సోమవారం 18 జనవరి 2021
Warangal-rural - May 04, 2020 , 01:54:36

కనిపించని శత్రువుతో పోరాటం

కనిపించని శత్రువుతో పోరాటం

  • మంత్రి సత్యవతి రాథోడ్‌ 

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ, మే 03 : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నామని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్‌లో ఎంపీ మాలోత్‌ కవిత అభ్యర్థన మేరకు నామా ముత్తయ్య మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఫ్లోర్‌లీడర్‌ నామా నాగేశ్వర్‌రావు, మానుకోట, ఇల్లందు ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, హరిప్రియ, పార్టీ నియోజకవర్గ నాయకులతో కలిసి ఏడు నియోజకవర్గాలకు 3500 లీటర్ల శానిటైజర్‌, మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ నిరంతరం పాటుపడుతున్నారని, అదే సమయంలో నిరుపేదలు, వలస కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు అందిస్తూ ఆదుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షలమంది వలస కూలీలు ఉన్నారని, వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని, అలాగే ఇతర రాష్ర్టాల్లోని తెలంగాణ వాసులను స్వరాష్ర్టానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.  జీవో 3ను కొనసాగించేందుకు  సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జీవో సడలింపుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామని తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరంతోనే కరోనాను నియంత్రించవచ్చని అన్నారు. మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను చిన్న పిల్లలను కాపాడినట్లు కాపాడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేసిన ట్రస్టును ఎంపీ, ఎమ్మెల్యేలు అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందు, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ నాయకుడు డీఎస్‌ రవిచంద్ర, వైస్‌ చైర్మన్‌ ఫరీద్‌ పాల్గొన్నారు.