శుక్రవారం 29 మే 2020
Warangal-rural - Mar 15, 2020 , 04:09:31

లైన్‌ క్లియర్‌!

లైన్‌ క్లియర్‌!

‘మిషన్‌ భగీరథ’ పథకంలో భాగంగా పరకాల, నర్సంపేట పట్టణాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఇన్నాళ్లు ఆటంకంగా ఉన్న సమస్యకు ప్రభుత్వం తెరదించింది. ఇక్కడ ఇంట్రాటౌన్‌ పనులు చేపట్టేందుకు రీటెండర్‌ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఆహ్వానించిన టెండర్లను రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. రూ. 95 కోట్ల అంచనా వ్యయంతో తాజాగా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రతిపాదనలకు సర్కారు నుంచి పాలనా పరమైన అనుమతులు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్‌ రాగానే రీటెండర్‌ ప్రక్రియ జరిపి పరకాల, నర్సంపేట పట్టణాల్లో ఇంట్రాటౌన్‌ పనులు మొదలు పెట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

  • ఇంట్రాటౌన్‌ పనులకు తొలగిన అడ్డంకులు
  • పరకాల, నర్సంపేట ‘మిషన్‌ భగీరథ’ టెండరు రద్దు
  • రీటెండర్‌ ప్రక్రియ చేపట్టాలని సర్కారు ఆదేశం
  • కొత్తగా రూ. 95 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు
  • రెండు పట్టణాల్లో 25 వేల నల్లాల ఏర్పాటుకు చాన్స్‌
  • త్వరలో పాలనా పరమైన అనుమతులు వచ్చే అవకాశం

వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ: ఇంటింటికీ నల్లా ద్వారా పరకాల, నర్సంపేట పట్టణాల్లో మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ఇన్నాళ్లు ఆటంకంగా ఉన్న సమస్యకు ప్రభుత్వం తెరదించింది. ఇక్కడ ఇంట్రాటౌన్‌ పనులు చేపట్టేందుకు రీటెండర్‌ ప్రక్రియ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఆ హ్వానించిన టెండర్లను రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఈ రెండు పట్టణాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు లైన్‌ క్లియరైంది. సాధ్యమైనంత త్వరలో రీటెండర్‌ ప్రక్రియ నిర్వహించేందుకు ప్రజా ఆరోగ్యశాఖ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు కసర త్తు చేపట్టారు. రూ.95 కోట్ల అంచనా వ్యయంతో తాజాగా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. మరో కొద్ది రోజుల్లో ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి పాలనపరమైన అనుమతలు లభించే అవకాశం ఉంది. అనుమతులు రా గానే రీటెండర్‌ ప్రక్రియ జరిపి పరకాల, నర్సంపేట పట్టణాల్లో ఇంట్రాటౌన్‌ పనులు మొదలు పెట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. గోదావరి, కృష్ణా బేసిన్లతో కూడిన ఈ జిల్లాలో పరకాల, నర్సంపేట పట్టణాలకు మినహా ఇతర ప్రాంతాల కు ఇంటింటికీ నల్లా ద్వారా మిషన్‌ భగీరథ నీటి సరఫరా జరుగుతుంది. జిల్లాలో పదహారు మండలాలు ఉన్నాయి. వీటిలో పాలేరు సెగ్మెంటు ద్వా రా రాయపర్తి, నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాలకు, కరీంనగర్‌ ఎల్‌ఎండీ సెగ్మెంటు ద్వారా వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, దామెర, ఆత్మకూరు, శాయంపేట, పరకాల, నడికూడ మం డలాల ప్రజలకు ఇంటింటికీ నల్లా ఏర్పాటుతో మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాలేరు సెగ్మెంటు పరిధిలో పొరుగున ఉన్న మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని మాదిరిపురంగుట్ట వద్ద, ఎల్‌ఎండీ సెగ్మెంటు పరిధిలో వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల కోసం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ని ధర్మసాగర్‌ వద్ద, ఇతర పరకాల నియోజకవర్గంలోని ఆరు మండలాల కోసం దామెర మండలంలోని సింగరాజుపల్లె, శాయంపేట మండలం కో సం శాయంపేట మండలంలోని జోగంపల్లి వద్ద వాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంట్ల నిర్మాణం జరిగింది. సింగరాజుపల్లె, జోగంపల్లి, ధర్మసాగర్‌ ట్రీట్‌మెం ట్‌ ప్లాంట్ల నుంచి ఎల్‌ఎండీ సెగ్మెంటు పరిధిలోని తొమ్మిది మండలాల ప్రజలకు ఇంటింటికి నల్లా ద్వారా 2018 ఏప్రిల్‌ ఒకటి నుంచి మిషన్‌ భగీర థ నీరు సరఫరా అవుతుంది. 2019 నుంచి పాలే రు సెగ్మెంట్‌ పరిధిలోని రాయపర్తితోపాటు నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలకూ ఇంటింటికీ నల్లా ద్వారా మిషన్‌ భగీరథ నీటి సరఫరా జరుగుతుంది. పరకాల, నర్సంపేట పట్టణాలను పక్కనపెడితే పదహారు మండలాల్లో 1,67,839 ఇండ్లు ఉంటే వీటిలో ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీటి సరఫరా కోసం నల్లా కనెక్షన్‌ ఇచ్చారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఈ మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇంట్రా విలేజ్‌ పనులు చేపట్టి పూర్తి చేశారు. గతంలో నిర్మించిన 547 పాత వాటర్‌ ట్యాంకులు ఉంటే వీటికి తోడు పదహారు మండలాల్లో కొత్తగా 520 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. వీటిలో 519 ట్యాంకుల నిర్మాణం పూర్తయినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యనిర్వాహక ఇంజినీర్‌(ఈఈ) వెంకటరమణారెడ్డి వెల్లడించారు. వర్ధన్నపేట మండల కేంద్రంలో చేపట్టిన ఒక వాటర్‌ ట్యాంకు నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని ఆయన తెలిపారు. కాగా, పదహారు మం డలాల్లో మిషన్‌ భగీరథ నుంచి ఇంటింటికీ నల్లా ద్వారా నీటి సరఫరా ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తిన దాఖలాల్లేవు. గత సంవత్సరం వేసవి కాలంలోనూ మిషన్‌ భగీరథ నుంచి ఇంటింటికీ నల్లా ద్వారా ఈ మండలాల్లోని ప్రతి గ్రామంలో సరిపడ నీటి సరఫరా జరిగింది.


పరకాల, నర్సంపేటలోనే సమస్య..

