సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Mar 08, 2020 , 02:34:47

చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి
  • సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి మహేశ్‌నాథ్‌

నర్సంపేట రూరల్‌, మార్చి07: చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి, వరంగల్‌ జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి జీ. వీ. మహేశ్‌నాథ్‌ అన్నారు. శనివారం మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు జయముఖి ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘చట్ట నియమాలు, నేర న్యాయం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల జాయింట్‌ సెక్రటరీ టీవీఆర్‌ఎన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులు గా సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి జీ. వీ. మహేశ్‌నాథ్‌, తా లుకా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌, సివిల్‌ న్యాయమూర్తి సాంకేత్‌మిత్ర హాజరై మాట్లాడారు. చట్టం దృష్టిలో అందరు సమానులేనన్నారు. చట్టాలు, న్యాయం, శిక్ష గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలిపారు. చట్టానికి లోబడి పని చేయాలని, చట్టవ్యతిరేక చర్యలు పాల్పడితే శిక్షలు అనుభవిస్తారని తెలిపారు. న్యాయ సహాయాన్ని పొందేందుకు అందరూ అర్హులేనని తెలిపారు.  చిన్న తప్పులే పెద్ద అనర్థ్ధాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. చిన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చట్టాలను గౌరవించాలని, విద్యార్థులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని కోరారు. న్యాయమూర్తులు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి. రంగయ్య, ప్రిన్సిపాల్‌ లోక్‌నాథ్‌రావు, విభాగాధిపతులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. 


logo