బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - May 06, 2020 , 01:15:33

అన్నదాతలను ఆదుకుంటాం

అన్నదాతలను ఆదుకుంటాం

  • హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌

ఎల్కతుర్తి : ఈదురుగాలులు, వడగళ్ల వర్షానికి పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎల్కతుర్తిలో దెబ్బతిన్న పంటలను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పంట నష్టం వివరాలు, ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ అధికారులతో మాట్లాడిన సతీశ్‌కుమార్‌ దెబ్బతిన్న పంటల సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జెడ్పీచైర్మన్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు జిల్లాలకు వారధిగా ఉన్న ఎల్కతుర్తి జంక్షన్‌ అభివృద్ధితో పాటు, మడిపల్లి మీదుగా హైదరాబాద్‌ రోడ్డు, ఎర్రబెల్లి రోడ్డు తదితర అభివృద్ధి పనులపై మంగళవారం జరిగిన కుడా సమావేశం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇందుకు కుడా చైర్మన్‌, కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారన్నారు. ఆయన వెంట ఎంపీపీ మేకల స్వప్న తదితరులు పాల్గొన్నారు. 


logo