

నీరు సమృద్ధిగా ఉన్నదని వరి వేయొద్దు. ఆ నీటితో పత్తి పండిస్తే ఎకరంలో 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తది. పండిన పంటను సీసీఐ మద్దతు ధరకు కొంటది. గిట్టుబాటు ధర రాక నష్టపోవుడు సమస్యే రాదు. పత్తిలో అంతర పంటగా కంది, పెసర, బబ్బెర వేస్తే అదనపు ఆదాయం పొందొచ్చు. మక్క రైతులు పత్తి సాగు చేస్తే మేలు’ అని వరంగల్‌ రూరల్‌ జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) ఉషాదయాళ్‌ పేర్కొన్నారు. వానకాలం పంటల సాగుపై ప్రభుత్వం ఖరారు చేసిన ప్రణాళికను రైతులు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానంపై ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.    

వరంగల్‌రూరల్‌ - నమస్తేతెలంగాణ

నీరు సమృద్ధ్దిగా ఉందని వరి పంట సాగు చేయవద్దు. అవసరమైన నీటి వసతి ఉన్న భూముల్లో పత్తి సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ఒక్కో ఎకరంలో 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిడుబడి రాగలదు. పత్తిని ప్రభుత్వమే రైతుల నుంచి సీసీఐ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది. గిట్టుబాటు ధర లభించక నష్టపోయే అవకాశమే లేదు. పత్తిలో కంది, పెసర, బబ్బెరను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. మధ్యలోనే గాకుండా పత్తి చుట్టూ రెండు వరసలు కంది సాగు చేస్తే ఇంకా మంచిది. ప్రస్తుతం పత్తి సాగు విస్తీర్ణం పెంచే పనిలో ఉన్నాం. గత ఏడాది వానకాలంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులను ఈ వానకాలంలో పత్తి సాగువైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాం’ అని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) ఉషాదయాల్‌ అన్నారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గు రువారం ఆమె ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడారు. వరంగల్‌రూరల్‌ జిల్లాలో ఈ వానకాలం ప ంటల సాగుపై ప్రభుత్వం ఖరారు చేసిన ప్రణాళికను రైతులు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కొత్త యా క్షన్‌ ప్లాన్‌లో వరిలో అంతగా మార్పు లేదని తెలిపారు. పత్తి సాగు విస్తీర్ణం మాత్రం సుమారు 56 వేల ఎకరాలు పెరగనుందని డీఏవో వెల్లడించారు. వానకాలం పంటల సాగు ప్రణాళికపై ఉ షాదయాల్‌ ఏమన్నారంటే ఆమె మాటల్లో...

2.20 లక్షల ఎకరాల్లో పత్తి

గత ఏడాది వానకాలం జిల్లాలో రైతులు 1,73,770 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. దీన్ని ఈ వానకాలంలో 2.20 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం వానకాలంలో 46,070 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులను పత్తి పంట సాగువైపు మళ్లిస్తున్నాం. ఎందుకంటే ఈ వానకాలంలో మొక్కజొన్న అసలే సాగు చేయవద్దని ప్ర భుత్వం స్పష్టం చేసింది. కేవలం పచ్చికంకులు, స్వీట్‌ కార్నర్‌, సీడ్‌ ప్రొడక్షన్‌, పశుగ్రాసం మొక్క జొన్న సాగుకు మాత్రమే అనుమతి ఉంది. గింజ రూపంలోఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కజొన్న మార్కెట్‌కు రావద్దు. అందుకే గత సంవత్సరం వానకాలంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఈ వానకాలంలో పత్తి సాగు చేయాలని చెపుతున్నాం. నీరు ఉందని వరి సాగు చేయటం కంటే పత్తి సాగు చేస్తే అధిక దిగుబడులు, ప్రభుత్వ మద్దతు ధర పొందవచ్చు. పత్తి కాకపోతే కంది, పసుపు, వేరుశనగ పంటలు, కూరగాయ, పండ్ల, పూలతోటలు సాగుచేయవచ్చు. ప్రభుత్వమే కందులను మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది. 

అరవై శాతం సన్నరకం వరి

జిల్లాలో గత వానకాలం రైతులు 1,09,446 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ వానకాలంలో దీన్ని 1.10 లక్షల ఎకరాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 60 శాతం అంటే 66 వేల ఎ కరాల్లో కచ్చితంగా సన్నరకాల వరి పంట ఉండాలే. మిగత 44 వేల ఎకరాల్లో మాత్రమే దొడ్డు ర కం పంట సాగు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సన్నరకాల ధాన్యానికి మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. రైస్‌మిల్లర్లూ సన్నరకం ధాన్యం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ వానకాలం వరి సాగు చేసే రైతులు తమ భూముల్లో జీలుగ వేయటం లాభదాయకం. ప్రభుత్వం 65 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తుంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు ఈ వానకాలం కోసం 6 వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలు కేటాయించింది. 

విత్తనాలు, ఎరువులు రెడీ..

ఈ వానకాలం పంటల సాగుకు జిల్లాలో విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్‌లో విత్తన డీలర్లు, ప్రభుత్వ సబ్సిడీ కౌంటర్లలో వివిధ రకాల వరి విత్తనాల అమ్మకం జరుగుతుంది. సన్న రకాలైన బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్‌- 15048 విత్తనాలు సరిపడ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు రకాల వరి విత్తనాల ధర 25 కిలోలకు రూ.775 ఉంది. అంటే ఒక కిలో రేటు రూ.31. అలాగే కంది, మినుము విత్తనాలు కూడా దొరుకుతున్నాయి. నాలుగు కిలోల కంది విత్తనాల పాకె ట్‌ ధర రూ.335.72. మినుము విత్తనాల రేటు 4 కిలోలకు రూ.426 ఉంది. 2.20 లక్షల ఎకరా ల్లో పత్తి సాగు కోసం 4.68 లక్షల ప్యాకెట్లు అవసరం. ఒక్కో ప్యాకెట్‌లో 750 గ్రాముల విత్తనాలుంటాయి. ఎకరానికి 2 ప్యా కెట్లు అవసరం. ఇప్పటికే 4 లక్షల ప్యాకెట్లు జిల్లాకు చేరుకున్నాయి. విత్తన డీలర్లు విక్రయిస్తున్నారు. రైతులు మంచి దిగుబడి ఇచ్చే నాణ్యమైన విత్తనాలే కొనాలి. సరైన వర్షపాతం నమోదైనపుడే నాటాలి. ఎక్కడైనా నకిలీ విత్తనాల అమ్మకం జరుగుతున్నట్లు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. పీఏసీఎస్‌లు, డీలర్ల వద్ద ఎరువుల నిల్వలు ఉన్నాయి. రైతులు కొనుగోలు చేయవచ్చు. 


logo