గురువారం 04 జూన్ 2020
Warangal-rural - Mar 09, 2020 , 03:58:46

ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రండి

ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రండి

నర్సంపేట,నమస్తేతెలంగాణ: నర్సంపేట నియోజకవర్గానికి గోదావరి జలాలను తరలించే పాకాల, రంగాయ ప్రాజెక్టుల నిర్మాణాలను సీఎం కేసీఆర్‌ చేతులు మీదుగా ప్రారంభించడానికి  ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు .. సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. రంగాయ, పాకాల ప్రాజెక్టులను నర్సంపేట నియోజకవర్గంలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.366 కోట్లు మంజూరు చేసింది. ఉద్యమకాలంలోనే కేసీఆర్‌ ఈ ప్రాంతంలో తిరిగారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను కల్లారా చూశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గానికి గోదావరి జలాలను రప్పించాలనే లక్ష్యం విధించుకున్నారు.  అనుకున్న విధంగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులతో ప్రత్యేక సర్వేను కూడా చేయించారు.  సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ములుగు నియోజకవర్గంలోని రామప్ప చెరువు పరివాహక ప్రాంతంలో పాకాల, రంగాయ ప్రాజెక్టులను నిర్మించింది. గోదావరి నుంచి రామప్పకు, రామప్ప నుంచి రంగాయ, పాకాల ప్రాజెక్టులకు తీసువచ్చే పనులను పూర్తి చేశారు. ఇటీవలే ఈ  రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ట్రయల్‌ రన్‌ కూడా పూర్తి చేశారు. దుబ్బ వాగు వరకు నీరు వచ్చింది. దీంతో ఇంజనీర్లు నాలుగు సార్లు ట్రయల్‌ రన్‌ పూర్తి చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో నీరు సక్సెస్‌గా నీరు వస్తుండడంతో అధికారుల్లోనూ ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.  నర్సంపేటకు గోదావరి జలాలు వస్తే ఖరీఫ్‌తో పాటు, యాసంగిలో కూడా రెండు లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. దీంతో గోదావరి జలాలతో ఈ ప్రాంతం సస్యశామలమవుతుంది. 

సీఎం కేసీఆర్‌ ఆనందం..

ఈ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడంపై  సీఎం కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. సకాలంలో పూర్తి చేసిన ఇంజినీర్లను అభినందించారు. మరో 15 రోజుల్లో ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయడానికి తాను వస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తెలిపారు. 

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే రమేశ్‌

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఆదివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఆవరణలో కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ బడ్జెట్‌ ప్రవేశ అనంతరం గవర్నర్‌కు ధన్యవాదాలు తెలియజేసే అవకాశాన్ని ఎమ్మెల్యే రమేశ్‌కు సీఎం కేసీఆర్‌ కల్పించారు. దీంతో ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర రైతులు, ప్రజలకు అనుగుణంగా దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా ప్రభుత్వం బడ్జెట్‌ రూపకల్పన చేసిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్‌ అన్నారు. 


logo