గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Mar 06, 2020 , 02:38:53

వార్డుకో వాహనం!

 వార్డుకో వాహనం!

(వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ)పల్లె ప్రగతి స్ఫూర్తిగా అధికారులు జిల్లాలో పట్టణ ప్రగతి కా ర్యక్రమం నిర్వహిస్తున్నారు. పల్లెల్లో మాదిరిగానే పట్టణాల్లోనూ పారిశుధ్యం, పచ్చదనం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో వార్డుకో వాహనం ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. కొత్తగా ఈ మూడు మున్సిపాలిటీలకు 29 వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో 29 వాహనాల కొనుగోళ్లకు టెండర్లు ఆహ్వానించారు. వీటిలో 28 ఆటోలు (ఫోర్‌వీలర్‌), ఒక ట్రాక్టర్‌ ఉన్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ (ఏసీ) మహేందర్‌రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ధరలపై నిర్ణయం తీసుకుని 29 వాహనాలు కొనుగోలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి నెలనెలా నిధులు ఇస్తున్నట్లుగానే పట్టణ ప్రగతి నిర్వహణకు కూడా ప్రతి నెల నిధులు కేటాయిస్తోంది. 


ఇప్పటికే జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు రెండు నెలల నిధులు ఇచ్చింది. పల్లెల ప్రగతి లక్ష్యంగా ప్రభుత్వం తొలుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. మొదట సెప్టెంబరు 6వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఊరూర పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. తొలివిడత పల్లె ప్రగతిలో భాగంగా మొదటి రోజు ప్రత్యేక అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి ఆయా గ్రామంలో పర్యటించారు. ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించారు. వీటి పరిష్కారం కోసం ఆయా గ్రామంలో గ్రామ సభ నిర్వహించి చేపట్టాల్సిన పనులపై తీర్మానం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ తీర్మానంలో పేర్కొన్న పనులను అధికారులు చేపడుతున్నారు. గత సెప్టెంబర్‌ నుంచి ప్రతి నెల గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు ఇస్తోంది. నెలనెల రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు రూ.339 కోట్లు కేటాయిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెల జిల్లాలోని గ్రామ పంచాయతీలన్నింటికీ నిధులొస్తున్నాయి. ఊరికో ట్రాక్టర్‌ లేదా మినీ ట్రాక్టర్‌, టేలర్‌, ట్యాంకర్‌, ఆటో ట్రాలి వంటివి పంచాయతీ నిధులతో అధికారులు కొనుగోలు చేశారు. పారిశుధ్యం, పచ్చదనమే లక్ష్యంగా పంచాయతీల్లో వాహనాల కొనుగోలు జరిగింది. ప్రతి గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఒక నర్సరీ, డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక నిర్మాణ పనులు చేపట్టారు.


పల్లె ప్రగతి తరహాలో..

పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం కావడం, ఫలితాలు కనపడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. పల్లెలతో పాటు పట్టణాల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో విడతలవారీగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, మున్సిపల్‌ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. పల్లె ప్రగతి నిర్వహణ, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుపై దిశా నిర్దేశం చేశారు. పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి నిర్వహణ కోసం రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రతి నెల రూ.148 కోట్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిధులతో పట్టణాల సమగ్ర అభివృద్ధికి పక్కా ప్రణాళిక తయారు చేసి ఆచరణలో పెట్టాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి చేపట్టి నిరంతరం కొనసాగించాలని చెప్పారు. తొలి విడత ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి నిర్వహించాలన్నారు. 


ఈ మేరకు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో గత ఫిబ్రవరి 24వ తేదీన పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్దన్నపేట మున్సిపాలిటీల పరిధిలోని 58 వార్డుల్లో ప్రజలు ఉత్సాహంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌,  కలెక్టర్‌ ఎం.హరిత, అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి త దితరులు హాజరై ప్రజలకు ఉత్సాహాన్నిచ్చారు. ప్రతి వార్డుకు ని యమితులైన ప్రత్యేకాధికారి, ఆయా వార్డు కౌన్సిలర్‌, వార్డు కమిటీల్లోని సభ్యులు స్థానికులతో కలిసి మొదటి రోజు సమస్యలు గుర్తించారు. వీటి పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించారు. పారిశుధ్యం, పచ్చదనం లక్ష్యంగా ముందుకెళ్తున్నా రు. ప్రతి వార్డులో డ్రైనేజీ శుభ్రం చేశారు. పరిశుభ్రత పాటించని వ్యాపారుల నుంచి జరిమానాలు వసూలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలతో నర్సంపేటలో దుకాణాల ఎదుట చెత్త వేసిన వ్యాపారులకు రూ.30 వేల జరిమానా విధించారు. ఇదే కారణంతో వర్ధన్నపేటలో రూ.20 వేలు, పరకాలలో మరికొందరు వ్యాపారులకు రూ.7 వేల జరిమానా వేశారు. 


ప్రతి నెల రూ.71.88 లక్షలు..

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పట్టణ ప్రగత నిర్వహణ కోసం ఇప్పటికే రెండు విడతల్లో జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు నిధులు రూ.1,43,76,000 వచ్చాయి. ప్రతి నెల నర్సంపేట మున్సిపాలిటీకి రూ.32 లక్షలు, పరకాల మున్సిపాలిటీకి రూ.22.50 లక్షలు, వర్ధన్నపేట మున్సిపాలిటీకి రూ.17,38 లక్షల చొప్పున మూడు మున్సిపాలిటీలకు రూ.71.88 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ లెక్కన గత ఫిబ్రవరి, ఈ నెలకు సంబంధించి మొత్తం రూ.1,43,76,000 జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పంచాయతీ నిధులతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వా హనం సమకూర్చిన ప్రభుత్వం మున్సిపాలిటీ నిధులతో ఆయా మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు ఒక వాహనం ఉండేలా చర్యలకు ఆదేశించింది. ఈ మేరకు ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాహనాలకు తోడు కొత్త వాహనాలు ఎన్ని అవసరమని అధికారులు గుర్తించారు. 


ఫోర్‌ వీలర్స్‌తో కూడిన ఆటో లు నర్సంపేటలో 11, పరకాలలో 10, వర్ధన్నపేటలో 7 కొనుగోలు చేయడం అవసరమని తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో అదనంగా ఒక ట్రాక్టర్‌ను కూడా కొనుగోలు చేయాలని  అధికారులు నిర్ణయించారు. మొ త్తం ఈ 29 వాహనాల ధరలు ఖరారు చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. తక్కువ ధరపై విక్రయించేందుకు ముందుకొచ్చే కంపెనీ టెండర్‌ను ఖరారు చేయనున్నారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం ఉన్న శ్మశానవాటికలు, డంపింగ్‌యా ర్డు, నర్సరీలకు తోడు మూడు పట్టణాల్లో అదనంగా ఒక్కొ డం పింగ్‌యార్డు, శ్మశానవాటిక, నర్సరీ నిర్మాణం కోసం స్థల సేకర ణ జరిపారు. వర్ధన్నపేటలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ సమీపంలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించారు.  నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో వందశాతం పారిశుధ్యం జరగని వార్డుల్లో స్థానిక అధికారులు, కౌన్సిలర్లు కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కొనసాస్తున్నారు. logo