సోమవారం 25 మే 2020
Warangal-rural - Mar 21, 2020 , 03:17:03

జనతా కర్ఫ్యూతో రైళ్లు రద్దు

జనతా కర్ఫ్యూతో రైళ్లు రద్దు

కాజీపేట, మార్చి 20 : కరోనా వైరస్‌ మహమ్మారిపై యుద్ధం నేపథ్యంలో ఆదివారం చేపడుతున్న జనతా కర్ఫ్యూలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌, సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో కాజీపేట రైల్వే జంక్షన్‌ మీదుగా నడిచే అన్ని ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌లోని వివిధ స్టేషన్లలో శనివారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమయ్యే అన్ని ప్యాసింజర్‌ రైళ్లు, అలాగే,  22న తెల్లవారు జామున 4 గంటల నుంచి ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తిరిగి  22న రాత్రి 10 గంటలకు రాకపోకలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు వివిధ స్టేషన్లలో ప్రారంభమైన రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట స్టేషన్‌ మీదుగా నడిచే కాకతీయ, కృష్ణా, భాగ్యనగర్‌, సింగరేణి, ఇంటర్‌సిటీ, శాతావాహన, గోల్కొండ, సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌, ఈస్ట్‌కోస్ట్‌, గోదావరి, గౌతమి, చార్మినార్‌, సింహపూరి, దక్షిణ్‌, రామగిరి తదితర రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. కాగా, దేశవ్యాప్తంగా దాదాపు 2400  రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.


logo