ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - May 25, 2020 , 02:09:46

రైతే రాజు

రైతే రాజు

  • అదే సీఎం కేసీఆర్‌ సంకల్పం
  • సర్కారు బాటలో సాగుదాం..
  • రైతుకు నష్టం కలుగొద్దనే నియంత్రిత విధానం
  • డిమాండ్‌ ఉన్న పంటలతో అధిక లాభాలు
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • నూతన సాగు ప్రణాళికపై సమీక్ష

‘రైతే రాజు అనడం కాదు.. నిజంగా రైతుని రాజులా చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం. అందుకే చెరువులను పునరుద్ధరించారు.. సాగు నీటి ప్రాజెక్టులు కట్టారు.. పంటలకు సరిపడా నీళ్లిస్తున్నారు.. 24 గంటల పాటు ఉచిత కరంటు.. సాగుకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించారు. ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తెచ్చారు. నేను ఒక రైతునే.. రైతుగా చెబుతున్నా.. ప్రభుత్వం చెప్పిన మాటలు విందాం.. తప్పకుండా రైతు రాజవుతాడు’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. 2020 పంటల సాగు ప్రణాళికపై ఆదివారం జనగామ, వరంగల్‌ రూరల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు ప్రణాళిక తయారవుతున్నదన్నారు. ఏయే నేలల్లో ఏయే పంటలు వేస్తే గిట్టుబాటు, మద్దతు ధర వస్తుందో కొత్త విధానం ద్వారా ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. 

వరంగల్‌ రూరల్‌-నమస్తే తెలంగాణ/జనగామ: వానకాలం -2020 పంటల సాగు ప్రణాళికపై రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంభ కన్వెన్షన్‌హాల్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాకు సంబంధించి హన్మకొండ అంబేద్కర్‌ భవన్‌లో ఆదివారం వేర్వేరుగా అవగాహన సదస్సులు నిర్వహించారు. జనగామలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రి దయాకర్‌రావు, క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జెడ్పీచైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, శాప్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ నిఖిల, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్‌ ఉపేందర్‌రెడ్డి, హన్మకొండలో జరిగిన సదస్సుకు ఎంపీలు పసునూరి దయాకర్‌, బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, కలెక్టర్‌ హరిత, అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి, డీఏవో ఉషాదయాల్‌, వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సదానం దం, రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్‌ భిక్షపతి, ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ రామస్వామినాయక్‌ తదితరులు హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. వానకాలం సాగులో మక్కకు స్వస్తి పలికి నిర్దేశించిన మేరకు దొడ్డు, సన్నరకాల వరి, పత్తి సాగుచేద్దామని, ఆ దిశగా ప్రతి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయి లో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ అన్నీ ఆలోచించే నియంత్రిత పంటల విధానంపై నిర్ణయం తీసుకున్నారని, రైతులను తప్పుదోవ పట్టించి తప్పు డు ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను ఉచికిచ్చి కొట్టాలన్నారు. గతంలో రైతులు గిట్టుబాటు ధరలు, కరెంటు, ఎరువులు, విత్తనాల కోసం రోడ్డె క్కి ధర్నాలు, ఆందోళన చేశారని, నేడు వద్దన్నా నీళ్లు వస్తున్నాయని తెలిపారు. కరెంటు, ఎరువులు, విత్తనాలు అందిస్తూ ప్రభుత్వమే పండిన పంటలను కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకుంటున్న మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు, పంట రుణాల మాఫీకి రూ.1,200 కోట్లు  కేటాయించారని కొనియాడారు. కేసీఆర్‌ దయతో కాళేశ్వరం, ఎస్సారెస్పీ, దేవాదుల ద్వారా పుష్కలంగా నీళ్లొస్తున్నాయని, ధర కోసం కొట్లాడే రోజులు పోవాలన్నారు. డి మాండ్‌ ఉన్న పంటలు పండించాలని పిలుపునిచ్చారు.

 రోడ్లపై పంట ఉత్పత్తులు ఆరబోయకుండా పంట భూముల్లో కళ్లాలు నిర్మించుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. రెండు జిల్లాల్లోని క్లస్టర్లలో మీటింగ్‌లు పెట్టి అవగాహన కల్పించాలని, నియంత్రిత పంటల సాగు విధానంపై ఊరూరా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. నియోజకవర్గానికో గోదాం, మండలానికో కూరగాయల మార్కెట్‌, ప్రతి గ్రామంలో రైతు వేదికల నిర్మాణం జరుగుతున్నదని, స్థలాలు ఇస్తే దాతల పేర్లు ప్రాంగణానికి పెడుతామన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే రైతుబంధు అందుతుందన్నారు. రైతును రాజుగా చూడాలన్నది సీఎం లక్ష్యమని, ప్రభుత్వం చెప్పిన పంటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లాలో వెయ్యి ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు సీఎంను ఒప్పించామని, స్థలాన్ని సేకరించాల్సి ఉందని తెలిపారు. 

