శనివారం 16 జనవరి 2021
Warangal-rural - May 29, 2020 , 00:33:59

ప్రకృతి మెచ్చేలా.. సేంద్రియ సేద్యం

ప్రకృతి మెచ్చేలా.. సేంద్రియ సేద్యం

  • పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ 
  • మధుమేహులకు ప్రత్యేక ధాన్యం 
  • కళాబత్‌, నవార, కర్పూరకేళి, సిద్ది, కాజిసాలా, సుగంధసాంబ, రక్తసాలి, బర్మాబ్లాక్‌లకు డిమాండ్‌ 
  • క్వింటాలు బియ్యానికి రూ.6వేల నుంచి రూ.10వేల వరకు ధర
  • దేశవాళీ వరి సాగు చేస్తున్న సోమారం రైతులు  
  • పూర్తి సేంద్రియ పద్ధతిలో విత్తనాలు తయారీ
  • పదేళ్లుగా 50 రకాల విత్తనాల ఉత్పత్తి 
  • జీవామృతాల వినియోగంతో రోగాలకు చెక్‌
  • ఇతర జిల్లాలకు విత్తనాల సరఫరా 

తొర్రూరు: ఎనుకట దంపుడు బియ్యం తిని, పజ్జొన్నలు కాల్సుక బుక్కి, మక్క గడ్కలో మామిడికాయ తొక్కేస్కొని తిన్న తరం మనుషులు గట్టిగున్నరు. రాళ్లు బుక్కి అరిగిచ్చుకున్నరు. పొద్దంత పనిచేసినా అలిసిపోకపోదురు. క్వింటాలు బరువు అవలీలగా మోద్దురు. అప్పుడు ఏ రోగమూ లేదు. నొప్పీ లేదు. దవాఖానల పొంట తిరిగే అవసరమూ రాలే. అప్పటి దేశవాళీ రకాల పంటలు, పండించే విధానమూ దీనికి కారణమైంది. కానీ, ఇప్పుడు ఆరోగ్యాన్ని పంచే ఆహారం అనారోగ్యాన్ని పెంచుతున్నది. హరిత విప్లవంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. అధిక దిగుబడే లక్ష్యంగా హైబ్రీడ్‌ రకాలు సాగు చేయాల్సి వస్తున్నది. అవసరం ఉన్నా, లేకున్నా అడ్డగోలు పురుగు మందులు కొట్టి పండించే సన్నబియ్యంతో అన్నం వండుకు తింటున్నా ఒంటిలో సత్తువ లేకుండా పోతున్నది. వరిలో పిండి పదార్థాలే తప్ప పోషకాలు లేక, వాటితో ఆకలి తీరుడే తప్ప శక్తి లభించక రెండు పదుల వయస్సు రాకముందే రోగాల బారిన పడాల్సి వస్తున్నది. దీనికి భిన్నంగా, ప్రకృతి మెచ్చేలా దేశవాళీ రకాలతో సేంద్రియ సేద్యం చేస్తున్నారు

మానుకోట జిల్లా తొర్రూరు మండలం సోమారానికి చెందిన రైతులు. తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జిస్తున్నారు. అంతరించిపోతున్న దేశవాళీ విత్తనాన్ని పూర్తి స్థాయి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ  కష్టానికి తగ్గ ఫలితం పొందుతున్నారు. దేశవాలీ సాగులో దిట్టగా పేరొందిన వీరు షుగర్‌ వ్యాధిగ్రస్తులకు వరి వంగడాలను సాగు చేస్తూ ఇతర జిల్లాలకు విత్తనాలను విక్రయిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యాచరణతో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారుతోంది. దేశానికి అన్నపూర్ణగా నిలబడుతోంది. గడిచిన యాసంగిలో రికా ర్డు స్థాయిలో మన రాష్ట్రంలో వరి పండింది. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఎఫ్‌సీఐ ఇచ్చిన నివేదిక తెలంగాణ రైతాంగానికి గర్వకారణంగా నిలిచింది. లాభసాటి పంటలు పండిం చి రాష్ర్టాన్ని ఆదర్శ రైతు రాజ్యంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం వానకాలంలో నియంత్రిత సాగు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సన్న రకం వరి ధాన్యాన్ని ఎక్కువగా పండించాలని రైతులకు సూచిస్తున్నది. సోమారం గ్రామంలో రావుల ప్రభాకర్‌, గడ్డం అశోక్‌ అనే రైతులు పదేళ్లుగా సుమారు 50 రకాల వరి విత్తనాలను పూర్తి స్థాయి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

