బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Apr 24, 2020 , 01:14:12

కరోనా కలకలం..

కరోనా కలకలం..

  • బండనాగారంలో ఆర్మీ ఎస్సైకి పాజిటివ్‌ 
  • గ్రామమంతా హై అలర్ట్‌..

బచ్చన్నపేట, ఏప్రిల్‌ 23 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగారంలో ఓ ఆర్మీ ఎస్సైకి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ ఘటన గ్రామంతో పాటు జిల్లాలో కలకలం రేపింది. మొన్నటి వరకు ఆరెంజ్‌ జోన్‌గా ఉన్న జనగామ జిల్లా నేడు కరోనా పాజిటివ్‌తో బెంబేలెత్తింది. బండనాగారానికి చెందిన 48 ఏండ్ల వ్యక్తి పంజాబ్‌లో ఆర్మీ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత నెల 18న హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైలెక్కి 19న కాజీపేటలో దిగాడు. అక్కడి నుంచి బస్సులో స్వగ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. జనతాకర్యూ విధించిన మూడు రోజులకు మండల స్థాయి అధికారులు ఆ వ్యక్తిని కలిశారు. కొద్ది రోజులు ఇంటిలోనే ఉండాలని సూచించారు. అప్పటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్న ఆ వ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో మండల స్థాయి అధికారులు ఈ నెల 21న ఆ వ్యక్తిని జనగామకు తీసుకెళ్లి శాంపిల్స్‌ సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. ఆ వ్యక్తి తిరిగి గ్రామానికి వచ్చాడు. గురువారం సాయంత్రం సదరు వ్యక్తి రిపోర్టులు వచ్చాయి. అందులో కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆర్డీవో మధుమోహన్‌, సీఐ సంతోశ్‌కుమార్‌, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు నవీన్‌, వైద్య సిబ్బంది ఆ గ్రామానికి వెళ్లారు. బాధిత వ్యక్తిని వాహనంలో సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఏడుగురిని జనగామ క్వారంటైన్‌కు పంపించారు. బాధిత వ్యక్తి ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశాడు, వారి కుటుంబ సభ్యులు ఇంకెందరిని కలిశారన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న బచ్చన్నపేట మండలంలో తొలికేసు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


logo