శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Mar 21, 2020 , 03:21:34

భక్తులకు నో ఎంట్రీ

భక్తులకు నో ఎంట్రీ

  • ఆర్జీత సేవలు నిలిపివేత
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలవెలబోయిన ఆలయాలు

కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ను అరికట్టడంలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రముఖ ఆలయాల ద్వారాలకు శుక్రవారం తాళాలు వేశారు. ధూపదీప నైవేద్యాలు, నిత్యపూజలు, హారతులకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కేవలం భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు స్పష్టం చేశారు.

వరంగల్‌ కల్చరల్‌/ రెడ్డికాలనీ/ భీమదేవరపల్లి/  మడికొం డ/ ఐనవోలు/ రేగొండ/ కురవి/ తాడ్వాయి/ వెంకటాపూర్‌/ మంగపేట/ గీసుగొండ/  పర్వతగిరి, మార్చి 20:  ప్రజలు గుమిగూడకుండా చూడాలని, తద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రార్థనా మందిరాలను సైతం మూసేయాలన్న సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల ద్వారాలకు శుక్రవారం తాళాలు వేశారు. ఈనెల 31వ తేదీ అనంతరం భక్తులను అనుమతిస్తామని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రలోని భద్రకాళీ ఆలయం, చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల గుడి, షిరిడీ సాయిబాబా దేవాలయాల ద్వారాలకు తాళాలు వేశారు. వేయిస్తంభాల ఆలయంలో ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, కేంద్ర పురావస్తు శాఖ జిల్లా అధికారి మల్లేశం, ఈవో వేణుగోపాల్‌తో కలిసి ద్వార బంధనం చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఎప్పటిలాగే పూజలు కొనసాగుతాయని, భక్తులకు దర్శనం ఉండదని ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ప్రజలు, భక్తులు ఆరోగ్యంగా ఉండేలా అర్చకులు పూజా కైంకర్యాలు కొనసాగించాలని కోరారు. ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాన్ని ఈవో అద్దెంకి నాగేశ్వర్‌రావు, ఆలయ చైర్మన్‌ మునిగాల సంపత్‌కుమార్‌, తహసీల్దార్‌ మంజుల, ఎస్సై నర్సింహారావు, ఆలయ ముఖ్య అర్చకులు పాతర్లపాటి రవీందర్‌  సమక్షంలో ఉదయం 9 గంటలకు మూ సేశారు. భీమదేవరపల్లి మం డలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిపివేసినట్లు ఆలయ నిర్వహణాధికారి సులోచన తెలిపారు. ఆలయ ప్రవేశం, స్వామివారి దర్శనం, ఆర్జిత సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. మడికొండ పరిధి మెట్టుగుట్ట సీతారామచంద్రస్వామి, మెట్టురామలింగేశ్వరస్వామి దేవస్థానాల్లో ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఈవో వీరస్వామి తెలిపారు. స్వామివార్ల నిత్య కైంకర్యాలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు.  అలాగే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేసినట్లు ఈవో సులోచన, ప్రధాన అర్చకులు బుచ్చమాచార్యులు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలోని మహిమాన్వితమైన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ మహామండపానికి ఆలయ ప్రధాన పూజారి పారుపెల్లి రామన్న, ఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో దేవాలయ సిబ్బంది సమ్మయ్య తాళం వేశారు. భక్తులకు ధ్వజస్తంభం నుంచే దర్శనం ఉంటుందని వారు తెలిపారు. స్వామివారికి ప్రాతఃకాల పూజలు, మహానివేదన, నిత్య పూజలు కొనసాగుతాయన్నారు. ఆలయంలో శుభకార్యాలు చేసుకునేందుకు అనుమతి లేదని, భక్తులు సహకరించాలని ఈవో కోరారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి అనుమతి నిలిపివేస్తున్నట్లు మేడారం జాతర ఇన్‌చార్జి ఈవో రాజేంద్రం తెలిపారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తితో కలిసి గేటుకు తాళం వేశారు. మ్యూజియాన్ని మూసివేశారు.  వెంకటాపూర్‌ మండ లం పాలంపేటలోని రామప్ప దేవాలయానికి ఈవో రాచకొండ శ్రీనివాస్‌, పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ తాళం వేశారు. ఆలయ ప్రధాన గేటు మూసేశారు. మార్చి 31వ తేదీ వరకు ఆలయంలో పూజలు యథాతథంగా కొనసాగుతాయని, పర్యాటకులకు అనుమతి లేదని వారు చెప్పారు. మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయంలో ఈ నెల 31వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో సత్యనారాయణ తెలిపారు. అభిషేకాలు, కల్యాణాలు, అర్చనలు, తదితర పూజా కార్యక్రమాలు నిలిపివేస్తున్నామని, భక్తులు సహకరించాలని కోరారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ప్రధాన ద్వారం గేటుకు ఈవో కమల తాళం వేశారు. వాహనాల పూజలను  రద్దు చేసినట్లు వివరించారు.  పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌ దర్గాకు తా ళం వేసినట్లు మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు ఎస్‌కే షబ్బీర్‌అలీ చెప్పారు. ఎస్సై ప్రశాంత్‌బాబు భక్తులకు అవగాహన కల్పించారు.