బుధవారం 03 జూన్ 2020
Warangal-rural - Mar 10, 2020 , 02:40:30

జనసంద్రమైన కొమ్మాల జాతర

జనసంద్రమైన కొమ్మాల జాతర

గీసుగొండ, మార్చి 09 :  కొలిచిన వారికి కొంగుబంగారమై వరాలిచ్చే శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. వరంగల్‌ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమ్మాల  శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరకు భక్తులు వరంగల్‌ ఉమ్మడి జిల్లాతో పాటు యావత్తు తెలంగాణ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో  తరలివస్తున్నారు.  ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు సాగే  ఈ జాతరకు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారికి మొక్కులను చెల్లించుకుంటారు.   కార్యక్రమాలను అర్చకులు కాండూరి రామాచార్యులు ఆధ్వర్యంలో  వైభవంగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు ఎడ్ల బండ్లపై తరలివస్తున్నారు.    

జాతరలో వైద్యశిబిరం 

 శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరలో భక్తుల సౌకర్యార్ధం గీసుగొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో వైద్యశిబిరంను ఏర్పాటు చేశారు.  భక్తులకు కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని భక్తులు మాస్కులు ధరించి మాత్రమే జాతరకు రావాలని విస్తృత ప్రచారం చేయడంతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది  భక్తులకు మాస్కులను అందిస్తున్నారు.  వైద్యాధికారి శ్రీనివాస్‌ అందుబాటులో ఉండి పర్యవేక్షిస్తున్నారు. జాతరలో 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు.

 పోలీసుల భారీ బందోబస్తు 

జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు  చేసినట్లు మమునూర్‌ ఏసీపీ శ్యాంసుందర్‌  తెలిపారు.  మొత్తం 200 మంది పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

తరలివచ్చిన భక్తి ప్రభలు 

భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లపై భక్తి ప్రభలు, గుర్రపు, ఏనుగు బొమ్మలతో కూడిన బండ్లను భక్తులు డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేస్తు స్వామి వారి  గుట్టచుట్ట్టూ ప్రదర్శన చేస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు.  

 కొమ్మాల జాతరకు తరలిన ప్రభ బండ్లు 

నర్సంపేట రూరల్‌ : గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు మండలంలోని పలు గ్రామాల నుంచి సోమవారం పలు ప్రభ బండ్లు తరలివెళ్లాయి.  లక్నెపల్లి, గురిజాల గ్రామాల్లో శ్రీలక్ష్మీన రసింహస్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  వారం రోజులుగా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రభబండ్లను ముస్తాబు చేశారు.  సోమవారం ఈ గ్రామాల నుంచి ప్రభ బండ్లు జాతరకు వెళ్లాయి. లక్నెపల్లిలో టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పాత్కాల కొమ్మాలు ఆధ్వర్యంలో ప్రభ బండిని ఆకర్శణీయంగా తయారు చేసి కొమ్మాల జాతరకు తరలివెళ్లారు.  

 దుగ్గొండి మండలం నుంచి...

దుగ్గొండి : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర సోమవారం రాత్రి నుంచి ప్రారంభం కాగా  మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లపై, ద్విచక్రవాహనాలపై ప్రభలు కట్టుకొని తరలివెళ్లారు. రాజకీయ ప్రభ బండ్లు నిషేధించడంతో జాతర సందడి కాస్త తగ్గినా భక్తులు మాత్రం ద్విచక్రవాహనాలపై ప్రభలను నిర్మించుకుని తరలి వెళ్తున్నారు.   భక్తులు తమ అభిమానదేవుడికి ఎండ్ల బండ్లపై ఏనుగుల బొమ్మ లు, గుర్రాల బొమ్మలను తయారు చేసుకొని బయలుదేరారు. యాదవ కులస్తులు గొర్రె, మేకపోతుల ప్రభలను కట్టుకొని జాతరకు నడిచి వెళ్లారు.

ప్రభల నిషేధంతో గిర్నిబావి వద్ద పోలీసు పికెటింగ్‌ 

కొమ్మాల జాతర సందర్భంగా పోలీస్‌ ఉన్నతాధికారులు ఎలాంటి అల్లర్లు జరుగకుండా రాజకీయ ప్రభలను పూర్తిగా నిషేధించారు. ఎస్సై రవికిరణ్‌ ఆధ్వర్యంలో గిర్నిబావి వద్ద పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేసి రాజకీయ ప్రభలను వెళ్లకుండా నిఘూ వేశారు.  నర్సంపేట ప్రధానరహదారిలో ఎలాంటి  అల్లర్లు జరుగకుండా  పోలీసులు ఉదయం నుంచి రాత్రి వరకు గస్తీ తిరుగుతూ  పెట్రోలింగ్‌  చేస్తూ ప్రభలను వెనుకకు మళ్లిస్తున్నారు.


logo