గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-rural - May 27, 2020 , 04:46:30

ఆపతిలో ఆదుకున్నది కేసీఆర్‌ సారే

ఆపతిలో ఆదుకున్నది కేసీఆర్‌ సారే

  • కరోనా కష్టాల్లోనూ రైతుకు అండదండగా సర్కారు
  • దేశంలో ఎక్కడా లేని విధంగా  రైతుల అభివృద్ధికి కృషి
  • రూ. 20లక్షలతో క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం
  • ప్రతి రైతుకు కల్లం ఉండాలి..  
  • మహబూబాబాద్‌ మిర్చి దేశంలో నంబర్‌వన్‌
  • వెయ్యి ఎకరాలతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌
  • అర్బన్‌, మహబూబాబాద్‌ సాగు సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ/మహబూబాబాద్‌/ హన్మకొండ : రైతులను రాజులుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. నియంత్రిత సాగు విధానం పాటించి రైతులు లబ్ధిపొందాలని సూచించారు. వానకాలం 2020 పంటల సాగు ప్రణాళికపై వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని హన్మకొండలోని అంబేద్కర్‌భవన్‌, మహబూబాబాద్‌లోని నందనా గార్డెన్స్‌లో మంగళవారం వేర్వేరుగా సదస్సులు నిర్వహించారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి దయాకర్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో రైతును రాజును చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా ప్రస్తుత వానాకాలం సీజనల్‌ నియంత్రిత సాగు విధానం అమలు చేసి రైతులకు లాభం కలిగేలా చేసేందుకుగాను కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ఒక్కో క్లస్టర్లలో రూ.20 లక్షలతో రైతు వేదిక భవనాలు రెండు నెలల్లోపు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణాలకు భూమి ఇచ్చే దాతల పేరు పెడతామన్నారు. రైతు సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని, ఎరువులు, విత్తనాలు, కరెంటు కోసం ధర్నాలు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.30వేల కోట్లు అప్పు తెచ్చి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతుబంధు కోసం రూ.7వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. రూ.25వేల రుణాలు తీసుకున్న రైతులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రూ.1200 కోట్లు కేటాయించారని అన్నారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్ని వేల కోట్లు అవసరమా అని పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్లు ఎకసెక్కాలు చేశారని, ఇప్పుడు వద్దంటే నీళ్లు వస్తున్నాయని, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ప్రణాళికలు స్పష్టంగా లేవని, ఇక్కడ కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలకు డిమాండ్‌ ఉంటుందని,  ఆ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మహబూబాబాద్‌లో సాగు చేసే మిర్చి దేశంలో నంబర్‌వన్‌ అని, మిర్చి నుంచి ఆయిల్‌ తీసే పరిశ్రమను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతి మండలంలో 5వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మిస్తున్నామని, డోర్నకల్‌లో 30వేల మెట్రిక్‌ టన్నుల గోదాములు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో త్వరలోనే వెయ్యి ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు మంత్రి చెప్పారు.  తెలంగాణ సోనాకు డిమాండ్‌ ఉందని రైతులు ఆ రకాన్ని సాగుచేయాలని కోరారు.

