నిత్య కైంకర్యం..

- ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాల్లో నిరంతరంగా కొనసాగుతున్న పూజలు
- లాక్డౌన్ నేపథ్యంలో భక్తుల ప్రవేశంపై నిషేధం
- మందిరాలకు కరోనా ఎఫెక్ట్
వరంగల్ కల్చరల్/ రెడ్డికాలనీ/ కాళేశ్వరం/పాలకుర్తి/ కురవి/ గీసుగొండ/ వెంకటాపూర్/మంగపేట, ఏప్రిల్ 10: కరోనా వైరస్ నేపథ్యంలో ఆలయాల్లో అర్చకులు యథావిధిగా నిత్య కైంకర్య పూజలు చేస్తున్నారు. స్వామి, అమ్మవార్లకు ఎప్పటిలాగే అన్ని సేవలు నిర్వహిస్తున్నారు. భక్తులు లేకపోవడం మినహా.. దేవాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలను చేపడుతున్నారు. లాక్డౌన్ నేపథ్ంయలో భక్తుల ప్రవేశంపై నిషేధం విధించడంతో మందిరాలు వెలవెలబోతున్నాయి. వరంగల్ నగరంలోని భద్రకాళీ ఆలయంలో భక్తులు లేకున్నా అమ్మవారికి జరగాల్సిన కైంకర్యాలు, నైవేద్యాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం యథావిధిగా జరుగుతున్నాయి. అర్చకులు పార్నంది నర్సింహామూర్తి, యల్లంభట్ల సురేశ్, చెప్పెల ప్రభాకరశర్మ వంతుల వారీగా అమ్మవారికి నిత్యపూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధానార్చకులు భద్రకాళీ శేషు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆలయం వెలుపలికి భక్తులను రానివ్వట్లేదని ఈవో రామల సునీత పేర్కొన్నారు. వేయిస్తంభాల ఆలయంలో ప్రతి రోజూ ఆగమ శాస్త్రం ప్రకారం నిత్యపూజలు జరుగుతున్నాయి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయం త్రం మళ్లీ ఆలయాన్ని తెరిచి పూజలు చేసి మూసివేస్తున్నామని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి ఆలయంలో నిత్యం జరిగే శివ కల్యాణానికి ఎలాంటి లోటుపాటు లేకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం సంప్రోక్షణ, రుద్రాభి షేకం చేస్తున్నారు. అమ్మవార్లకు అలంకరణ చేసి నైవేద్యం సమర్పిస్తున్నారు. ఆది ముక్తీశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి స్వామి వార్లకు నైవేద్యం పెడుతున్నారు. అలాగే సాయంత్రం నైవేద్యం సమర్పించి ఆలయాన్ని మూసివేస్తున్నారు. పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో స్వామివారికి అర్చకులు యథావిధిగా పూజలు నిర్వహిస్తున్నారు. నిత్య కైంకర్యాలు కొన సాగుతున్నాయి. కురవి మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో పూజారులు నిరాడంబరంగా త్రికాల పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన పూజారి పారుపెల్లి రామన్న, కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ తెలిపారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య పూజలు తప్ప మిగతా కార్యక్రమాలు నిర్వహించడం లేదని అర్చకులు కాండూరి రామాచార్యులు పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ములుగు జిల్లాలోని సుప్రసిద్ధ రామప్ప ఆలయం జనం లేక నిర్మానుష్యంగా మారింది. పూజారులు నిత్యం సుప్రభాత సేవతో ప్రారంభించి మంగళహారతితో ముగించి ఆలయాన్ని మూసివేస్తున్నారు. మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానంలో నిరంతరంగా సంప్రదాయ పూజలు కొనసాగిస్తున్నామని అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర శర్మ, ఈవో సత్యనారాయణ తెలిపారు.
ఆగమశాస్త్రం ప్రకారం పూజలు
ఆగమశాస్త్రం ప్రకారం రుద్రేశ్వరుడికి ప్రతి రోజూ పూజలు నిర్వహిస్తున్నాం. కేవలం అర్చకులు మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో పూజలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా ఆలయాలు మూసివేయలేదు. గ్రహణాల సందర్భంలో మాత్రమే మూతపడేవి.
- గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు
మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించు స్వామీ..
కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించాలని శ్రీలక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నా. భక్తుల కోలాహలం మధ్య పూజలందుకునే స్వామి వారికి అర్చకుడు మాత్రమే పూజ చేయడం బాధగా ఉంది.
- కాండూరి రామాచార్యులుకొమ్మాల ఆలయ అర్చకుడు
యథావిధిగా పూజలు
కరోనా నేపథ్యంలో ఆలయానికి పరిమిత సంఖ్యలో సిబ్బంది వెళ్లి పూజలు చేస్తున్నాం. లాక్డౌన్తో భక్తుల రాక నిలిపి వేయడం వల్ల నిర్మానుష్యంగా ఉంది. ప్రతి రోజు సంప్రదాయబద్ధంగా స్వామివారికి నిరాడంబరంగా పూజలు చేసి, నైవేద్యం సమర్పిస్తున్నాం. త్వరితగతిన ప్రపంచం కరోనా కోరల్లో నుంచి బయటపడాలని భగవంతుడిని కోరుకుంటున్నాం.