శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Apr 27, 2020 , 01:14:51

2 దశాబ్దాల చరిత.. 2 శతాబ్దాల భవిత

2 దశాబ్దాల చరిత.. 2 శతాబ్దాల భవిత

  • రక్తపుధారలు కురిసిన నేలపైనే రతనాల ధాన్యపు రాశులు 
  • పోరుబాట నుంచి ప్రగతి దారుల వైపు పయనం 
  • స్వరాష్ట్రం నుంచి బంగారు ప్రస్థానం దాకా 
  • ఇదీ.. ఓరుగల్లులో టీఆర్‌ఎస్‌ ప్రస్థానం 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : రెండు దశాబ్దాల చరిత. మరో రెండు శతాబ్దాల భవితకు భరోసా. బక్కపలచని మనిషే తెలంగాణకు బాహుబలిగా నిలిచిన అపురూప చరిత్ర. రక్తపుధారలు కురిసిన నేలపై రత్నపు ధాన్యరాసులు .ఒకప్పుడు నిత్య అశాంతి నేలగా ముద్రపడిన గడ్డమీద నేడు శాంతి సౌభాగ్యం వర్థిల్లుతున్నది. కార్యకర్తని కథానాయకుడిగా కీర్తించిన పార్టీ టీఆర్‌ఎస్‌. జనం గుండెల్లో కొలువైన వెలుగు దీపం సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర సాధన పవిత్ర యజ్ఞంతో పడిన తొలి అడుగుల నుంచి చరిత్రగతిని మార్చిన అద్భుత ప్రస్థానం. ఉద్యమ నేతకు ఇష్టమైన ఖిల్లా.. ప్రతి సందర్భంలో ఆయన వెనుక నడిచిన ధీరోదాత్త పాత్ర ఓరుగల్లు సొంతం. నేడు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..

పార్టీ ఆవిర్భావం నుంచి..

స్వరాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ స్థాపనలో ఓరుగల్లు ఉద్యమ జీవులు, బుద్ధిజీవులు, మేధావులు, సామాన్య జనం ఎవరికి వారే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. ప్రజాకవి కాళోజీ నుంచి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌, బియ్యాల జనార్దన్‌రావు, బుర్ర రాములు మొదలైన ఉద్యమ ఆచార్యులు టీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఓరుగల్లు నుంచే కీలక ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. జాతీయ రాజకీయ పార్టీలను ఉద్యమం వైపు తమ దృష్టిని మలిచేలా చేసిన ఘనత కేసీఆర్‌ది. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే కీలక ప్రకటన వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ సాక్షిగా జరిగింది. తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టురోగినైనా కౌగిలించుకుంటా అని చారిత్రక ప్రకటన చేసిన దరిమిలా అన్నిపార్టీలు తెలంగాణ నినాదం ఎత్తకుండా ఉండలేని అనివార్యతను సృష్టించిన ఘనత కేసీఆర్‌దే. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలైన మానుకోట, రాయినిగూడెం ఘటనలు ఉద్యమ ఉధృతిని ఆకాశమంతా తీసుకెళ్తే.. అతి సాధారణ రైతు కూలీ అసాధారణ తెలంగాణ స్వరూపంగా ఫణికర మల్లయ్యను పతాక శీర్షిక చేసిన ఘనత వరంగల్‌ది. తెలంగాణ విద్యార్థిని ఉద్యమం వైపు నడిపించిన కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ పుట్టుక వెనుక టీఆర్‌ఎస్‌ కీలక భూమిక పోషించింది. 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ దీక్షకు దిగేందుకు సరిగ్గా వారం రోజుల ముందు కేయూలో నిర్వహించిన విద్యార్థి గర్జన సభలో ఆయన చేసిన ప్రకటన చారిత్రాత్మకం. కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ శవయాత్రో.. తెలంగాణ జైత్ర యాత్రో అని కేయూ గడ్డమీద ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్‌ చేసిన కీలక ప్రకటనకు వేదికైంది వరంగల్లే. 

