గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-rural - Mar 27, 2020 , 02:28:18

విపత్తులో ఆపన్నహస్తం..

విపత్తులో ఆపన్నహస్తం..

 • రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ 
 • కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికీ 12 కిలోలు
 • ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం
 • టోకెన్ల విధానంతో పంపిణీ చేయాలని ఆదేశాలు
 • సామాజిక దూరం పాటించేలా చర్యలు
 • అర్బన్‌, రూరల్‌జిల్లాలో ప్రారంభం
 • లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్న రూ.1500

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విపత్తు సమయంలో ప్రజలు పస్తులు ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. లాక్‌డౌన్‌ పిలుపుతో పనులు మానుకుని, ఇంట్లోనే ఉంటున్న కుటుంబాలకు సర్కారే ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. రేషన్‌కార్డుదారుల కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందిస్తున్నది. కూరగాయలు, మందుల ఖర్చులకు రూ.1500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల్లో గురువారం రేషన్‌ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైంది. హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం సర్వాపురంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పంపిణీని ప్రారంభించారు. రేషన్‌కార్డుదారులకు టోకెన్‌ అందజేసి.. ఆ సమయానికి రావాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. రేషన్‌దుకాణాల వద్ద సామాజికదూరం పాటించేలా మార్కింగులు వేస్తున్నారు.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: జిల్లాలో తెల్లరేషన్‌ కార్డుదారులకు పన్నెండు కిలోల ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. తొలిరోజు గురువారం 2,077 కార్డులపై 744.44 క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరిగింది. పన్నెండు మండలాల్లోని 30 చౌకడిపోల్లో డీలర్లు వీటిని టోకెన్‌ విధానం ద్వారా పంపిణీ చేశారు. లబ్ధ్దిదారుల్లో ప్రతి రోజు 15 శాతం మందికి అంటే గరిష్టంగా పది రోజుల్లో జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీ పూర్తి చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయిచింది. ఈ మేరకు ఏప్రిల్‌ ఐదో తేదీలోగా జిల్లాలోని తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు పన్నెండు కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని, ఇతర సరుకుల కొనుగోలు కోసం ఒక్కో తెల్లరేషన్‌ కార్డుదారుకు రూ.1,500 నగదు అందజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదట 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో జిల్లాలో బియ్యం అందుబాటులో ఉన్న చౌకడిపోల్లో గురువారం ఉచిత బియ్యం పంపిణీ షురూ చేశారు. నర్సంపేట పట్టణంలోని నాల్గవ వార్డులో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెల్ల రేషన్‌కార్డుదారులకు పన్నెండు కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. త్వరలో ప్రతి తెల్లరేషన్‌కార్డుకు ప్రభుత్వం రూ.1,500 నగదు అందజేయనుందని ఆయన చెప్పారు. నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజిని, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్‌, కమిషనర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పరకాలలో ఆర్డీవో కిషన్‌ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనితారామకృష్ణ, వైస్‌ చైర్మన్‌ ఆర్‌.జయపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇలా ఆత్మకూరు, చెన్నారావుపేట, దామెర, దుగ్గొండి, గీసుగొండ, ఖానాపురం, పర్వతగిరి, రాయపర్తి, శాయంపేట, వర్ధ్దన్నపేట మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఉచిత బియ్యం పంపిణీ మొదలైంది. తొలిరోజున ఈ బియ్యం పొందిన తెల్లరేషన్‌కార్డుదారులకు ముందుగానే అధికారులు టోకెన్లు అందజేశారు. చౌకడిపోల డీలర్లు టోకెన్‌తో తమ దుకాణానికి వచ్చిన కార్డుదారులకే అధికారుల సూచనల ప్రకారం పన్నెండు కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేశారు. జిల్లాలో సాధ్యమైనంత త్వరగా పన్నెండు కిలోల ఉచిత బియ్యం పంపిణీ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్‌ ఎం.హరిత వెల్లడించారు.