జిల్లాలో మిషన్‌ భగీరథ నుంచి నీటి సరఫరాకు పరకాల, నర్సంపేట పట్టణాల్లోనే సమస్య ఏర్పడింది. ఎందుకంటే ఈ రెండు పట్టణాల్లో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా కోసం ఇంట్రాటౌన్‌ పనులు జరగలేదు. ఈ పనుల టెండర్‌ దక్కించుకున్న ఏజెన్సీ ఇంట్రాటౌన్‌ పనులు చేయలేదు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ప్రభుత్వం గతంలో పరకాల, నర్సంపేట పట్టణాల్లో ఇంట్రాటౌన్‌ పనుల కోసం ప్రజా ఆరోగ్యశాఖ ఇంజినీరింగ్‌ విభాగం పిలిచిన టెండర్లను ఇటీవల రద్దు చేసింది. తిరిగి రీ టెండర్ల ప్రక్రియ నిర్వహించి సాధ్యమైనంత త్వరలో రెండు పట్టణాల్లోనూ మిషన్‌ భగీరథ నుంచి ఇంటింటికి నల్లా ద్వారా నీటి సరఫరా చేసే పనులు మొదలుపెట్టాలని ప్రజా ఆరోగ్యశాఖ ఇంజినీరింగ్‌ విభాగాన్ని ఆదేశించింది. ఈ నెల 4వ తేదీన నర్సంపేటలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమ సభలో పాల్గొన్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే ప్రజా ఆరోగ్యశాఖ ఇంజినీరింగ్‌ విభాగం రీటెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పరకాల, నర్సంపేట పట్టణాల్లో ఇంటింటికి నల్లాద్వారా నీరు సరఫరా చేసేందుకు ఇంట్రాటౌన్‌ పనులు ప్రారంభించనుందని ఆయన తెలిపారు. ఇంట్రాటౌన్‌ పనులు పెండింగ్‌లో ఉన్నందున నీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం పరకాల, నర్సంపేటలో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసింది. పాలేరు సెగ్మెంటు నుంచి నర్సంపేటకు, ఎల్‌ఎండీ సెగ్మెంటు నుంచి పరకాలకు మిషన్‌ భగీరథ వాటర్‌ను బల్క్‌గా సరఫరా చేస్తుంది. నర్సంపేట పట్టణంలో కమలాపురం సమీపంలోని మినీ స్టేడియం వద్ద, పరకాల పట్టణంలో సీఎంఎస్‌ గోదాము వద్ద ఈ ఏర్పాట్లు చేసింది. మిషన్‌ భగీరథ బల్క్‌ వాటర్‌ను గతంలో ఈ పట్టణాల్లో నిర్మించిన ట్యాంకులు, పైపులైన్‌ ద్వారా ప్రజలకు ఇస్తుంది. ఇంట్రాటౌన్‌ పనులు జరగపోయినా ఇక్కడ నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 


ప్రభుత్వానికి ప్రతిపాదనలు..

పరకాల, నర్సంపేట పట్టణాలకు సంబంధించిన ఇంట్రాటౌన్‌ పనుల టెండర్‌ను రద్దు చేసిన ప్రభుత్వం రీటెండర్‌ ప్రక్రియ నిర్వహణకు ఆదేశించటంతో ప్రజా ఆరోగ్యశాఖ ఇంజినీరింగ్‌ విభాగం కొద్ది రోజుల క్రితం ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపింది. పరకాల పట్టణంలో రూ.50 కోట్లు, నర్సంపేట పట్టణంలో రూ.45 కోట్ల అంచనా వ్యయంతో ఇంట్రాటౌన్‌ పనులకు ఇంజినీర్లు ప్రతిపాదనలు రూపొందించారు. పరకాల పట్టణంలో నాలుగు వాటర్‌ ట్యాంకులు, 80 కిలోమీటర్ల పైపులైన్‌ నిర్మించి ఇంటింటికి ఇక్కడ 13 వేల నల్లాలను ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రతిపాదనల్లో తెలిపారు. నాలుగు ట్యాంకుల్లో రెండు 700కేఎల్‌, ఒకటి 600 కేఎల్‌, మరొకటి 500 కేఎల్‌ది నిర్మించాలని పేర్కొన్నారు. నర్సంపేట పట్టణంలోనూ నాలుగు వాటర్‌ ట్యాంకులు, 88 కిలోమీటర్ల పైపులైన్‌ నిర్మించి ఇంటింటికీ 12 వేల నల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రతిపాదనల్లో స్పష్టం చేశారు. ఇక్కడ నిర్మించే ట్యాంకుల్లో ఒకటి 1000, రెండోది 800, మూడోది 600, నాలుగోది 500కేఎల్‌ది ఉన్నట్లు తెలిపారు. ఈ తాజా ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. మరో కొద్ది రోజుల్లో పరకాల, నర్సంపేట పట్టణాల ఇంట్రాటౌన్‌ పనులకు సంబంధించిన రూ.95 కోట్ల ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతులు లభించవచ్చని ప్రజా ఆరోగ్యశాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన వెంటనే పరకాల, నర్సంపేట పట్టణాల్లో మిషన్‌ భగీరథ ఇంట్రాటౌన్‌ పనుల కోసం రీటెండర్‌ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు రెడీగా ఉన్నారు.


logo