ఆపరేషన్ కరోనా..!

- విదేశాల నుంచి వచ్చిన వారి వివరాల సేకరణలో జిల్లా యంత్రాంగం
- పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్యారోగ్య శాఖలు రంగంలోకి
- ఊరూరా వివరాల సేకరణ
- మార్చి 1 నుంచి వచ్చినవారెందరు?
- 128 మందేనా ఇంకెవరైనా ఉన్నారా?
- వారి ఆరోగ్యపరిస్థితి ఏమిటీ?
- ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు అప్రమత్తంగా ఉంటే చాలు
- జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్
- నేడు వివరాలు సేకరిస్తాం: కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: కరోనా (కొవిడ్-19) వైరస్ నియంత్రణకు సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కరోనా రాష్ట్రంలో పుట్టింది కాదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నవారెవ్వరికీ ఈ వైరస్ సోకలేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నదని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఈ నెల 1వ తేదీ నుంచి వివిధ దేశాల నుంచి వచ్చిన వారెందరున్నారు? ఎక్కడెక్కడ ఉన్నారు? వారి ఆరోగ్య పరిస్థితులు ఏమిటీ? అన్న విషయాలను సేకరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గురువారం సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజలందరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అన్నిచర్యలు తీసుకోవాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రాథమికంగా లభించిన సమాచారం ఆధారంగా జిల్లాలో వివిధ దేశాల నుంచి 128 మంది వచ్చినట్టు గుర్తించారు. జర్మనీ, నేపాల్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్ మొదలైన దేశాల నుంచి ఇక్కడికి వచ్చినట్టు గుర్తించారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ కరోనా పాజిటివ్ లేదని ప్రాథమికంగా గుర్తించారు. ఇలా మరో 14 రోజులపాటు స్వీయ నియంత్రణలో ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రతిరోజూ వారి ఆరోగ్యస్థితిగతులపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
స్వీయ ప్రకటనే శ్రీరామరక్ష
జిల్లా వ్యాప్తంగా నగరం, పట్టణం, మండల కేంద్రం, గ్రామం, వార్డు, డివిజన్ ఇలా అన్ని స్థాయిల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన వారెందరున్నారు? అని ప్రభుత్వ యంత్రాంగం ఆరా తీసేలోగానే ఎవరికి వారు తాము ఫలానా దేశం నుంచి వచ్చామని సమీపంలో ఉన్న అధికారులకు సమాచారం అందించాలని ప్రభుత్వం కోరింది. స్వీయ ప్రకటనే శ్రీరామ రక్షగా భావించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పోలీస్ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్ఎం, ఆశ వర్కర్, గ్రామకార్యదర్శితో బృందాలు ఏర్పాటు చేశారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణలోని ప్రతినిధులు తమతమ పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారెందరు? అన్న వివరాలు సేకరించే పనిలో నిమగ్నం కావాలని ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇప్పటికే గుర్తించిన వారి యోగ క్షేమాలను పర్యవేక్షించడంతోపాటు వీరితోపాటు మరెవరైనా వచ్చారా అన్న వివరాలను సేకరించేందుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్ల జిల్లాలో గ్రామ, మండల స్థాయిలో అధికారుల పర్యవేక్షణలో చేపట్టిన కార్యాచరణ స్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం ఈ సమాచార సేకరణకు రంగం సిద్ధం చేస్తున్నది.
పరిశుభ్రంగా పరీక్ష కేంద్రాలు..
గురువారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే పరీక్ష కేంద్రాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో జిల్లాలోని 73 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు కూర్చునే బేంచీలు, ముందున్న టేబుల్స్‌ను విద్యార్థుల రాక కన్నా ముందే పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలని జిల్లా విద్యాశాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లకు, ఆ పరీక్ష కేంద్రాల పరిధిలో ఉన్న శానిటేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
గడువులో మార్పు లేదు
కరోనా వైరస్ మరింత విస్తృతం కాకుండా ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా సినిమాహాల్స్, మాల్స్, ఫంక్షన్‌హాల్స్, విద్యా సంస్థల మూసివేత కొనసాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు సహా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, కాన్ఫరెన్స్‌లకు అనుమతుల్లేవని అంతేకాకుండా ఉగాది ఉత్సవాలను నిర్వహించుకోవద్దని కోరింది.
స్వచ్ఛందంగా వెల్లడించండి
- కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
మార్చి 1వ తేదీ నుంచి విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారందరూ వలంటీర్‌గా తెలియజేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారు తమ వివరాలను తహసీల్దార్లకు గానీ, పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వోలకు గానీ తెలియజేయాలని కోరారు. కరోనా వ్యాధి ప్రబలకుండా తమవంతు బాధ్యతగా వారి వివరాలను తెలియజేయాలని సూచించారు. గ్రామ, పట్టణ తమ సమీప బంధువులుగానీ ఇతర కుటుంబ సభ్యులు విదేశాల నుంచి వచ్చిన వివరాలు అందజేయాలని చెప్పారు. గ్రామ కార్యదర్శి, సర్పంచ్, గ్రామ పోలీస్, వీఆర్ఏ, వీఆర్వోలు గ్రామాల్లో విచారణ చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారం నుంచి అట్టి వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సభలు, సమావేశాలు ఐదుగురి కంటే ఎక్కువగా గుమి కూడవద్దని, కరోనా వ్యాధి నియంత్రణకు ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముందు జాగ్రత్తలే ప్రధానమని నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ ప్రజలను కోరారు. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత అందరూ పాటించాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో హై శానిటైజ్డ్ చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అన్ని రకాల వాహనాల్లో శానిటైజ్డ్ చర్యలు చేపట్టేందుకు రవాణాశాఖ అధికారులు కృషి చేయాలని చెప్పారు. అత్యవసర పని ఉన్నప్పుడే ప్రజలు బయటికి పోవాలని, వదంతులు నమ్మవద్దని, ప్రభుత్వం సూచించిన అంశాలను మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలన్నారు. కొవిడ్-19 వ్యాధి విస్తరించకుండా, ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధి విస్తరించకుండా జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు.