శనివారం 16 జనవరి 2021
Warangal-rural - May 27, 2020 , 04:55:32

అందుబాటులో విత్తనాలు!

అందుబాటులో విత్తనాలు!

  • వ్యవసాయశాఖ విత్తన ప్రణాళిక ఖరారు
  • 35,599 క్వింటాళ్లు అవసరమని అంచనా
  • ఇప్పటికే మార్కెట్‌లో పత్తి విత్తన ప్యాకెట్లు
  • డీలర్ల వద్ద వివిధ రకాల వరి విత్తనాలు రెడీ
  • నియంత్రిత పద్ధతిలో సాగుపై రైతుల ఆసక్తి

వరంగల్‌రూరల్‌- నమస్తేతెలంగాణ : వానకాలం పంటల సాగు ప్రణాళికను ఖరారు చేసిన ప్రభుత్వం ఈ మేరకు విత్తనాలను అందుబాటులోకి తెస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేటు విత్తన సంస్థల ద్వారా రైతులకు అవసరమైన రకాలను మార్కెట్‌లో సమకూర్చుతున్నది. ఇప్పటికే సన్న, దొడ్డు రకం వరి విత్తనాలతో పాటు పత్తి విత్తన ప్యాకెట్లు విత్తన డీలర్లకు చేరాయి. ఈ వానకాలం నుంచి నియంత్రిత పద్ధతిలో పంటలసాగు విధానం అమలుకు నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా జిల్లాల వారీగా పంటల సాగు ప్రణాళికను ఖరారు చేసిన విషయం తెలిసిందే. రూరల్‌ జిల్లాలో ఈ వానకాలం మొక్కజొన్న పంట సాగుకు అవకాశం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. వరి సాగు విస్తీర్ణంలో మార్పు లేదని ప్రకటించింది. ఇందులో అరవై శాతం విస్తీర్ణంలో కచ్చితంగా సన్నరకాల వరి పంట సాగు చేయాలని స్పష్టం చేసింది. పత్తి, కంది, వేరుశనగ, పెసర, మినుము పంటల సాగు విస్తీర్ణం మాత్రం పెంచాలని వెల్లడించింది. ఈ లెక్కన జిల్లాలో పత్తి పంట ఒకటే 56 వేల ఎకరాల్లో పెరగనుం డటం విశేషం. జిల్లాలో ఈ వానకాలం 3,47,830 ఎకరాల్లో పంటల సాగు ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందులో వరి పంట 1.10 లక్షలు, కంది పంట 6 వేలు, సోయాబీన్‌ పంట 99, పత్తి పంట 2.20 లక్షలు, జొన్న పంట 500, పెసర పంట 1,500, మినుము పంట 1,000, వేరుశనగ 8,500, ఇతర పంటలు 231 ఎకరాల విస్తీర్ణం ఉంది. 1.10 లక్షల ఎకరాల వరిలో 60 శాతం అంటే 66 వేల ఎకరాల్లో సన్న రకాల వరి పంట సాగు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.

గత సంవత్సరం వానకాలం జిల్లాలో 1,09,446 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. నియంత్రిత పంటల సాగు విధానంలో ఈ వానకాలం వరి పంట సాగు విస్తీర్ణంలో అంతగా మార్పులేకపోగా స్వల్పంగా మరో 556 ఎకరాల్లో పెరగ నుండటం గమనార్హం. గత వానకాలం జిల్లాలో రైతులు 1,74,190 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఈ వానకాలం 2.20 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుకు ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. వేరుశనగ పంట సాగు విస్తీర్ణం 2,117 ఎకరాలు పెరగ నుంది.

