మంగళవారం 26 మే 2020
Warangal-rural - May 22, 2020 , 02:40:34

గనుల్లో బొగ్గు ఉత్పత్తి షురూ

గనుల్లో బొగ్గు ఉత్పత్తి షురూ

లే ఆఫ్‌ ఎత్తివేతతో విధులకు హాజరైనకార్మికులు

గనుల వద్ద వైరస్‌ నివారణ చర్యలు 

కార్మికులతో కరోనా ప్రతిజ్ఞ 

 50 రోజుల్లో రెండున్నర లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం

భూపాలపల్లి టౌన్‌, మే 21 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ గనుల్లో గురువారం నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం సింగరేణి వ్యాప్తంగా భూగర్భ గనుల్లో లే ఆఫ్‌ ప్రకటించి కేవలం ఓసీలను మాత్రమే కొనసాగించింది. కాగా 50 రోజుల లే ఆఫ్‌ అనంతరం సింగరేణి యాజమాన్యం లే ఆఫ్‌ ఎత్తివేయడంతో గురువారం భూపాలపల్లిలో కార్మికులు విధులకు హాజరయ్యారు. ఏరియాలో కేటీకే 1,5,6,8 ఇైంక్లెన్‌లు లే ఆఫ్‌తో  50 రోజులుగా మూతపడ్డాయి. కేవలం ఏరియాలోని కేటీకే సెక్టార్‌ ఓసీ-2, మల్హర్‌ మండలంలోని  ఓసీ నుంచి బొగ్గు ఉత్పత్తి జరిగింది.

కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం భూగర్భ గనుల్లో లే ఆఫ్‌ ఎత్తి వేసింది. దీంతో భూపాలపల్లిలోని నాలుగు భూగర్భ గనులు ఉత్పత్తిని ప్రారంభించాయి. కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేం దుకు అధికారులు బొగ్గు గనుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్మికులను థర్మల్‌  స్క్రీనింగ్‌ చేయడంతో పాటు శానిటైజేషన్‌, ప్రథమ చికిత్స కిట్లను ఏర్పాటు చేశారు. అన్ని గనులు, కార్యాలయాల్లో అధికారులు కార్మికులతో కరోనా ప్రతిజ్ఞ చేయించారు. కార్మికులతో గనుల వద్ద ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి విధి నిర్వహణలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.  50 రోజుల్లో భూపాలపల్లిలోని నాలుగు భూగర్భ గనుల్లో సుమారు రెండున్నర లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏరియాలోని సింగరేణి జీఎం కార్యాలయంలోనూ అధికారులు సిబ్బందితో కరోనా ప్రతిజ్ఞ చేయించారు. కరోనా నివారణ చర్యలపై జీఎం నిరీక్షణ్‌రాజ్‌, ఎస్‌వోటూ జీఎం రఘుపతి సిబ్బందికి వివరించారు.


logo