ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించాలి

- బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ తగ్గించుకోవాలి
- టెలీ కాన్ఫరెన్స్‌లో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు
వరంగల్ సబర్బన్ : లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు ఎస్ఈ, డీఈ, ఎస్ఏవోలను ఆదేశించారు. హన్మకొండలోని సంస్థ కార్యాలయంలో సోమవారం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల సర్కిళ్ల అధికారులతో సీఎండీ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిల విషయంలో జిల్లా కలెక్టర్లను సంప్రదించి వసూళ్లు జరిగేలా చూడాలని, 33/11 కేవీ ట్రాన్స్ బ్రేక్‌డౌన్స్, ట్రిప్పింగ్స్ తగ్గించుకోవాలన్నారు. వేసవిలో ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు అధికమయ్యే అవకాశాలున్నందున వాటిని తగ్గించడానికి ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేసుకోవాలన్నారు. ఆయిల్ లీకేజీ కాకుండా చూసుకోవాలని, హెడ్జ్ ఫ్యూజులను అమర్చుకోవాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచుకోవాలని, ఎస్పీఎం షెడ్లలో రిపేర్లు పెంచాలన్నారు. రూ.50 వేల పైబడి బకాయి ఉన్న వినియోగదారుడికి ఒకటి కంటే ఎక్కువ సర్వీసులుంటే వాటిని తొలగించాలన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు బీ వెంకటేశ్వర్రావు, పీ గణపతి, నర్సింగరావు, పీ సంధ్యారాణి, పీ మోహన్‌రెడ్డి, సీజీఎంలు సదర్లాల్, వీ తిరుపతిరెడ్డి, సీ ప్రభాకర్, జీఎంలు వెంకటరమణ, కృష్ణమోహన్, వెంకటకృష్ణ, డీఈ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
ఆపత్కాలంలో నెలవారీ బిల్లులు చెల్లించకున్నా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, బిల్లింగ్ విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని వినియోగదారులు నమ్మొద్దని సీఎండీ గోపాల్‌రావు కోరారు. లాక్డౌన్ దృష్ట్యా గృహావసరాల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని, అయినా గతేడాది మే నెలలో వాడుకున్న విద్యుత్ బిల్లులనే ఈసారి చెల్లించాలని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. లాక్డౌన్ అనంతరం మీటర్ రీడింగ్ తీసేటప్పుడు వచ్చే బిల్లును ఏప్రిల్, మే, జూన్ నెలలకు సమానంగా విభజిస్తారని, ఒకవేళ బిల్లుల చెల్లింపుల్లో హెచ్చుతగ్గులుంటే సరిచేస్తామన్నారు. వాణిజ్య సముదాయాలు, చిన్న పరిశ్రమలకు సంబంధించి ఈ నెలలో రీడింగ్ తీసి ఏప్రిల్‌లో ఇచ్చిన ప్రొవిజనల్ బిల్లును మినహాయించి నికర బిల్లును ఇస్తామని సీఎండీ చెప్పారు.