గోదా‘రంగ’వైభోగం!

(వరంగల్‌రూరల్ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ):నర్సంపేట నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతుంది. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నీరు ఈ నియోజకవర్గానికి రాబోతుంది. రామప్ప రిజర్వాయర్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతకు రంగారావుపల్లె వద్ద చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు మూడో దశలోని ఐదో ప్యాకేజీ పంపుహౌస్ (రంగరాయచెరువు ప్రాజెక్టు) నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే సాగునీ టి శాఖ ఇంజినీర్లు ఈ పంపుహౌస్‌లోని ఒక మోటర్ ట్రయల్న్ నిర్వహించారు. సక్సెస్ కావడంతో రెండో మోటర్ ట్రయల్న్ జరిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక ప్రతి సంవత్సరం 131 రోజుల పాటు రెండు మోటర్లతో ఎత్తిపోయ డం ద్వారా నర్సంపేట నియోజకవర్గానికి రెండు టీఎంసీల నీరు అందనుంది. రంగారావుపల్లె వద్ద ఇదే పంపుహౌస్‌ను ఆనుకుని చేపట్టిన రామప్ప- పాకాల ప్రాజెక్టు పంపుహౌస్ నిర్మాణం పూర్తయితే మరో కొద్ది నెలల్లో ఈ నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఇంకో మూడు టీఎంసీల నీరు చేరనుంది. వచ్చే వానాకాలం నుంచి ఈ రెండు పంపుహౌస్‌ల్లోని నాలుగు మోటర్లతో ఎత్తిపోతల ద్వారా ఏటా ఐదు టీఎంసీల దేవాదుల నీరు నర్సంపేటకు అందనుంది. ప్రస్తుతం రామప్ప రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతలకు సిద్ధమైన రంగరాయచెరువు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సాగునీటి శాఖ అధికారులు సన్నాహాలు చేపట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును కలిసి ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. పదిహేను రోజుల్లోపు వచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారని ఎమ్మెల్యే పెద్ది వెల్లడించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే రంగరాయచెరువు ప్రాజెక్టుతో సుమారు 35 వేల ఎకరాలకు సాగునీరు చేరనుంది. రామప్ప- పాకాల ప్రాజెక్టు పూర్తయ్యాక మరో 35 వేల ఎకరాలకు దేవాదుల నీరు అందనుంది. రంగరాయచెరువు, రామప్ప- పాకాల ప్రాజెక్టులతో నర్సంపేట నియోజవర్గంలో మొత్తం 70 వేల ఎకరాలకు దేవాదుల ప్రాజెక్టు మూడో దశ నుంచి నీరు అందేలా సాగునీటి శాఖ ఇంజినీర్లు డిజైన్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో కాగితాల్లోనే..
దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో ములుగు జిల్లాలోని రామప్ప చెరువు రిజర్వాయర్‌గా మారింది. ఈ ప్రాజెక్టు మూడో దశలో రామప్ప రిజర్వాయర్ నుంచి నర్సంపేట నియోజకవర్గానికి ఎత్తిపోతలతో సాగు నీరిచ్చేందుకు రంగరాయచెరువు ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన పన్నెండేళ్ల క్రితం తెరపైకి వచ్చింది. రంగరాయచెరువు నల్లబెల్లి మండలంలో ఉంది. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సర్వే జరిపించి 2009లో రంగరాయచెరువు ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదట రూ.305.69 కోట్లు మంజూరు చేసింది. ఆ తర్వాత అంచనా వ్యయాన్ని రూ.309.99 కోట్లకు పెంచింది. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ పనులు ప్రారంభించేందుకు 2009 నవంబరు 20న సాగునీటి శాఖతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం 56 నెలలు అంటే 2014 జూలై 19వ తేదీలోగా రంగరాయచెరువు ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముగిసేవరకు 2014 వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు కాలేదు. కాగితాలకే పరిమితమైన దీని పనులు 2014లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించడం, తెలంగాణలో టీఆర్ఎస్ కొలువుదీరడం, ప్రస్తుత నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చొరవ ఫలితంగా రంగరాయచెరువు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కదలిక మొదలైంది. పెద్ది సుదర్శన్‌రెడ్డి పట్టుదలతో సీఎం కేసీఆర్ రంగరాయచెరువు ప్రాజెక్టు నిర్మాణ పనులను గాడిన పడేశారు. 2014 జూలై 19న ముగిసిన రంగరాయచెరువు ప్రాజెక్టు నిర్మాణ పనుల గడువును తొలుత 2017 డిసెంబరు 31కి పొడిగించారు. పనుల్లో వేగం పెరిగాక ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల గడువును మరోసారి 2019 మార్చి 31వరకు, చివరిసారి 2020 జూలై 31వరకు ప్రభుత్వం పొడిగించింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రతిపాదన మేరకు సీఎం కేసీఆర్ రంగరాయచెరువు ప్రాజెక్టుకు తోడు రామప్ప-పాకాల ప్రాజెక్టును మంజూరు చేశారు. ఎమ్మెల్యే పెద్ది ప్రత్యేక చొరవతో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. ప్రస్తుతం రంగరాయచెరువు ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరింది. రామప్ప- పాకాల ప్రాజెక్టు పూర్తయ్యాక నర్సంపేట కొనసీమను తలపించే అవకాశం ఉంది.
రంగరాయచెరువు ప్రాజెక్టు లక్ష్యం..