గత వానకాలం జిల్లాలో రైతులు 6,383 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేయగా ఈ వానకాలం పంటల సాగు ప్రణాళికలో ప్రభుత్వం ఈ విస్తీర్ణాన్ని 8,500 ఎకరాలకు పెంచింది. జిల్లాలో ఈ వానకాలం కంది పంట 3,485 ఎకరాలు పెరగనుంది. గత వానకాలం రైతులు కేవలం 2,515 ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. ఈ వానకాలం దీన్ని ప్రభుత్వం జిల్లాలో 6 వేల ఎకరాలుగా ఖరారు చేసింది. పెసర, మినుము పంటల సాగు విస్తీర్ణం కూడా పెంచింది.

విత్తన ప్రణాళిక ఖరారు

ప్రభుత్వ పంటల సాగు ప్రణాళికకు అనుగుణంగా వ్యవ సాయ శాఖ జిల్లాలో ఈ వానకాలానికి విత్తన ప్రణాళికను ఖరారు చేసింది. జిల్లాలో 3,47,830 ఎకరాల్లో వరి, కంది, సోయాబీన్‌, పత్తి, జొన్న, జొన్న, పెసర, మినుము, వేరుశనగ, ఇతర పంటల సాగు చేసేందుకు 35,599 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి తాజాగా ప్రభుత్వానికి నివేదించారు. 29,700 క్వింటాళ్ల వరి, 480 క్వింటాళ్ల కంది, 29.7 క్వింటాళ్ల సోయాబీన్‌, 4.68 లక్షల పత్తి విత్తన ప్యాకెట్‌ (ఒక్కో ప్యాకెట్‌ 450 గ్రాములు)ల విత్తనాలు, 70 క్వింటాళ్ల జొన్న, 120 క్వింటాళ్ల పెసర, 80 క్వింటాళ్ల మినుము, 5,100 క్వింటాళ్ల వేరుశనగ, 20 క్వింటాళ్ల ఇతర విత్తనాలు కావాలని తమ నివేదికలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం విత్తన కంపెనీలకు అనుమతులు ఇస్తుంది. వరి విత్తనాల్లో కొన్నింటిని తెలంగాణ సీడ్స్‌, వ్యవసాయ యూనివర్సిటీ, కేవీకేల నుంచి సమకూర్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. సన్నరకాల వరి విత్తనాలు చాలా వరకు ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చాయి. జైశ్రీరాం, హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్‌, బీపీటీ తదితర రకాల సన్నరకం వరి విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇక పత్తి విత్తనాలు ఒక్కో ఎకరానికి రెండు ప్యాకెట్లు అవసరం. 2.20 లక్షల ఎకరాల్లో నాటేందుకు 4.68 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా ఇప్పటికే జిల్లాకు బీటీ-2 రకం పత్తి విత్తన ప్యాకెట్లు 4 లక్షలు విత్తన డీలర్లకు చేరినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా ప్యాకెట్లను విత్తన కంపెనీలు కేటాయిస్తాయని ప్రకటించారు. విత్తన దుకాణాల్లో అందుబాటులో ఉండటంతో  పత్తి పంట సాగు చేసేందుకు నిర్ణయించుకున్న రైతుల్లో కొందరు పత్తి విత్తన ప్యాకెట్లను కొని పెట్టుకుంటున్నారు. సీజన్‌ ప్రారంభమయ్యేలోగా కంది, వేరుశనగ, పెసర, మినుము తదితర పంటల విత్తనాలను కూడా అందుబాటులోకి తెచ్చే పనిలో వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు.

ప్రభుత్వం పంటల సాగు ప్రణాళికను ఖరారు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఊరూరా సదస్సులు నిర్వహిస్తున్నారు. గ్రామాల వారీగా సాగు చేయాల్సిన పంటల విస్తీర్ణాలను స్వయంగా తెలియజేస్తున్నారు. ప్రధానంగా కొద్ది రోజుల నుంచి ప్రతి గ్రామంలో పంటల సాగు ప్రణాళిక, నియంత్రిత పద్ధతిలో సాగు విధానంపై హాట్‌ టాపిక్‌ నడుస్తున్నది. సమగ్ర వ్యవసాయ పాలసీపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.