శనివారం 06 జూన్ 2020
Warangal-rural - May 22, 2020 , 02:40:34

ఇంటి పర్మిషన్‌ ఈజీ.!

 ఇంటి పర్మిషన్‌ ఈజీ.!

జూన్‌ 2 నుంచి టీఎస్‌ బీ-పాస్‌ అమలు

21 రోజుల్లో నిర్మాణానికి అనుమతి

రూపాయి చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ పత్రం జారీ

75 గజాలకు అనుమతి అవసరం లేదు

200 గజాల వరకు స్వీయ ధ్రువీకరణతో..

బహుళ అంతస్తులకు   సింగిల్‌ విండో విధానంలో..

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. దీనర్థం ఇల్లు నిర్మించడం, పెళ్లి చేయడం అనేవి పెద్ద ప్రహసనంతో కూడుకున్న పని అని. నిర్మాణానికి అనుమతి తీసుకోవడం మొదలు పూర్తయ్యే వరకూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పనులు పూర్తి చేసేవారు. ఒకప్పుడు పట్టణాల్లో ఇంటి నిర్మాణానికి భారీ కసరత్తు చేయాల్సి వచ్చేది. కానీ, ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఇంటి నిర్మాణం ఈజీగా జరిగేలా అనుమతి పనులను సులభతరం చేయనుంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు సులువుగా ఇంటిని నిర్మించుకోనున్నారు.

-వరంగల్‌/భూపాలపల్లిటౌన్‌  

రూపాయికే అనుమతి పత్రం..

మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ పరిధిలో భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతినిచ్చే నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. ఇందుకోసం టీఎస్‌ బీపాస్‌ను రూపొందించి జూన్‌ 2 నుంచి అమలులోకి తీసుకు రానుంది. 75 గజాల లోపు ఇంటిని నిర్మించే భవనాల కోసం ఆన్‌లైన్‌లో  రూపాయి చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే వెంటనే అనుమతి పత్రం జారీ చేస్తారు. అలాగే 200 గజాల వరకు (జీ ప్లస్‌1) ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన వెంటనే అనుమతి పత్రం పొందొచ్చు. 200 నుంచి 500 చదరపు గజాలలోపు జీ ప్లస్‌2 కంటే ఎక్కువ అంతస్తుల నిర్మాణాలకు కలెక్టర్‌ ఆధ్వర్యంలోని స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం సింగిల్‌ విండో విధానంలో క్షేత్రస్థాయి పరిశీలిస్తుంది. అనంతరం అధికారులు అనుమతులు మంజూరు చేస్తారు. అలాగే, 500 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వనున్నారు. 

పరిశ్రమల్లో సక్సెస్‌తో ...

పరిశ్రమల అనుమతుల కోసం టీఎస్‌-ఐపాస్‌ ను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం,  భవన నిర్మాణ అనుమతులకు టీఎస్‌-బీపాస్‌ను అమలులోకి తీసుకురానుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మున్సిపల్‌ చట్టంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలకు చెక్‌ పడనుంది. ఈ విధానం ద్వారా ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలో అక్రమంగా వెలిసిన లే అవుట్లపై ఉక్కుపాదం మోపనున్నారు. అక్రమ లే అవుట్ల వివరాలను మున్సిపల్‌ కమిషనర్‌ సబ్‌ రిజిస్ర్టార్‌కు సర్వే నంబర్లతో సహా నివేదికను అందజేస్తారు. దీంతో లే అవుట్‌ లేని స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయకపోగా. భవన నిర్మాణ అనుమతులూ ఇవ్వరూ. దీంతో ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అనుమతి సులభతరం కానుంది. 

టాస్క్‌ఫోర్స్‌ బృందాల తనిఖీ

స్వీయ ధ్రువీకరణతో తక్షణ అనుమతులు జారీ చేస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసేందుకు ప్రత్యేక టా స్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. భూమి యజమాని వాస్తవాలను తప్పుగా చూపినా, నిబంధలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినా ఈ బృందం చర్యలు తీసుకోనుంది. ఎలాంటి నోటీసులు జారీ చేయకుం డా కూల్చివేతలు, భారీ జరిమానాలు విధించనుంది.

టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు

భవన నిర్మాణ అనుమతుల జారీలో  ఎదురైతే టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. అనుమతుల పత్రం జారీ చేయడంలో అధికారులు ఇబ్బంది కలిగిస్తే ఫిర్యాదు చేసేలా టోల్‌ ఫ్రీ నంబర్‌ 22666666ను ఏర్పాటు చేసింది. 

ఆన్‌లైన్‌లోనే అనుమతి

జూన్‌ 2 నుంచి బీ-పాస్‌ అమలులోకి రానుంది. దీంతో భవన నిర్మాణదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. 500 గజాల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణం జరిపే వారికి కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షణ అనంతరం అనుమతి లభించనుంది.  

-సమ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ భూపాలపల్లి


logo