శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-rural - Mar 27, 2020 , 02:47:45

దూరమే బంధమిపుడు..

దూరమే బంధమిపుడు..

  • ప్రజల్లో ‘కరోనా’పై సామాజిక చైతన్యం
  • ఎక్కడికక్కడ దూరాన్ని పాటిస్తున్న జనం 
  • కూరగాయల మార్కెట్లు.. రేషన్‌ షాపుల వద్ద దూర బంధాలు 
  • మంత్రి నుంచి కార్పొరేటర్‌ దాకా..
  • సీఎం కేసీఆర్‌ పిలుపుతో రోడ్లెక్కిన నేతలు 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: మనిషి మనిషికి మధ్య దూరంగా ఉండడమే బంధంగా మా రిన కాలం. సామాజిక దూరమే కరోనా కట్టడికి అసలైన మంత్రమని శాస్త్రీయంగా తేలడంతో సర్వ వ్యవస్థలూ దూరంగా ఉం టూనే అదృశ్య యుద్ధం చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. దూర బంధమే కరోనాను దూరం చేయడానికి అసలైన మందని ఇప్పుడిప్పుడే ప్రజలకూ అవగాహన కలుగుతున్నది. సింహం సింగిల్‌గానే వెళ్లాలి.. కరోనా దరిచేరకుండా ఉండాలంటే దూరంగానే ఉండాలి. అనే స్పృహ బోధపడుతున్నది. ప్రభుత్వం చెబుతున్న మాట వినడం తప్ప మరో గత్యంతరం లేదని అందరూ గ్రహిస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల మార్కె ట్లు, ఇతర చోట్ల దూరంగా ఉండాల్సిన అనివార్యతలను ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు రోడ్లెక్కుతున్నారు. ‘పోలీసులు, వైద్యులు, అధికారులు రోడ్లెక్కి ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటే ప్రజాప్రతినిధులు ఎక్కడ..?’ అని ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రశ్నించడంతో నిన్నటిదాకా ఇళ్లల్లో ఉన్న నేతలందరూ గురువారం రోడ్లెక్కారు. ప్రజలకు దూరంగా ఉం డాల్సిన పరిస్థితులపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరి పరిధిలో వారు ఎవరి ప్రాంతాల్లో వారు ఎక్కడికక్కడ తిరుగుతూ ప్రజల ను చైతన్యం చేయడంలో నిమగ్నం అవుతున్నారు. 

 ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం 

కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని, ఎవరికీ ఏ విధమైన నిత్యావసర వస్తువుల కొరత రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఊరూరా ప్రజలు తమవంతు బాధ్యతగా స్వీకరించారు. ఊరి పొలిమేర ల్లో ముళ్లకంచెలు వేస్తూ, వాహనాలు అడ్డంపెడుతూ, తాళ్లు కడుతూ వేరే వాళ్లెవరూ తమ ఊరికి రాకూడదని తీర్మానాలు చేస్తున్నారు. ‘దయచేసి మా ఊళ్లోకి రాకండి.’ అంటూ ప్రాధేయపడుతున్నారు.. చాటింపులు చేస్తున్నారు. సంఘటిత శక్తిని చాటుతూ ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొందాం.. దూరంగా ఉంటూనే కరోనాను దరిచేరనివ్వొద్దు.. అంటూ నిర్ణ యం తీసుకుంటున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత మొదటి రెండు రోజుల్లో జనంలో దూరంగా ఉండాలనే స్పృహ పాదుకొనలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండాల్సిందేనని పేర్కొనడంతో పల్లెలు చైతన్య వీచికలయ్యాయి. గ్రామాల్లో నెలకొన్న వాతావరణం పట్టణాలకు సైతం విస్తరించింది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పట్టణాల పరిధి పలు కాలనీల్లో సైతం ద్వారబంధాలు చేశారు. కాలనీలకు రాకుండా కట్టడి చేస్తున్నా రు. మరోవైపు నగరంలో ఎవరైనా బయటి వాళ్లు తమ ఇళ్లల్లోకి వచ్చినా, ఇంట్లో ఉన్న వాళ్లు నిర్ధేశిత గడువులోగా బయటికి వెళ్లి వచ్చినా ‘కాళ్లు చేతులు కడుకున్నాకే లోపలికి రావాలి’ అని ఇంటి ముందు సబ్బు, నీళ్లు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. 

దూర పర్యవేక్షణ 

నిత్యావసర వస్తు విక్రయ కేంద్రాల వద్ద జనం గుంపులు గుంపులుగా గుమిగూడకుండా ఉండేందుకు ఓ వైపు అధికారు లు, మరోవైపు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. గురువారం నగరంలోని కార్పొరేటర్లు, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఏనుమాముల వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, అరూరి రమేశ్‌, ప్రభు త్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి తదితరులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ హన్మకొండ, కాజీపేట, వరంగల్‌ పరిధి లోని మార్కెట్లకు వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు. కూరగాయల మార్కెట్లలో ధరల పట్టికను పరిశీలించారు. కొనుగోలు చేయడానికి వచ్చిన వారితో మాట్లాడి సమస్యలను, అక్కడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. 

ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ కేంద్రాల వద్ద..

కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తున్నది. ప్రజలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో తెల్ల రేషన్‌కార్డుదారుల్లో మనిషికి 12 కిలోల చొప్పున ఉచితంగా బి య్యం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అందు లో భాగంగా గురువారం జిల్లాలో కొన్ని చోట్ల పంపిణీ ప్రారంభమైంది. బియ్యం తీసుకెళ్లేందుకు వచ్చిన వారందరూ దూర దూరంగా ఉండేలా ఆయా రేషన్‌ షాపుల వద్ద డీలర్లు ఏర్పాట్లు చేశారు. ‘అందరికీ సరిపడా స్టాక్‌ ఉంది. ఎవరూ గుంపులు గుం పులుగా రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని రేషన్‌ డీలర్లు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఉచిత రేషన్‌ బియ్యాన్ని ప్రారంభించిన అనంతరం అందరూ దూరదూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని షాపింగ్‌ మాల్స్‌కు వచ్చే ఉద్యోగులు, సంపన్నులు ఏ విధంగానైతే దూరంగా ఉంటూ తమకు కావాల్సి న వస్తువులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారో అదేవిధంగా ప్రజాపంపిణీ కేంద్రాల్లో దూరాన్ని పాటించాలని సూచించారు. ముఖానికి మాస్కులు వేసుకొని బియ్యం పంపిణీ కేంద్రాల వద్ద ఓపికతో నిల్చున్న దృశ్యాలను పరిశీలిస్తే కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రజల నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు లభిస్తుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. 

కొసమెరుపు...

సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు స్థానిక నేతలు, నాయకులు ఎక్కడికక్కడ కథానాయకులు కావాలని పిలుపునివ్వడంతో తా మున్నామనే విధంగా అందరూ కార్యరంగంలోకి దిగారు. అయితే కొన్నిచోట్ల స్థానిక నేతలు వారి డివిజన్లలో కాకుండా నలుగురైదుగురు కార్పొరేటర్లు దగ్గర దగ్గరగా గుమిగూడడం చర్చనీయాంశమైంది. ప్రజలను దూరంగా ఉండమని పేర్కొంటున్న తరుణంలో నాయకులు ఇలా ఎలా గుంపులు గుంపులు గా ఉంటారనే చర్చ సాగింది. అయితే హన్మకొండలో చోటు చే సుకున్న ఈ పరిణామంపై ‘మనమే ఇలా గుంపుగుంపులుగా తిరిగొద్దు కదా! అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ పేర్కొనడం విశేషం.  


logo