వీరు వివిధ రాష్ర్టాల్లో సేకరించిన ధాన్యాన్ని ప్రకృతి సిద్ధంగా, గోఆధారిత వ్యవసాయంతో విత్తనోత్పత్తి మొదలుపెట్టారు. 2014 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో విజయరాం, సుభాశ్‌ పాలేకర్‌ నేతృత్వంలో దేశీ వరి విత్తనాల మేళా పేరుతో సదస్సు నిర్వహించారు. సదస్సుకు ప్రభాకర్‌, అశోక్‌ హాజరయ్యారు. సేంద్రియ పద్ధతిలో దేశీ వరి సాగుపై మెళకువలు నేర్చుకున్నారు. కర్ణాటక, కేరళ రాష్ర్టాల నుంచి పలు రకాల విత్తనాలు తెచ్చి ఇక్కడ సాగు చేస్తూ స్వతాహగా విత్తనాలు ఉత్పత్తి చేసి ఆసక్తి ఉన్న రైతులకు అందజేస్తున్నారు. ఈ తరహా సాగును చీకటాయపాలెం నుంచి పల్లె దయాకర్‌, రాయపర్తికి చెందిన పోలీస్‌కానిస్టేబుల్‌ బాదావత్‌ రమేశ్‌ తమ వ్యవసాయ క్షేత్రాల్లో సాగు చేస్తున్నారు.

వానాకాలంలో సాగుకు అనుకూలం 

సాధారణంగా వరి విత్తన రకాల ఆధారంగా 130 నుం చి 150 రోజుల్లో పంట కోతకు వస్తుంది. దేశవాళీ సన్న రకాలు 150 రోజుల తర్వాత కోతకు వస్తాయి. తెగుళ్ల నివారణకు రైతులు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. రసాయనాలతో ధాన్యంలో నాణ్యతా ప్రమాణాలు తగ్గి గ్లూకోజ్‌ శాతం పెరుగుతుంది. తింటే కడుపు నిండుతుంది. కానీ, ఆకలి తీరదు. దేహానికి పోషకాలు అందవు. సేంద్రియ పద్ధతి లో ఈ రైతులు బ్లాక్‌రైస్‌, రెడ్‌రైస్‌, కర్పూరకేళి, కాజిసాలా, సుగంధసాంబ, రక్తసాలి, బర్మాబ్లాక్‌ అనే దేశవాలీ వరి విత్తనాలను ఆరేళ్లుగా సాగు చేస్తున్నారు. 

పెట్టుబడి స్వల్పం.. లాభాలు అధికం 

దేశవాళీ వరి విత్తనాన్ని సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే అవకాశం ఉంది. సోమారం గ్రామంలో ఈ రైతులు కర్పూరకేళి, కళాబత్‌ (బ్లాక్‌రైస్‌), కాజిసాలా, కజురవళి, కర్ణాకట బాసుమతి, సిద్ది, బాస్‌బోగ్‌, చిట్టిముత్యాలు, ప్రాణహిత, సుగంధసాంబ, నవార(రెడ్‌రైస్‌), రక్తసాలి, బర్మాబ్లాక్‌ వంటి విత్తనాలను సాగు చేశారు. ఈ వరి ధాన్యంలో అత్యధిక పోషక విలువలుంటాయని పరిశోధనల్లో తేలింది.