గులాబీ సభలు.. గుండెల్లో ఆత్మగౌరవం 

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ సభ 2001లో కరీంనగర్‌లో జరిగితే ఆ వెంటనే భూపాలపల్లి కేంద్రంలో విద్యుత్‌ ఉద్యమ సభ నిర్వహించారు. తెలంగాణలో అపారమైన, నాణ్యమైన బొగ్గు నిక్షేపాలతో థర్మల్‌ పవర్‌ ఉత్పత్తి చేయొచ్చని గుర్తించి నిర్ణయించిన విద్యుత్‌ మహాసభకు భూపాలపల్లి వేదిక అయింది. ఆనాడు ప్రకటించినట్టుగానే ఇవాళ భూపాలపల్లి కేటీపీపీలో విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది. 24 గంటల విద్యుత్‌ను ఉచితంగా రైతులకు అందించడమే కాకుండా ఎలాంటి కోతలు లేకుండా ప్రస్తుతం కరంట్‌ సరఫరా అవుతున్నదంటే అందుకు కారణం నాడు వేసిన ఉద్యమ బీజమే. ఇక జాతీయ రాజకీయాల్లో తెలంగాణ నినాదం పురుడు పోసుకోవడానికి వరంగల్‌ వేదికైంది. 2003లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర మహాసభ, 2006లో, 2008లో తెలంగాణ విశ్వరూప సభలకు వేదికైన సమర ఖిల్లా ఓరుగల్లే. 2009లో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి సీమాంధ్ర శక్తుల కుట్రలకు యూటర్న్‌ తీసుకున్న నేపథ్యంలో ప్రకటన ఇచ్చి వెనక్కి తగ్గిన కేంద్రం మెడలు వంచేలా చేసిన అద్భుత ఘట్టం 2010 డిసెంబర్‌ 16న ప్రకాశ్‌రెడ్డి పేటలో నిర్వహించిన తెలంగాణ మహాగర్జన. 25 లక్షలతో తెలంగాణ ఆకాంక్షను విశ్వవ్యాప్తం చేసిన మహా గర్జన రికార్డు ప్రపంచ ఉద్యమ అత్యద్భుత పోరాట ఘట్టాల్లో ఒకటిగా నిలిచింది. 

ఇంతింతై వటుడింతై..

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఎదిగిన కొద్దీ ఒదిగిన ఉద్యమ కెరటం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎన్నికలేవైనా గెలుపు గులాబీదేగా విస్తరించిన మహావృక్షం. తెలంగాణలో రాజకీయ శక్తుల పునరేకీకరణ రాష్ట్ర వికాసం కోసమే అని భావించిన నేపథ్యంలో మట్టిపనికైనా ఇంటోడే ఉండాలన్న చందంగా ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు గులాబీ జెండాను అక్కున చేర్చుకున్నారు. అదే ఒరవడి 2004 నుంచి 2019 దాకా ప్రతి సందర్భంలోనూ నిరూపితమవుతూనే ఉన్నది.  ఉద్యమ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన వరంగల్‌ను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తరువాత అన్ని రంగాల్లో ముందుంచేందుకు ముఖ్యమంత్రి అహర్నిషలు కృషి చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించి పరిపాలన వికేంద్రీకరణను గడప గడపకూ తీసుకెళుతున్నారు.   వరంగల్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోకు అనుగుణంగా దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కు వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం గీసుగొండ మండలాల మధ్య కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు సీఎం శంకుస్థాపన చేశారు. వరంగల్‌ నగరాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేక జాతీయ, విద్యా సంస్థలు ఇక్కడ కొలువుదీరుతున్నాయి.

వారంపాటు రక్తదానం చేద్దాం

  • ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

ఖిలావరంగల్‌: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు సామాజిక దూరం పాటిస్తూ వారం రోజుల పాటు రక్తదానం చేయాలని ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్‌ ఆదివారం ప్రకటనలో తెలిపారు. దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు కార్యకర్తలంతా లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకొని తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. శ్రేణులు రక్తదానం చేయడంతోపాటు పేదలకు తమ వంతుగా సాయం చేయాలన్నారు.

నిరాడంబరంగా జరుపుకోవాలి 

  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి 

మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, ప్రజలకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆవిర్భావ వేడు కలను నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయ కత్వం సూచించిందని, ఈ మేరకు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ సామాజిక దూరం పాటిస్తూ టీఆర్‌ఎస్‌ జెండావిష్కరణ చేయాలని ఆయన కోరారు.   మరో వారం రోజుల్లో పార్టీ తరఫున శ్రేణులంతా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న వలస కార్మికులు, నిరుపేదలకు సాయం అందించాలని కోరారు. 


logo