ఏప్రిల్‌ 5వ తేదీ వరకు పంపిణీ

జిల్లాలో ఏఎఫ్‌ఎస్‌సీ, ఎఫ్‌ఎస్‌సీ, ఏఏపీ కార్డులన్నీ కలిపి 2,19,813 తెల్లరేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా మొత్తం 6,51,320 మంది లబ్ధి పొందుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి తెల్లరేషన్‌కార్డుపై ఉచితంగా పన్నెండు కిలోల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లాలో 2,19,813 తెల్లరేషన్‌కార్డులపై ఉచితంగా 78,158 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో గురువారం ఉదయం నుంచి అందుబాటులో ఉన్న చౌకడిపోల నుంచి పన్నెండు కిలోల బియ్యం పంపిణీ చేయటాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి దీప్తి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ భాస్కర్‌, జిల్లా రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దారావత్‌ మోహన్‌నాయక్‌, వంగర వాణిరామరాజు సమావేశంలో పాల్గొన్నారు. ఏప్రిల్‌ 5వ తేదీలోగా అంటే 10 రోజుల్లో ఉచిత బియ్యం పంపిణీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. తెల్లరేషన్‌కార్డుల్లో ప్రతి రోజు 15 శాతం కార్డుదారులకు అందజేయాలని, ఒకరోజు ముందుగానే ఆ పదిహేను శాతం కార్డుదారులకు వీఆర్‌ఏ, ఆశ వర్కర్లు టోకెన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ముందు రోజు టోకెన్‌ పొందిన వారికి మాత్రమే తెల్లవారి సంబంధిత చౌక దుకాణంలో12  కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్‌  చెప్పారు. బియ్యం పంపిణీ సమయంలో జనం గుమిగూడకుండా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత బియ్యం పంపిణీ కోసం అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.  

జిల్లాలోని రేషన్‌ డీలర్లకు 

అదనపు కలెక్టర్‌ చేసిన సూచనలు 

 • ఈ-పాస్‌ ద్వారానే బియ్యం పంపిణీ చేయాలి.
 • కార్డుదారుడి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు. పూర్తి ఉచితంగా అందజేయాలి.
 • మొత్తం కార్డుదారుల్లో 15 శాతం మించకుండా వాడల వారీగా ఒక రోజు ముందుగా వీఆర్‌ఏ, ఆశ వర్కర్ల సహకారంతో కార్డుదారులకు టోకెన్లు పంపిణీ చేయాలి.
 • ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కులు ధరించి దుకాణానికి వచ్చేలా సూచనలు చేయాలి. 
 • ఒకరోజు ముందుగా టోకెన్‌ పొంది వచ్చిన వారికి మాత్రమే క్యూ పద్ధతిలో బియ్యం అందించాలి. 
 • దుకాణానికి వచ్చిన వారు కనీసం ఒక్కో మీటరు దూరంలో నిలబడేలా చర్యలు తీసుకోవాలి. 
 • ప్రతి కార్డుదారుడు చేతులు కడుక్కుని షాపు లోపలికి ప్రవేశించేలా సూచనలు చేయాలి. 
 • చౌకదుకాణాల వద్ద డెటాల్‌, హ్యాండ్‌వాష్‌ లిక్విడ్‌, బకెట్‌ నీళ్లు, మగ్గు ఏర్పాటు చేయాలి. 
 • చేతులు తుడుచుకోవడానికి టవల్‌ అందుబాటులో ఉంచాలి. 
 • జనం గుమిగూడకుండా తగు సూచనలు ఇచ్చేందుకు గ్రామ సహాయకుల సహకారం తీసుకోవాలి. 
 • ప్రతి డీలర్‌, సహాయకులు ముఖానికి మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించాలి. 
 • వీలైనంత వరకు ప్రతి కుటుంబం నుంచి 15 నుంచి 45 సంవత్సరాల వయసు గల వారు రేషన్‌షాపునకు వచ్చేలా చెప్పాలి. 
 • ఈ నెలకు సంబంధించి చౌకడిపోల డీలర్లు చెల్లించిన డీడీ డబ్బులు వచ్చే నెల బియ్యం కోటకు సర్దుబాటు చేయటం. 
 • అదనపు బియ్యం కోట వచ్చినపుడు డీలర్లే హమాలీలకు దిగుమతి చార్జీలు చెల్లించుకోవాలి. 
 • ఈ నెల 27లోగా డీలర్లందరికీ సంబంధిత తహసీల్దార్లు ఐడీ కార్డులు అందించాలి.


logo