మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Apr 05, 2020 , 03:10:50

రైతులు ఆగం కావొద్దన్నదే ధ్యేయం

రైతులు ఆగం కావొద్దన్నదే ధ్యేయం

  • రైతు ముంగిట్లోకే  కొనుగోలు కేంద్రాలు
  • కరోనా కట్టడిలో కేసీఆర్‌కు ప్రపంచ దేశాల ప్రశంసలు
  • కొవిడ్‌-19 నియంత్రణకు ప్రజలు సహకరించాలి
  • రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రాయపర్తి, ఏప్రిల్‌ 04 : ఆరుగాలం శ్రమించి పండించిన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో అన్నదాతలు ఆగమాగం కావొద్దన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన మక్కల, తిర్మలాయపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరంతో పాటు ఎస్సారెస్పీ నుంచి జలాల విడుదలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న అధిక మొత్తంలో పండినట్లు ఆయన చెప్పారు. రైతుల ముంగిట్లోకే రాష్ట్ర ప్రభుత్వం మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకువస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ఉత్పత్తులను విక్రయించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని తెలిపారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అనంతరం గేల్‌ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో ఐదు వేల మాస్క్‌లను మండల కేంద్రంలోని పలువురు మహిళలు, సర్పంచ్‌ గారె నర్సయ్యకు అందజేశారు. ప్రజాప్రతినిధులతో కలిసి మండల కేంద్రంలోని ఆర్‌టీసీ బస్టాండ్‌, వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని మంత్రి ఎర్రబెల్లి పిచికారీ చేశారు. కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ రావుల మహేందర్‌రెడ్డి, ఆర్డీవో మహేందర్‌జీ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్‌, ఏసీపీ గొల్ల రమేశ్‌, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్‌రావు, సివిల్‌ సైప్లె అధికారి భాస్కర్‌రావు, మార్క్‌ఫెడ్‌ డీఎం సరిత, తహసీల్దార్‌ కుసుమ సత్యనారాయణ, వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్‌, ఎంపీడీవో కలికోట రామ్మోహనాచారి, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మునావత్‌ నర్సింహనాయక్‌, బిల్ల సుధీర్‌రెడ్డి, ఏపీఎం పులుసు అశోక్‌కుమార్‌, ఏవో గుమ్మడి వీరభద్రం, రాయపర్తి, కొలన్‌పల్లి పీఏసీఎస్‌ చైర్మన్లు కుందూరు రాంచంద్రారెడ్డి, జక్కుల వెంకట్‌రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.