బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - May 19, 2020 , 03:08:43

సారు మాటే మా సాగుబాట

 సారు మాటే మా సాగుబాట

నియంత్రిత సేద్యంపై సీఎం కేసీఆర్‌ సూచనలకు రైతాంగం సానుకూలం

గిరాకీ ఉండే పంటలు వేసుకోవాలని నిర్ణయం

ప్రభుత్వ ప్రోత్సాహంతో కొత్తపంటల దిశగా ఔత్సాహికులు

దొడ్డుబియ్యం స్థానంలో సన్నాలకు సిద్ధం కానున్నవరి రైతులు

వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి బాధ్యులతో సీఎం కేసీఆర్‌ మెగా వీడియో కాన్ఫరెన్స్‌

వరంగల్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌: తెలంగాణ రాష్ట్రంలో రైతులు సం ఘటితం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. సమగ్ర వ్యవసాయ విధానంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల స్థాయి అధికారులతో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి సోమవారం మెగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి మొక్కజొన్నలను రూ.1000కే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకే మన రాష్ట్రంలో వానకాలంలో మొక్కజొన్నను పండిస్తే తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని హెచ్చరించారు. వరిలో సన్నరకాలు పండిస్తే ఇతర రాష్ర్టాలు, విదేశాల్లో డిమాండ్‌ ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం నిర్ణయించిన నియంత్రిత సేద్యంపై రైతులు సానుకూలంగా ఉన్నారు. వరి పండించే రైతులు సన్నాలను వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కజొన్న సాగులో నష్టాలు వచ్చే అవకాశాలున్నందున పత్తి, ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచన చేస్తున్నారు. 

డిమాండ్‌ ఉండే పంటల వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసే రైతుల వెంటే ప్రభుత్వం ఉంటుందని సీఎం భరోసా ఇ వ్వడం, ప్రతి రైతుకూ రైతుబంధు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌలభ్యం ఉన్న చోట పత్తి పంటకు ప్రాధాన్యత ఇవ్వాలని, చెరువుల్లోని పూడిక మట్టిని రైతులు పొలాలకు తరలించుకునేలా రెవెన్యూ అధికారులు సహకరించాలని ఆదేశించడంతో హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు భవిష్యత్‌ వ్యవసాయ రంగమే అనే పేరు వచ్చేలా బలోపేతం చేస్తామని చెప్పడంతో సర్వత్రా సంబురం నెలకొం ది. 

ఇటు కొత్త పంటల సాగుపై అధికారులు కసరత్తు ప్రారంభిం చారు. వరి, మక్క రైతులు కంది, పత్తి వైపు మరలేలా అవగా హన కల్పించాలని నిర్ణయించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఏడీఏ దామోదర్‌రెడ్డి, రైతుబంధు బాధ్యులు లలితాయాదవ్‌, రూరల్‌ కలెక్టర్‌ హరిత, డీఏవో ఉషాదయాల్‌, మహబూబాబాద్‌ కలెక్టర్‌ గౌతమ్‌, డీఏవో ఛత్రునాయక్‌, రైతుబంధు బాధ్యులు బాలాజీ నాయక్‌, ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, డీఏవో గౌస్‌ హైదర్‌, భూపాలపల్లి కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌, డీఏవో నగేశ్‌, రైతుబంధు బాధ్యులు బుచ్చయ్య పాల్గొన్నారు.

నర్సంపేటను మోడల్‌గా తీసుకోవాలి

నర్సంపేట వ్యవసాయ డివిజన్‌లో సాగవుతున్న మిర్చి పంట వివరాలను సీఎం కేసీఆర్‌ నర్సంపేట ఏడీఏ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఏడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘నర్సంపేట వ్యవసాయ డివిజన్‌లో 12 వేల ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగు చేశారు. దాదాపు 2 వేల ఎకరాల్లో చపాట రకం మిర్చి సాగైంది. ఈసారి అత్యధికంగా 27,500 మెట్రిక్‌ టన్నుల మక్కల దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో భౌతిక దూరం పాటిస్తూ సమస్యలు లేకుండా రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. 29 క్లస్టర్లకు గానూ 18 క్లస్టర్లలో రైతు వేదికల కోసం స్థలాలు గుర్తించాం.’ అని తెలిపారు. మిర్చి పంట సాగు వివరాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్‌.. నర్సంపేటను మోడల్‌గా తీసుకోవాలని ఇతర జిల్లాల అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తన వీసీలో ఒక నర్సంపేట ఏడీఏతోనే మాట్లాడడం విశేషం.

విత్తన వడ్లు విక్రయించొద్దు.. 

హన్మకొండ : ప్రభుత్వం పంటల నియంత్రణ విధానం అమలు చేస్తున్నది. జిల్లాలో ఏ పంట ఎంత వేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తది. రైతులకు అవసరమయ్యే విత్తన వడ్లను సైతం ప్రభుత్వమే సరఫరా చేస్తది. విత్తన డీలర్లు రైతులకు ఎలాంటి విత్తనాలూ విక్రయించొద్దు. రైతులు సైతం ఏమీ కొనుగోలు చేయొద్దు. ప్రభుత్వ ఆదేశాలు తప్పని సరిగా పాటించాలి. 

- అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు logo