మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Apr 11, 2020 , 00:49:20

లాక్‌డౌన్‌ గడువు పెరిగినా సహకరించాలి

లాక్‌డౌన్‌ గడువు పెరిగినా సహకరించాలి

  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
  • రెడ్‌జోన్‌ ఏరియాల పరిశీలన

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/భూపాలపల్లి టౌన్‌/కృష్ణకాలనీ/గణపురం: రాష్ట్రంలో ఒకవేళ లాక్‌డౌన్‌ గడువు పెరిగినా ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే గండ్ర వెం కటరమణారెడ్డి కోరారు. శుక్రవారం భూపాలపల్లి ఏరియాలో రెడ్‌జోన్లుగా ప్రకటించిన సుభాష్‌ కాలనీ, మిలీనియం కాలనీల్లో కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌తో కలిసి ఆయన పర్యటించారు. సుభాష్‌ కాలనీలో ఏర్పాటు చేసిన డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌ లోపలి నుంచి వెళ్లి పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ భూపాలపల్లిలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో సుభాష్‌ కాలనీ, మిలీనియం కాలనీలను రెడ్‌జోన్‌ ఏరియాలుగా ప్రకటించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ముందు చూపుతోనే వైరస్‌ కేసులు తక్కువగా నమోదైనట్లు చెప్పారు. 

పాత్రికేయులకు సరుకుల పంపిణీ

భూపాలపల్లి పట్టణం, చెల్పూరులోని పాత్రికేయులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ అజీమ్‌ వేర్వేరుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 

ఎర్ర చెరువు పరిశీలన

కూరగాయల మార్కెట్‌, రైతు బజార్‌ ఏర్పాటు కోసం పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో గల ఎర్ర చెరువును చదును చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ఎర్ర చెరువును పరిశీలించారు.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం గణపురం మండల కేంద్రంలో పర్యటించిన నిత్యావసర సరుకుల విక్రయాలపై ఆరా తీశారు. అనంతరం పీహెచ్‌సీలో వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమాల్లో ఆర్డీవో గణేష్‌, సింగరేణి ఎస్‌ వో టు జీఎం రఘుపతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్ధు, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, డీపీవో చంద్రమౌళి పాల్గొన్నారు.