శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Mar 30, 2020 , 00:48:06

వలస కూలీలను ఆదుకుంటాం

వలస కూలీలను ఆదుకుంటాం

  • గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
  • మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
  • 2 క్వింటాళ్ల బియ్యం, రూ.10 వేలు అందజేత

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ/ మహబూబాబాద్‌ రూరల్‌ : ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఎస్పీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డితో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లోని పాఠశాలల్లో వలస కూలీలకు భోజన సదుపాయాలు, ఆవాస ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు ఐదు వేలకు పైగా ఉన్న కూలీలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 115 మంది విదేశాల నుంచి వచ్చారని, వీరిలో దాదాపు 70 మంది క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారని వెల్లడించారు. మిగతా 45 మంది ఒకటి రెండు రోజుల్లో క్వారంటైన్‌ పూర్తి చేసుకుంటారన్నారు. కాగా, ఆదివారం ఇద్దరిని హోం క్వారంటైన్‌ చేసినట్లు చెప్పారు. అనంతరం మహారాష్ట్ర నుంచి మహబూబాబాద్‌కు పనికోసం వచ్చిన వలస కూలీలను మంత్రి సత్యవతి రాథోడ్‌ కలిసి రెండు క్వింటాళ్ల బియ్యం, వంట సామగ్రి, రూ.పదివేలు అందజేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రైతులు పండించిన ధాన్యం, మక్కల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో గతంలో 90 కొనుగోలు కేంద్రాలుండగా ఈ ఏడాది 138 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏప్రిల్‌ 15 తర్వాత కొనుగోళ్లు ప్రారంభించ నున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సన్యాసయ్య, డీఎంహెచ్‌వో శ్రీరాం, డీసీహెచ్‌వో భీంసాగర్‌ పాల్గొన్నారు.

 సరుకులు అందజేసిన ఎస్పీ

మహబూబాబాద్‌ పట్టణంలోని ఫ్లైఓవర్‌ కింద నివాసముంటున్న వలస కూలీలకు ఎస్పీ కోటిరెడ్డి ఆదివారం నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామని, దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేశ్‌ కుమార్‌, ఏఆర్‌డీఎస్పీ జనార్దన్‌, ఆర్‌ఐ నర్సయ్య, ట్రాఫిక్‌ ఎస్సై రవీందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

భోజన వసతులు కల్పించాలి

పర్వతగిరి/ఐనవోలు : రైస్‌ మిల్లర్లు, పౌల్ట్రీ యజమానులు తమ పరిధిలో పనిచేసే ఇతర రాష్ర్టాల కూలీలకు భోజన వసతులు కల్పించాలని మామూనూరు ఏసీపీ శ్యాంసుందర్‌ కోరారు. పర్వతగిరి మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో, ఐనవోలు మండలంలోని పున్నేల్‌ క్రాస్‌ సమీపంలోని ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం రైస్‌ మిల్లర్లు, పౌల్ట్రీ యజమానులకు ఏసీపీ అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. కూలీలకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పర్వతగిరి సీఐ కిషన్‌, ఎస్సైలు ప్రశాంత్‌బాబు, నర్సింహారావు, ఎస్‌బీ ఎస్సై చక్రధర్‌, రైస్‌ మిల్లర్లు, పౌల్ట్రీ యజమానులు పాల్గొన్నారు.

గుంపులుగా పనులకు వెళ్లొద్దు

ఖానాపురం : వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు గుంపులు గుంపులుగా వెళ్లొద్దని ఎస్సై సాయిబాబు అన్నారు. ఆదివారం మంగళవారిపేట శివారులోని మిర్చి తోటల్లో పనులకు వెళ్లిన కూలీలకు సర్పంచ్‌ లావుడ్య రమేశ్‌తో కలిసి పోలీసులు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు.