పరిమితి లేకుండా కంది కొనుగోళ్లు

పరకాల టౌన్, మార్చి 04: జిల్లాలోని కంది రైతులకు మద్దతు ధర అందించి వారికి చేయూతను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైతులకు మద్దతు ధర అందేవిధంగా జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం ఒక్క రైతు నుంచి 10క్వింటాళ్ల కందులు మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధనను తొలగించింది. ఈ నిర్ణయంపై రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రతి కందిగింజకు మద్దతు ధర అందించి ప్రభుత్వమే కొనుగోలు చేసేలా మార్క్‌ఫెడ్ అధికారులు సిద్ధమవుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉండడంతో రైతులకు నష్టం జరుగుతోందని భావించిన ప్రభుత్వం వారి నుంచి కందులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిలాలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రెండు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయా సెంటర్లలో రైతులకు మద్దతు ధర కల్పిస్తూ కందులను కొనుగోలు చేస్తున్నారు.
పరకాల, వర్ధన్న పేటలో కొనుగోలు కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా అధికారులు పరకాల వ్యవసాయ మార్కెట్‌తో పాటు వర్ధన్నపేట (ఇల్లంద వ్యవసాయ మార్కెట్)లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ మేరకు పరకాలలో ఇప్పటికే వెయ్యిబస్తాల కందులను కొనుగోలు చేయగా వర్ధన్నపేటలో కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడంతో రైతులు కందులను తీసుకు వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రచారం నిర్వహిస్తుండడంతో గత రెండేళ్లుగా కంది సాగు పెరుగుతూ వస్తోంది. పంట చేతికి వచ్చే సరికి మార్కెట్‌తో మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో రైతులకు మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో నేరుగా ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేస్తోంది. మద్దతు ధర రూ.5,800లతో ప్రభుత్వమే కందులను కొనుగోలు చేయడంతో రైతుల పెద్ద ఉత్తున కొనుగోలు కేంద్రాలకు కందులను తీసుకువస్తున్నారు.
10క్వింటాళ్ల పరిమితి తొలగింపు..
ఒక్క రైతు నుంచి గరిష్టంగా 10క్వింటాళ్ల కందులను మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన ఉండడంతో ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించే రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి నష్టాలను చవి చూడాల్సి వచ్చేది. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో10క్వింటాళ్ల పరిమితిని తొలగించింది. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు పరిమితి లేకుండా కందులను విక్రయించుకునే అవకాశం లభించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పరిమితి తొలగింపు నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యకం చేస్తుండగా అధికారులు ఆ దిశగా కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ధ్రువీకరణ పత్రాలు తప్పని సరి..
కందుల కొనుగోళ్లలో భాగంగా దళారులను నియంత్రించడంతో పాటు మద్దతు ధర నేరుగా రైతులకు దక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతు సమగ్ర సమాచారం పోర్టర్లో నమోదు అయిన భూ వివరాల ప్రకారం కందుల కొనుగోలు చేసే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మార్కెట్‌కు తీసుకువచ్చే కంది రైతులు ఆధార్, పట్టాదార్ పాస్‌పుస్తకం, బ్యాంకు ఖాతాల జిరాక్సు పత్రాలను కొనుగోలు నిర్వాహకులకు అందించాలి. రైతు సమగ్ర సమాచారం పోర్టర్లో నమోదైన భూమి కంటే ఎక్కువ ఉన్న భూమిలో సాగు చేసిన కంది రైతులు తప్పని సరిగా ఏఈవో, వీఆర్వో, ఏవోలు ధ్రువీకరించిన ఒరిజినల్ పత్రాన్ని సెంటర్ నిర్వాహకులకు అందించాల్సి ఉంటుంది.