ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Apr 03, 2020 , 01:45:57

అన్నదాతలు ఎవరూ అధైర్య పడొద్దు

అన్నదాతలు ఎవరూ అధైర్య పడొద్దు

నర్సంపేట/నర్సంపేట రూరల్‌/నెక్కొండ/చెన్నారావుపేట : ‘రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుంది. వ్యవసాయంపై కరోనా ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అన్నదాతలు ఎవరూ అధైర్య పడొద్దు. ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం’ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా నెక్కొండలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్‌, నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట గ్రామాల్లోనూ మంత్రి నిరంజన్‌రెడ్డి మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మక్కలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మక్కల తేమ శాతాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నోటికాడికొచ్చిన పంటను అమ్ముకుందామంటే కరోనా ఎఫెక్ట్‌ రైతుపై పడిందన్నారు. ఈ నేపథ్యంలో రైతన్నలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ ధైర్యం చేసి ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని సాహసోపేతంగా ప్రకటించారని అన్నారు. నర్సంపేట నియోజకవర్గం 53వేల ఎకరాల్లో మక్కల సాగును చేపట్టి రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచిందని, అందుకే ఈ ప్రాంతంలోనే మొదటగా మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. 14లక్షల మెట్రిక్‌ టన్నులను రూ.1760 చొప్పున రూ.3213కోట్లు వెచ్చించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను ఆరంభించేందుకు  జిల్లాలో 265 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా బారిన పడకుండా రైతులకు కూపన్లను అందిస్తారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు సామా జిక దూరం విధిగా పాటించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా నర్సంపేటలో మంత్రి నిరంజన్‌ రెడ్డి హార్టికల్చర్‌, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్‌లో ప్రపంచానికి అన్నం పెట్టేది ఒక్క భారతదేశమేనని అన్నారు. రేపటి బాగు కోసం అందరం సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల కోసం పనిచేసి గెలిచిన వారిలో ఉత్తర తెలంగాణలో పెద్ది సుదర్శన్‌రెడ్డి, దక్షిణ తెలంగాణలో తాను ఉన్నానని అన్నారు. వేర్‌హౌసింగ్‌ ద్వారా నూతన గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. గత ఆరేళ్లలో ప్రభుత్వం ఎంతో ప్రయత్నించి దాదాపు 70 లక్షల మెట్రిక్‌ టన్నుల కెపాసిటీ గల గోదాములను నిర్మించిందని అన్నారు. అవి కూడా యాసంగి పంటల దిగుబడికి సరిపోవని అన్నారు. కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందిస్తామని వివరించారు. యాసంగిలో మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పంటల సమగ్ర సమాచారం వ్యవసాయ ఉద్యోగుల వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కరోనా రక్కసి నుంచి బయటపడే వరకు రైతులు ఇబ్బందులు పడకుండా ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పెద్ది కోరారు. రాబోయే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడ పంట ముందుగా వస్తుందో అక్కడే మొదట కూపన్లు ఇస్తున్నామని కలెక్టర్‌ హరిత అన్నారు. 100 మంది రైతులు మిర్చిని కోల్డ్‌స్టోరేజ్‌లో నిల్వ చేశారని అన్నారు. అనంతరం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలో డ్రోన్‌ సహాయంతో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని చల్లే కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. కరోనా వ్యాప్తి చెందకుండా వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు స్వీయ నిర్బంధమే మేలని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని తెలిపారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ మర్రి రంగారావు, అడిషనల్‌ కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి, జేడీఏ ఉషాదయాళ్‌, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌  చైర్మన్‌ సదానందం, ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామి, మున్సిపల్‌ చైర్మన్‌ గుంటి రజిని, వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ విద్యాధర్‌, కౌన్సిలర్లు, ఏడీఏ శ్రీనివాసరావు, జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌నబీ, జెడ్పీటీసీలు బానోత్‌ పత్తినాయక్‌, కోమాండ్ల జయ, నెక్కొండ, చెన్నారావుపేట ఎంపీపీలు జాటోత్‌ రమేశ్‌, మోతె కళావతి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ తహసీల్దార్లు వాసం రామ్మూర్తి, పూల్‌సింగ్‌ చౌహాన్‌,  వెంకన్న, ఏసీపీ ఫణీందర్‌, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.