సుమారు 35 వేల ఎకరాలకు సాగు నీరందించేలా నీటి పా రుదల శాఖ ఇంజినీర్లు రంగరాయచెరువు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా కేంద్రం శివారులోని రంగారావుపల్లె వద్ద రామప్ప రిజర్వాయర్ నుంచి నీటి ని ఎత్తిపోసేందుకు ఈ ప్రాజెక్టు పంపుహౌస్ నిర్మాణం చేపట్టా రు. పంపుహౌస్ నిర్మాణం పూర్తయింది. ఎత్తిపోత కోసం ఈ పంపుహౌస్‌లో రెండు మోటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కో మోటరు సామర్థ్యం 5.07 మెగావాట్లు. ఈ రెండు మోటర్లు సంవత్సరంలో 131 రోజుల పాటు ఎత్తిపోస్తే 2 టీఎంసీల నీరు రంగరాయచెరువు ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టుకు చేరనుంది. రామప్ప రిజర్వాయర్ నుంచి పంపుహౌస్ వరకు 800 మీటర్ల పొడవు అప్రోచ్ కెనాల్ నిర్మించారు. రామప్ప చెరువులోకి వచ్చే దేవాదుల నీరు అప్రోచ్ కెనాల్ ద్వారా పంపుహౌస్‌లోకి చేరుతుంది. ఈ నీటిని రెండు మోటర్లతో ఎత్తిపోతల ద్వారా నర్సంపేట నియోజకవర్గానికి తరలించేందుకు ఇక్కడి నుంచి 23.70 కిలోమీటర్లు(గ్రావిటీ పైపులైన్ కలిపి) 1.70 మీటర్ల డయాతో కూడిన పైపులైన్ వేశారు. ఈ పైపులైన్‌కు 6.208 కిమీ, 11.905 కిమీ, 13.525 కిమీ, 23.70కిమీ వద్ద డెలివరీ సిస్టర్న్(డీసీ)లు నిర్మించారు. వీటి నుంచి లింక్ మెయిన్ కెనాల్(ఎల్ఎంసీ), రైట్ మెయిన్ కెనాల్(ఆర్ఎంసీ), లెఫ్ట్ మెయిన్ కెనాల్(ఎల్ఎంసీ) ద్వారా నిర్దేశిత ఆయకట్టుకు నీరందనుంది. ఇదే డీసీల నుంచి అవసరమైతే పాకాల చెరువులోకి దేవాదుల ప్రాజెక్టు నీరు చే రేలా ఏర్పాట్లు చేశారు.ప్రతిపాదిత ఆయకట్టుకు నీరిచ్చేందుకు డీసీల పరిధిలో కాల్వల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలనేది ఇంజినీర్ల టార్గెట్.
ట్రయల్న్ సక్సెస్..
రంగారావుపల్లె వద్ద నిర్మించిన పంపుహౌస్‌లోని 10.14 మెగావాట్ల సామర్థ్యం గల రెండు మోటర్లతో రామప్ప రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 132/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మించారు. ఇక్కడ నిర్మాణం జరుగుతున్న రామప్ప- పాకాల ప్రాజెక్టు పంపుహౌస్‌లోని మోటర్లతో ఎత్తిపోతలకు కూడా ఇదే సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా కానుంది. ఈ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో ప్రస్తుతం రంగరాయచెరువు ప్రాజెక్టు పంపుహౌస్‌లోని రెండు మోటర్లతో ఎత్తిపోత ప్రారంభించేందుకు సాగునీటి శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మూడు రోజల క్రితం ఈ పంపుహౌస్‌లోని ఒక మోటర్ ట్రయల్న్ నిర్వహించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ మోటర్ ఎత్తిపోసింది. పైపులైన్ ద్వారా నీరు ఖానాపురం మండలంలోని పాకాల చెరువుకు చేరింది. దీంతో విజయవంతమైనట్లు సాగునీటి శాఖ ఇంజినీర్లు భావిస్తున్నారు. రెండో మోటర్ ట్రయల్ రన్ నిర్వహించేందుకూ రెడీ అవుతున్నారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో భూపాలపల్లి మండలంలోని భీంగణపురం పంపుహౌస్ నుంచి రామప్ప చెరువు వరకు చేపట్టిన మూడు వరసల పైపులైన్ పనులు తుది దశకు చేరాయి. వీటిలో ఒక పైపులైన్ ద్వార భీంగణపురం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా దేవాదుల నీరు కొద్దిరోజుల నుంచి రామప్ప చెరువులోకి వస్తోంది. దీంతో రంగరాయచెరువు ప్రాజెక్టు పంపుహౌస్‌లోని మోటర్లతో ఎత్తిపోతలకు సాగునీటి శాఖ సిద్ధమైంది.
తాజావార్తలు
- పార్లమెంట్ క్యాంటిన్లో ఇక నో సబ్సిడీ: ధరలు తడిసిమోపెడు
- బడ్జెట్లో సామాన్యుడు ఏం ఆశిస్తున్నాడు?
- టీసీఎస్ @ 3
- భారత్‌కు టిక్‌టాక్ గుడ్‌బై
- మార్కెట్లో అలజడి
- బీవోబీ లాభం 1,159 కోట్లు
- 2 వేల కోట్లు సమీకరించిన జీఎమ్మార్
- ఒంటరిగా డాక్టర్ వ్యాక్సినేషన్.. భార్య నిలదీసిన వీడియో వైరల్
- ఆలయాల అభివృద్ధికి కృషి
- మద్దతుకు రెండింతలై..