బుధవారం 03 జూన్ 2020
Warangal-rural - Mar 04, 2020 , 02:47:16

పశు హెల్త్‌ప్రొఫైల్‌..

పశు హెల్త్‌ప్రొఫైల్‌..
  • పశు ఉత్పత్తుల విలువను పెంచడంపై ప్రభుత్వం దృష్టి
  • ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం
  • 90 ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు.. పశు వైద్యుల పర్యవేక్షణ
  • టీకాలిచ్చి యజమానులకు పశువుల హెల్త్‌ కార్డుల జారీ
  • గుర్తింపు కోసం ప్రతి పశువు చెవికి పోగు
  • జిల్లాలో 2,12,988 గోజాతి, గేదె జాతి పశువులు

(వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ): గణనతో పశువుల లెక్కతేల్చిన పశు సంవర్థక శాఖ అధికారులు కొద్ది రోజుల నుంచి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి పశువు వివరాలను తమ రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. వెంటనే ఆయా పశువుకు యూనిక్‌ ఐడీ నంబర్‌ కేటాయిస్తున్నారు. టీకాల అనంతరం ప్రతి పశువు హెల్త్‌ కార్డును యజమానికి  అందజేస్తున్నారు. 12 డిజిట్‌ నంబర్‌తో కూడిన యూనిక్‌ ఐడీతో పాటు ఆయా పశువు హెల్త్‌ ప్రొఫైల్‌ను హెల్త్‌కార్డులో పొందుపరుస్తున్నారు. తర్వాత ప్రతి పశువు వివరాలను తమ కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. గత ఫిబ్రవరి ఒకటి నుంచి పక్కా ప్రణాళికతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 20 శాతం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చి హెల్త్‌ కార్డులను జారీ చేశారు. ప్రస్తుతం వేగం పుంజుకున్న ఈ ప్రత్యేక కార్యక్రమం వందశాతం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చి వాటి యజమానులకు హెల్త్‌ కార్డులు అందజేసే వరకు కొనసాగనుంది. పశు సంవర్థక శాఖ నిర్వహించిన పశు గణన కొద్ది నెలల క్రితం పూర్తయింది. దీంతో జిల్లాలో పశువుల లెక్క తేలింది. గోజాతి, గేదె జాతి పశువులు మొత్తం 2,12,988 ఉన్నట్లు గణనలో వెల్లడైంది. వీటిలో గోజాతి పశువులు అంటే ఆవులు, ఎద్దులు 91,917, గేదె జాతి పశువులు అంటే బర్రెలు, దున్నలు 1,19,476 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పశువుల సంఖ్యలో నెక్కొండ మండలం నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. 


ఈ మండలంలో గోజాతి, గేదె జాతి పశువులు 26,835 ఉన్నాయి. వీటిలో గోజాతి పశువులు 11,840 ఉంటే గేదె జాతి పశువులు 14,995 ఉన్నట్లు పశుసంవర్థక శాఖ అధికారులు వెల్లడించారు. 20,273 గోజాతి, గేదె జాతి పశువులతో రాయపర్తి మండలం రెండో స్థానంలో ఉంది. ఇక్కడ గోజాతి పశువులు 10,826, గేదె జాతి పశువులు 9,447 ఉన్నాయి. 18,918 పశువులతో దుగ్గొండి మండలం జిల్లాలో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ గోజాతి పశువులు 8,171 ఉంటే గేదె జాతి పశువులు 10,747 ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొద్ది తేడాతో సంగెం మండలం పశువుల సంఖ్యలో నాల్గో స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం పశువులు 18,333 ఉండగా వీటిలో గోజాతి పశువులు 7,436, గేదె జాతి పశువులు 10,847 ఉన్నట్లు పశుసంవర్థక శాఖ నిర్వహించిన గణనలో తేలింది. జిల్లాలో అతి తక్కువగా ఆత్మకూరు మండలంలో 5,812 పశువులు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది.


 ఉత్పత్తి తగ్గుదల..

గాలికుంటు వ్యాధితో పశువుల ఉత్పత్తి తగ్గుతున్నట్లు పశు సంవర్థక శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఆన్‌ ఎనిమల్‌ ప్రొడక్టివిటీ అండ్‌ హెల్త్‌' కార్యక్రమాన్ని చేపట్టింది. గాలికుంటు వ్యాధి వల్ల పశు సంపద తగ్గుతున్న దృష్ట్యా నివారణకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. గోజాతి, గేదె జాతి పశువులకు వందశాతం ఈ టీకాలు ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించింది. పశు సంవర్థక శాఖలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కొ టీమ్‌లో ముగ్గురిని నియమించింది. పశు సంవర్థక శాఖ వైద్యులు, ఉద్యోగులు, గోపాలమిత్ర, పశు మిత్రలతో పాటు ఈ శాఖలో పనిచేసి రిటైర్డ్‌ అయిన వారితో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసింది. జిల్లాలో ఇలాంటి టీమ్‌లు 90 పనిచేస్తున్నాయి. వీటి పనితీరును పశుసంవర్థక శాఖలోని ఇద్దరు అసిస్టెంటు డైరెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. గత ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి షెడ్యూల్‌ ప్రకారం ఊరూర ప్రత్యేక బృందాలు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఈ టీమ్‌ల్లోని సభ్యులు ఆయా గ్రామంలోని పశువుల యజమానులకు ముందుగానే సమాచారం ఇస్తున్నారు. ఈ మేరకు గ్రామాలను సందర్శించి ప్రతి పశువు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ఆయా పశువు సెక్స్‌, స్పెసిస్‌, బ్రీడ్‌, ఆడదైతే ఈతలు, గ్రామం, మండలం, యజమాని పేరు, మొబైల్‌ నంబరు, ఆధార్‌ నంబరు, వ్యాక్సినేషన్‌ తేదీ తమ వద్ద ఉన్న రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. వెంటనే తమ వద్ద 12 డిజిట్‌ నంబర్‌తో కూడిన యూనిక్‌ ఐడీ కేటాయించి ఆయా పశువు చెవికి ట్యాగ్‌ వేస్తున్నారు. దీంతో పాటే ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీక ఇచి పశువు యజమానికి హెల్త్‌ కార్డును అందజేస్తున్నారు. ఇవన్నీ ఒకేసారి ప్రణాళికప్రకారం చేస్తున్నారు. 


హెల్త్‌ కార్డులో ఆయా పశువు ఆధార్‌ కార్డు నంబరు(12 డిజిట్‌ నెంబర్‌ యూనిక్‌ ఐడీ), గాలికుంటు వ్యాధి నిరోధక టీకా ