ఆ 104 మందికి నెగిటివ్..!

- ఫలితమిస్తున్న క్వారంటైన్
- ప్రభుత్వ కేంద్రాల్లో 171 మంది
- వీరికీ పరీక్షల నిర్వహణ
- మరో 637 మంది హోం క్వారంటైన్లో..
- టెలీ మెడిసిన్‌కు అనూహ్య స్పందన
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తోపాటు అనుమానితుల హోం క్వారంటైన్ సత్ఫలితాలనిస్తున్నది. తొలిదశలో వివిధ దేశాల నుంచి వచ్చిన 814 మంది హోం క్వారంటైన్ పూర్తి కావడం, వీరెవరికీ కరోనా లక్షణాలు రాకపోవడంతో మరికొద్దిరోజులపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ రావడంతో మెరుగైన వైద్యసేవల కోసం వారిని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. జిల్లాలో 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ పర్యవేక్షణలోని ఐదు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. ఈ సెంటర్లలో ఉన్న మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని కలిసిన కుటుంబ సభ్యుల్లో 104 మందికి పరీక్షలు నిర్వహించారు. అయితే వారికి నెగెటివ్ రిపోర్ట్స్ రావడంతో ఇళ్లకు పంపించి, మరో 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. గురువారం సాయంత్రం వరకు ప్రభుత్వ హోం క్వారంటైన్ కేంద్రాల్లో 171 మందిని ఉంచారు. వీరిలో కొంతమంది పరీక్షల రిపోర్ట్స్ రావాల్సి ఉండగా మరి కొంతమంది నమూనాలను సేకరించాల్సి ఉంది. వీరితోపాటు జిల్లా వ్యాప్తంగా ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిశారన్న అనుమానంతో 637 మందిని హోం క్వారంటైన్లో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి కానీ, హోం క్వారంటైన్లో ఉన్నవారిలో ఇప్పటి వరకు కరోనా లక్షణాలు బయట పడకపోవడం గమనార్హం.
నో మూవ్మెంట్ జోన్స్‌పై 24/7 నిఘా
జిల్లాలో 15 ప్రాంతాలను అధికారులు నో మూవ్మెంట్ జోన్స్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని నిషేధాజ్ఞలు విధించారు. 24/7 కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ప్రభావిత ప్రాంతాలుగా వీటిని గుర్తించి, అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వరంగల్ మహానగరం పరిధిలోని 15 ప్రాంతాలైన జులైవాడ, సుబేదారి, ఈద్గా, కుమార్‌పల్లి, కుమార్‌పల్లి బజార్, పోచమ్మమైదాన్, చార్‌బౌళి, కాశీబుగ్గ, గణేశ్‌నగర్, నిజాంపుర, లక్ష్మీపురం, రంగంపేట, శంభునిపేట, బాపూజీనగర్, చింతగట్టు క్యాంపు ప్రాంతాల్లో జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 25 బృందాల ద్వారా 67 కాలనీల పరిధి 41,783 గృహాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు.
టెలీ మెడిసిన్‌కు అనూహ్య స్పందన
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేనికారణంగా అత్యవసర వైద్యసేవలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నేతృత్వంలో టెలీ మెడిసిన్ సేవలను ప్రారంభించింది. ఇందు కోసం మూడు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచి, ప్రజలకు కావాల్సిన వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా నేరుగా వైద్యులతో వీడియో కాల్లో మాట్లాడేందుకు గాను వాట్సాప్ నంబర్ ఇచ్చారు. ప్రారంభించిన రెండు రోజుల్లో 72 మంది టెలీ వైద్య సేవల ద్వారా ప్రయోజనం పొందారు.
‘ఈ లక్షణాలుంటే తక్షణం దృష్టికి తేవాలి’
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించడంతోపాటు పాన్, గుట్కా సహా ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై గట్టి నిఘా పెట్టారు. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలు, పీఎంపీల దగ్గరికి వైద్య సేవల కోసం వచ్చే వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారు, దగ్గు, జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, డీఎంహెచ్‌వో డాక్టర్ లలితా దేవి సంయుక్తంగా ప్రకటించారు. మరోవైపు జిల్లాలోని మెడికల్ షాపుల్లో ఈ లక్షణాలతో మందులు కొనుగోలు చేసే వారి వివరాలు, సెల్ నంబర్ల వివరాలను తమకు తెలియజేయాలని పేర్కొనడం గమనార్హం.
తాజావార్తలు
- 'రాహుల్‌గాంధీ మీకు అబద్దాలు చెప్పడానికి సిగ్గనిపించదా..?'
- సీబీఐకి ఊమెన్ చాందీపై లైంగిక దాడి కేసు
- డీఆర్డీవోలో అప్రెంటిస్‌లు
- రెండేళ్ల కూతురికి జడ చిక్కులు తీసిన హీరో
- హ్యాపీ బర్త్ డే పుజారా..
- దేశంలో ఊబకాయులు పెరుగుతున్నారు..
- హైదరాబాద్ నవాబు వారసత్వం కేసును తేల్చండి : సుప్రీం
- ఇదోరకం కల్లు..!
- వచ్చే ఏడాది నౌకాదళం అమ్ములపొదిలోకి INS విక్రాంత్!
- వాట్సాప్ ప్రైవసీ పాలసీ : కేంద్రం ఫైర్