ప్రధానంగా షుగర్‌ వ్యాధిగ్రస్తులు బ్లాక్‌రైస్‌, రెడ్‌రైస్‌, బ్రౌన్‌రైస్‌ తింటే అందులో గ్లూకోజ్‌ శాతం తక్కువగా, పీచు పదార్థాల శాతం ఎక్కువగా ఉండి దేహానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. రక్తసాలి అనే రకం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తప్రసరణ మెరుగయ్యేలా దోహద పడుతుంది. వాస్తవానికి ప్రస్తుతం మెజార్టీ రైతులు అవలంభిస్తున్న సాగు పద్ధతిలో విత్తనాలు, నాట్లు, దుక్కి మందు, కలుపు మందు, కలుపు కూలి, మందుల పిచికారీకి ఎకరాకు రూ.18,500 ఖర్చు వస్తోంది. సేంద్రియ సాగు పద్ధతిలో విత్తనం సొంతగా తయారు చేసుకుంటే.. దుక్కి, మందుల స్థానంలో జీవామృతాల వినియోగంతో కలుపు లే కుండా పోతున్నది. రసాయనాల వినియోగం అవసరం ఉం డడం లేదు. ఎకరాకు రూ.11,500 వరకు ఖర్చు వస్తున్నదని రైతులు చెబుతున్నారు. 

జీవామృతాలతో రోగాలకు చెక్‌ 

ప్రభాకర్‌, అశోక్‌ గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నా రు. సుభాశ్‌ పాలేకర్‌ విధానంలో జీవామృతం, బ్రహ్మాస్త్రం ద్రావణాలను తయారు చేశారు.  జీవామృతాన్ని ఎకరాకు సరిపడా తయారు చేయాలంటే 200 లీటర్ల నీటిలో 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం, పది కిలోల ఆవుపేడ, 2 కిలో ల బబ్బెర్ల పిండి, 2 కిలోల బెల్లం, దోసెడు పుట్టమన్ను కావాలి. వీటిని డ్రమ్‌లో వేసి ఉదయం, సాయంత్రం 5 నిమిషాలు కలియబెట్టాలి. 48 గంటలు డ్రమ్‌లో దీన్ని నిల్వ చేసిన తర్వాత వడబోసుకుని స్ప్రే చేసుకోవాలి. పంట కాలం 150 రోజుల్లో మూడు సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది. 

అగ్ని అస్త్రం ద్రావణం 

ఎకరానికి 10 లీటర్ల ఆవు మూత్రంలో కేజీ పొగాకు, కిలో పచ్చిమిర్చి, కిలో ఎల్లిగడ్డలు తీసుకుని వీటిని ముద్దగా దంచి ఆవు మూత్రంలో వేసి నాలుగైదు పొంగులు వచ్చే వరకు ఉడికిస్తే అగ్ని అస్త్రం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని 15 రోజుల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత 10 లీటర్ల నీటికి 300 గ్రాములు ఈ ద్రావణం కలిపి పిచికారీ చేయాలి. 

దేశవాళీ బియ్యానికి డిమాండ్‌

గో ఆధారిత సాగు విధానంలో ఎకరాకు 14 క్వింటా లు దిగుబడి వస్తుంది. వీటిని బియ్యంగా మార్చితే 10 క్వింటాలు అవుతాయి. ఒక్కో క్వింటా మార్కెట్‌లో రూ.6వేల ధర పలుకుతుంది. కర్పూరకేళి, సిద్ది, కాజిసాలా, సుగంధసాంబ బియ్యం క్వింటా రూ.6వేలు ఉండగా కళాబత్‌ (బ్లాక్‌రైస్‌), నవార(రెడ్‌రైస్‌) బియ్యం క్వింటాకు రూ.10 వేలు ఉంది. హన్మకొండ చింతగట్టులోని మహర్షి గోశాల ఆధ్వర్యంలో ఈ ముడి బియ్యాన్ని విక్రయిస్తున్నాం. సాధారణ సన్న రకాలు 30 బస్తాల దిగుబ డి వస్తే బియ్యాన్ని రూ.3500 వరకు విక్రయిస్తున్నారు. దేశవాళీ బియ్యం రూ.6వేల నుంచి రూ.10 వేల వరకు ధర పలుకుతున్నది. తద్వారా ఎకరాకు రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు ఆర్జించవచ్చు. 

- రైతులు రావుల ప్రభాకర్‌, గడ్డం అశోక్‌