నిజాయితీ లేని ప్రతిపక్షాలు.. :- మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కేసీఆర్‌ను విమర్శించే వాళ్లకు, వారి పార్టీలకు నిజాయతీలేదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. జనగామలో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వం ఏ మంచి పనిచేసినా కొందరు విమర్శిస్తున్నారని, దొంగలే దొంగదొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రైతులకు కావాల్సినవి ప్రభుత్వ చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక మొరుగుతున్న వాళ్లను పట్టిచుకోవద్దని సూచించారు.

 రాష్ట్రంలో కోటీ 40లక్షల ఎకరాలకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తున్నామని, రైతు సంక్షేమం కోరని ప్రతిపక్షపార్టీలు రైతుబంధు, పంటల సాగు విధానంపై విమర్శలు చేస్తే ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విత్తనాలు, ఎరువుల కోసం లైన్లో నిలబెట్టి, కరెంటు మోటార్లు కాలబెట్టి, ట్రాన్స్‌ఫార్మర్లు పేలేలా ఓవర్‌లోడ్‌ వేసి రైతును ధీనస్థితికి తెచ్చిన కాంగ్రెస్‌కు, తమ ప్రభుత్వ పాలిత రాష్ర్టాల్లో రైతులను పట్టించుకోని బీజేపీకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మాట్లాడే హక్కులేదన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ ఏనాడూ వ్యవసాయాన్ని పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు రైతుబంధు, పంటల సాగు విధానంపై చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. జనగామలో మెడికల్‌ కాలేజీకి జనగామ-సిద్దిపేట రహదారిలోని హౌజింగ్‌బోర్డుకు చెందిన 17 ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో రాజయ్య, సంపత్‌రెడ్డి తదితరులు మంత్రి ఎర్రబెల్లికి వినతిపత్రం అందజేశారు. హన్మకొండలో జరిగిన సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు లాభాల బాట నడ వాలన్నదే సీఎం ఆశయమని చెప్పారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాల నియో జకవర్గంలో ప్రభుత్వం సూచించిన పంటలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మాట్లాడుతూ రైతులు అప్పుల పాలు కాకుండా లాభాలు గడించాలని, తన నియోజకవర్గంలో పంట మార్పిడిపై దృష్టి పెట్టేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రూరల్‌ జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు పండిస్తే రైతుకు లాభాలు వస్తాయన్నారు. జిల్లాలో ఎక్కడా నీటి కొరత లేదని, పంటల మార్పిడికి అనువుగా ఉందని తెలిపారు. 

రైతు బాగుంటేనే దేశం సుభిక్షం

రైతులను సంఘటితం చేస్తేనే రైతు రాజ్యం వస్తుంది. తెలంగాణలో విభిన్న నేలలున్నాయి. మంచి వర్షపాతం నమోదవుతున్నది. నైపుణ్యం ఉన్న రైతులూ ఉన్నారు. వారి గురించి ఆలోచించే ముఖ్యమంత్రీ ఉన్నారు. ఇది మన అదృష్టం. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తే బంగారం లాంటి పంటలు పండించొచ్చు. ప్రపంచ మార్కెట్‌తో మనం పోటీ పడొచ్చు’ 

 -మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 


పండుగలా వ్యవసాయం 

వ్యవసాయాన్ని దండుగ అన్న గత ప్రభు త్వాలను చూశాం. కానీ, తెలంగాణ వచ్చాక పండు గలా వ్యవసాయం మారింది. ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎదిగితేనే మన రాష్ట్రం బాగుపడుద్దని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ముఖ్యమంత్రి స్వయానా రైతు కావడంతో వ్యవసాయంపై ఇలా ఆలోచిస్తున్నారు. స్వగ్రామమైన నడికూడ మండలం వరికోలు గ్రామంలో రైతు వేదిక నిర్మాణం కోసం తన వంతు సహాయం చేస్తా.

-ఎమ్మెల్సీ పోచంపల్లి


క్లస్టర్లకు వెళ్లి అవగాహన కల్పించాలి

పంటల మార్పిడిపై జిల్లా, మండలం, క్లస్టర్‌లకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలి. యాసంగిలో దేశంలో అత్యధికంగా తెలంగాణలో వరి పండింది. వాస్తవానికి 70 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే చాలు. రైతుబంధు కావాలని ఏ సంఘం, ఏ రైతు, ఏ ప్రతిపక్షాలూ అడగలేదు. కానీ మన ముఖ్యమంత్రి ఇచ్చారు. పోతిరెడ్డిపాడుకు పొక్కలు పెట్టింది కాంగ్రెస్‌, టీడీపీ. ఈ దుస్థితికి అప్పటి భారీ నీటిపారుదలశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిర్వాకమే కారణం. తెలంగాణకు అన్యాయం చేసింది ఆ రెండు పార్టీలే. 4 రంధ్రాలకు 14 రంధ్రాలు పెట్టింది పొన్నాల కాదా?. ఇప్పుడు ఆయనే దీక్ష చేస్తారనడం విడ్డూరంగా ఉంది. నీళ్ల మీద సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు, రాజకీయ విలువలు పొన్నాలకు లేవు. జనగామలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. 

-రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి