మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Apr 13, 2020 , 02:13:23

ధరాఘాతంపై ఉక్కుపాదం..!

ధరాఘాతంపై ఉక్కుపాదం..!

  • అధిక రేట్లకు విక్రయిస్తున్న వారిపై భారీ జరిమానాలు 
  • తక్కువ తూకం వేసే రేషన్‌ షాపులపైనా కొరడా 
  • నిత్యావసర సరుకులు నిర్దేశిత ధరలకే అమ్మాలని ఆదేశం 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నాణ్యమైన సరుకులు అందేలా చూడటంతోపాటు అధిక ధరలకు విక్రయిస్తున్న విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. లాక్‌డౌన్‌ కాలంలో వ్యాపారులు నిత్యావసర సరుకులు నిర్దేశిత ధరలకే అమ్మాలని, ఒకవేళ ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రాష్ట్ర సర్కారు కఠినంగా వ్యవహరిస్తుందని స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లా యంత్రాంగం ఎక్కడిక్కడ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. కష్టకాలంలో ప్రజలెవరూ ఇబ్బందుల పాలుకాకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కిరాణ, జనరల్‌ స్టోర్స్‌, మెడికల్‌ షాపులు, ప్రజాపంపిణీ వ్యవస్థలో అతి ముఖ్యమైన రేషన్‌ డీలర్లపై నిఘా పెంచింది. లీగల్‌ మెట్రోలజీ, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్‌ సిబ్బంది, పోలీసులు ఇలా అన్ని శాఖలు జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా దాదాపు ఇప్పటి వరకు 25 దుకాణాలపై కొరడా ఝళిపించాయి. నిత్యావసర సరుకుల్ని అధిక ధరలకు విక్రయిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం ఈ చర్యలతో స్పష్టం చేసింది. నిర్దేశిత ధర కన్నా ఒక్క రూపాయిని వినియోగదారుడి దగ్గరి నుంచి అధికంగా వసూలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. గత నెల 27 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.3.50 లక్షల జరిమానాలు విధించింది. మెడికల్‌ షాపుల్లోనే కాదు, కిరాణ, జనరల్‌ దుకాణాల్లో సైతం అధిక ధరలకు సరుకులు విక్రయించే వారిపై ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నది. కరోనా తాకిడికి ప్రజలెవరూ ధరాఘాతానికి గురికావద్దని, ఎంత కష్టమైనా సరే ఎవరూ పస్తులుండకూడదని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా ప్రబలే అవకాశం ఉన్న 15 ప్రాంతాలను నోమూవ్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి వరంగల్‌ మహానగరంలోని దాదాపు 45 వేల గృహాలకు అధికార యంత్రాంగమే నిత్యావసర సరుకుల్ని ఇళ్లకు చేరుస్తున్నది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు సహా ఇతర సరుకుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. 

రేషన్‌ షాపులపై నిఘా

రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌కాలంలో పేదలు ఆకలికాటుకు గురికావద్దని భావించింది. అందులోభాగంగా కార్డున్నవారికి మనిషికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా కొంతమంది రేషన్‌ డీలర్లు వ్యవహరించడాన్ని జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకున్నది. ప్రత్యేక నిఘా బృందాలు ప్రతిరోజూ రేషన్‌ షాపులను తనిఖీ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తూకంలో మోసాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయినా కొంతమంది అక్కడక్కడా తమ దాకా ఎందుకొస్తుందని నిర్లక్ష్యం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. తూకంలో మోసాలకు పాల్పడుతున్న (తక్కువ బరువుతో పంపిణీ చేయడం, ఎలక్ట్రానిక్‌ కాంటాలు లేకుండా తూకం వేయడం వంటి విధానాలను అవలంబిస్తున్న) ఐదు రేషన్‌ షాప్‌లపై రూ.20వేల చొప్పున జరిమానాలు విధించాయి. మరోవైపు పాలు, మాస్కులు, శానిటైజర్లే కాకుండా దోమల బ్యాట్స్‌ లాంటి అనేక రకాల వస్తువులను సైతం అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ధరలను అదుపుచేస్తున్నాయి. మొత్తంగా లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలుగొద్దనే ఉద్దేశంతో సర్కారు ముందుకెళుతూనే ప్రజలకు నిత్యావసర వస్తువుల లభ్యత, అధిక ధరలకు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తుందన్న విశ్వాసాన్ని కలిగిస్తున్నది.

సరుకుల సరఫరా సక్సెస్‌

వరంగల్‌, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నో మూవ్‌మెంట్‌ ఏరియాల్లో నిత్యావసర సరుకుల సరఫరా విజయవంతంగా కొనసాగుతున్నది. కరోనా ఎఫెక్టెడ్‌ ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాకుండా అధికారులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా 26 బృందాలను నియమించి ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇంటికే సరఫరా చేస్తున్నది. 15 నో మూవ్‌మెంట్‌ ప్రాంతాల పరిధి 67 కాలనీల్లోని 43 వేల ఇళ్లకు రోజూ నిత్యావసరాల సరఫరా జరుగుతున్నది. ఆయా కాలనీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందంలోని సభ్యులు ఉదయం ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కావాల్సిన సరుకుల జాబితాను తీసుకుని మరుసటి రోజు పంపిణీ చేస్తున్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలపై ప్రభావిత ప్రాంతాల ప్రజలు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా కరోనా కట్టడికి సహకరిస్తున్నారని ఉన్నతాధికారులు తెలిపారు.