ఉపాధి నిధుల నుంచి కళ్లాలు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి తెలంగాణ వచ్చిందంటే సీఎం కేసీఆర్‌ కృషే కారణమన్నారు. కాళేశ్వరం, దేవాదుల పుణ్యమా అని ఎన్నడూ లేని విధంగా పంట దిగుబడి వచ్చిందని, అందుకే నియంత్రిత సాగు విధానం తెస్తున్నారని తెలిపారు. దీనికి ‘సమగ్ర పంటల విధానం’ అని పేరు పెడితే బాగుంటుందని సూచించారు. అర్బన్‌ జిల్లాలో ఆయిల్‌ ఫాంను ప్రోత్సహిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పంటలకు సరిపడా కోల్డ్‌స్టోరేజ్‌లు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అర్బన్‌ జిల్లాలో 1.70లక్షల వేల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటల కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు తెలిపారు. పంటల ఉత్పత్తి కంటే ఉత్పాదక సాధించడం ముఖ్యమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫుడ్‌ప్రాసెస్‌ జోన్‌లు ఏర్పాటు చేసేందుకు సీఎం ముందుకు వచ్చారని, వ్యవసాయశాఖ ఉత్పాదకపై అవగాహన కల్పించాలని కోరారు. ఎంపీ పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ సీఎం తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులకు సమాజంలో గౌరవం పెరుగుతున్నదని చెప్పారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ డిమాండ్‌కు అనుసరించి సప్లయ్‌ ఉండాలని, వరంగల్‌ పట్టణానికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని కోరారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మాట్లాడుతూ పట్టణానికి దగ్గరగా ఉన్న హసన్‌పర్తి, ఐనవోలు, ఖిలా వరంగల్‌, వరంగల్‌, హన్మకొండ మండలాల్లో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టానికి నియంత్రిత సాగు విధానం అవసరమన్నారు.

ఇందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు వస్తాయని కలలో కూడా అనుకోలేదని, డోర్నకల్‌ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పంటలు పండాయన్నారు. ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వమూ రైతు గురించి ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. కొత్తగా పాస్‌పుస్తకాలు వచ్చిన రైతులకు రైతుబంధు అందించాలని పల్లాను కోరారు. మల్యాల, మాధాపురం ముడుపుగల్లు, అమనగల్‌ ఫారెస్టు సమస్యను తీర్చాలన్నారు. మల్యాలలో 160 ఎకరాల హార్టికల్చర్‌కు సంబంధించిన భూములున్నాయని, అందులో హార్టికల్చర్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, వరంగల్‌లో జెడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ శ్రీరాములు, అదనపు కలెక్టర్‌ దయానంద్‌, జేడీఏ ఉషాదయాళ్‌, సీపీవో జెడ్‌రాందాస్‌, జెడ్పీసీఈవో ప్రసూనారాణి, డీసీవో నీరజ, ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఆర్‌డీవో  వెంకారెడ్డి, మహబూబాబాద్‌లో జెడ్పీచైర్‌పర్సన్‌ బిందు, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ బాలాజీనాయక్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జెడ్పీసీఈవో సన్యాసయ్య, డీఏవో ఛత్రునాయక్‌, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, ఆత్మ, ఓడీసీఎమ్మెస్‌ చైర్మన్లు, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ మర్రి రంగారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపుడి నవీన్‌రావు, డీఆర్‌డీఏ పీడీ విద్యాచందన, మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త క్రాంతి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, రైతుబంధు సమితి డోర్నకల్‌, కేసముద్రం కో ఆర్డినేటర్లు హైమావతి, యాకూబ్‌రెడ్డి,సిగింల్‌విండో చైర్మన్లు, అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 

ప్రతి రైతుకూ రైతుబంధు

వ్యవసాయం చేసే ప్రతి రైతుకూ రైతుబంధు ఇస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయా సదస్సుల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మార్పు కోసం చేస్తున్న ప్రతి పనినీ రైతులకు వివరంగా తెలియజేయాలనే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గత వానకాలంలో 40లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని, ఇప్పుడూ అంతే విస్తీర్ణంలో సాగవుతుందని చెప్పారు. దొడ్డు రకానికి బదులు సన్నరకం సాగుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. తమిళనాడులో క్వింటాల్‌ మక్కలు రూ.900కే కొంటున్నారని, రాష్ట్రంలో రైతులు నష్టపోవొద్దనే రూ.1760 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. రైతుబంధు ఎగ్గొట్టడానికి నియంత్రిత సాగు విధానం తెచ్చారనడం హాస్యాస్పదమన్నారు. కాళేశ్వరం జలాలను చెరువుల్లో నింపడం ద్వారా అంచనాలకు మించి వరి పండిందని చెప్పారు. రైతులు మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి పంటలు సాగు చేయాలని కోరారు. ప్రతి క్లస్టర్‌లో రూ. 20 లక్షలతో రైతు వేదికలు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలని, వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

-రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిlogo