మంగళవారం 26 మే 2020
Warangal-rural - May 23, 2020 , 03:53:57

తేలని మిస్టరీ

తేలని మిస్టరీ

హత్యా..? ఆత్మహత్యా..?

తొమ్మిది మంది మృతి వీడని చిక్కుముడిలా మారింది. ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఎవరైనా హత్య చేశారా..! మరింకేం జరిగి ఉంటుంది.. అనే ప్రశ్నలు మెదళ్లను తొలుస్తున్నాయి. బావిలో శవాలు ఒకదానితర్వాత మరొకటి తేలడం.. ఎలాంటి ఆధారాలు లభించకపోవడం మిస్టరీగా మారింది. వారిపై విషప్రయోగం జరిగిందా.. లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు  ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. 

-వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ

వరంగల్‌ రూరల్‌, నమస్తేతెలంగాణ: తొలిరోజు నలుగురి మృతదేహాలు. రెండో రోజు మరో ఐదుగురు. ఒకే బావిలో మొత్తం తొమ్మిది మంది మృతదేహాలు లభ్యం కావడం వి షాదం నింపింది. మృతుల్లో పశ్చిమబెంగాల్‌ రాష్ర్టానికి చెం దిన ఒకే కుటుంబంలోని ఆరుగురితోపాటు ఇద్దరు బీహారీలు, ఒక త్రిపురవాసి ఉండడంతో అసలేం జరిగి ఉంటుందనేది మిస్టరీగా మారింది. గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఓ బార్‌దాన్‌ గోడౌన్‌ ఆవరణలోని బావిలో గురువారం పోలీసులు నలుగురి మృతదేహాలను కనుగొనడం, మరో నలుగురు వ్యక్తులు అదృశ్యమైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఒకదాని తర్వాత ఒకటి మృతదేహాలు లభ్యం అవుతుండటంతో పోలీసులు బావిలోని నీటిని బయటకు తోడారు. రెండోరోజు బావిలో నుంచి మొత్తం ఐదు మృతదేహాలను వెలికి తీశారు. మృతు ల్లో ఎండీ షకీల్‌(38), ఎండీ షాబాద్‌ అలం(19), ఎండీ సోహెల్‌ అలం(17), శ్రీరాంకుమార్‌ (26), శ్యామ్‌కుమార్‌ (21) ఉన్నట్లు గుర్తించారు. వీరిలో షకీల్‌ది త్రిపుర రాష్ట్రం. కొన్నేళ్ల నుంచి అతడి కుటుంబం వరంగల్‌లోని శాంతినగర్‌ లో ఉంటుంది. ఇరవై ఏళ్ల క్రితం పశ్చిమబెంగాల్‌ నుంచి వరంగల్‌కు వచ్చిన ఎండీ మక్సూద్‌ అలం కుటుంబం గత డిసెంబరు నుంచి గొర్రెకుంట ఇండస్ట్రీస్‌ ఏరియాలోని బారదాన్‌ గోడౌన్‌ వద్ద నివసిస్తుంది. వీరిలో మక్సూద్‌, నిషా దం పతులు, వారి కూతురు బష్ర ఖాతర్‌, ఆమె మూడేళ్ల బాబు మృతదేహాలు గురువారం బావిలో నీటిపై తేలగా, మక్సూద్‌ కొడుకులైన షాబాద్‌, సోహెల్‌ మృతదేహాలు శుక్రవారం ల భ్యమయ్యాయి. బీహార్‌కు చెందిన శ్రీరాంకుమార్‌, శ్యామ్‌కుమార్‌ ఇదే బార్‌దాన్‌ గోడౌన్‌ గదుల్లో నివసించేవారు.

అనూహ్యంగా తొమ్మిదో మృతదేహం 

మక్సూద్‌ కుటుంబ సభ్యుల్లోని నలుగురి మృతదేహాలు గురువారం బావిలో లభ్యం కావడంతో మక్సూద్‌ కొడుకు లు ఇద్దరు, బీహార్‌కు చెందిన ఇద్దరు అదృశ్యమైనట్లు పోలీసులు ప్రకటించారు. అయితే శుక్రవారం ఒకరి తర్వాత ఒకరి మృతదేహాలు బావిలో లభ్యమయ్యాయి. ఇదే సమయంలో అనూహ్యంగా బావిలో తొమ్మిదో మృతదేహం లభ్యం కావడంతో సంచలనానికి తెరలేచింది. ఇతడు ఎక్కడి నుంచి వ చ్చాడు అనేది ఆసక్తికర చర్చకు దారితీసింది. వరంగల్‌లోని శాంతినగర్‌లో ఉండే షకీల్‌ మృతదేహం కనుగొన్న తర్వాత పోలీసులు తలపట్టుకున్నారు. షకీల్‌ బార్‌దాన్‌ గోడౌన్‌కు ఎందుకు వచ్చాడనేది పోలీసుల మెదళ్లకు తట్టడంలేదు. 

విష ప్రయోగం జరిగి ఉంటుందా..?

శుక్రవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ గొర్రెకుంటలోని బార్‌దాన్‌ గోడౌన్‌ సందర్శించారు. మృతదేహా లు లభ్యమైన బావిని, మృతదేహాలను పరిశీలించారు. మా మునూరు ఏసీపీ శ్యామ్‌సుందర్‌, గీసుగొండ ఇన్‌స్పెక్టర్‌ శివరామయ్యతో మాట్లాడి మృతుల వివరాలు తెలుసుకున్నా రు. వీరి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నా రు. ఇందులో మృతులపై విష ప్రయోగం ఏమైనా జరిగిం దా? అనేది ఒక కోణం ఉన్నట్లు తెలిసింది. బార్‌దాన్‌ గోడౌ న్‌ ఆవరణలో బుధవారంరాత్రి ఎండీ మక్సూద్‌ కూతురైన బష్ర ఖాతర్‌ కుమారుడు (3) బర్త్‌డే ఫంక్షన్‌ జరిగిందని, ఇం దులో బీహారీలు ఇద్దరు, షకీల్‌ పాల్గొన్నారని ప్రచారంలో ఉంది. భోజనాలు చేసి కూల్‌డ్రింక్స్‌ తాగారని, అందులో ఎ వరైనా విషం కలిపి ఉంటారని స్థానికులు చెప్పుకుంటున్నా రు. అయితే బర్త్‌డే పార్టీలో పాల్గొన్న వ్యక్తుల్లో ఎవరైనా ఒక రు ఈ విష ప్రయోగం చేసి ఇతరులు చనిపోయాక వారి మృ తదేహాలను బావిలో పడేసి తర్వాత సదరు వ్యక్తి బావిలో ఆ త్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం అదేమీ లేదని పోలీసులు వెల్లడించారు. అలాగే మృతుల్లో ఎవరెవరికీ ఎలాంటి సంబంధాలున్నాయి? ఆర్థిక పరమైన ఇబ్బం దులు ఉన్నాయా? మక్సూద్‌ కుటుంబానికి, బీహార్‌ వాసులకు గతంలో ఏమైనా గొడవలు జరిగాయా? వీరే కాకుండా ఈఘటనలో చనిపోయిన షకీల్‌కు వీరితో ఉన్న సంబంధం ఏమై ఉంటుంది? అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.  షకిల్‌ ప్రత్యేకంగా వరంగల్‌లోని శాంతినగర్‌ నుంచి బర్త్‌డే పార్టీకి వచ్చినట్లు తెలుస్తున్నది. మక్సూద్‌ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు సమాచారం. పో లీసులు చనిపోయిన వ్యక్తుల మొబైల్స్‌ను స్వాధీనం చేసుకు ని వాటి ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసింది. నీటిని తోడిన తర్వాత పోలీసులు బావిలోకి దిగి క్లూస్‌ కోసం గా లించారు. మృతదేహాలపై గాయాలు లేకపోవడం వల్ల ఈ కే సు మిస్టరీని ఛేదించడం ప్రస్తుతం పోలీసులకు సవాల్‌గా తయారైంది.  

ఆత్మహత్యా.. హత్యా..!

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలోని సాయిదత్త బార్‌దాన్‌ గోదాంలోని బావిలో తొమ్మి ది మంది విగతజీవులు కాగా.. ఈ మిస్టరీపై పోలీసులు, స్థానికులు ఎటూ తేల్చలేకపోతున్నారు. గోదాం ఆవరణలోని గది లో చక్కెర పొంగళి, ప్లేట్‌లో అన్నం, రొట్టెలు, కూరగాయలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అయితే వీరు తినే ఆహారం లో ఏదైనా విషప్రయోగం జరిగిందా.. లేక వారే ఆత్మహత్య చేసుకున్నా రా ఎవరికీ అర్థం కావడంలేదు. 

ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి ఎర్రబెల్లి 

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. ఎంజీఎం మార్చురీలో మృతదేహాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబంలోని ఆరుగురు, వారితోపాటు కూలిపని చేసుకునే మరో ముగ్గురు విగతజీవులుగా మారడం బాధాకరమన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అనంతరం ఘటనకు సంబంధించిన కారణాలేంటని రూరల్‌ కలెక్టర్‌ హరిత, పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎం సందర్శించిన వారిలో చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎంపీ  పసునూరి దయాకర్‌, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఉన్నారు.  కాగా మృతి చెందిన వలస కూలీల కుటుంబాలకు మంత్రి సత్యవతి రా థోడ్‌ లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అనంతరం వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, చీఫ్‌విప్‌, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ రూ.50 వేల పరిహారం ప్రకటించారు.

త్వరలోనే మిస్టరీ ఛేదిస్తాం :  సీపీ రవీందర్‌ 

గొర్రెకుంటలో చోటుచేసుకున్న అనుమానాస్పద మృతుల వివరాలు గుర్తించినట్లు సీపీ రవీందర్‌ తెలిపారు. మృతుల ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తామన్నారు. కేసు చిక్కుముడులను విప్పడానికి  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, అన్ని కో ణాల్లో దర్యాప్తు చేసి త్వరలోనే మిస్టరీని ఛేదిస్తామని ఆయన తెలిపారు.

పోస్టుమార్టం పూర్తి చేసిన ఫోరెన్సిక్‌ నిపుణులు

 గొర్రెకుంట ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో గు ర్తించిన తొమ్మిది మృతదేహాలకు శుక్రవారం రాత్రి ఫోరెన్సిక్‌ నిపుణుల బృం దం పోస్టుమార్టం  పూర్తి చేసింది. పది గంటల వరకు తొమ్మిది మృతదేహాలకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం వాటిని భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబసభ్యులు గానీ వారి బంధువులు గాని కోరినట్లయితే అప్పగిస్తామని వారు తెలిపారు. 


logo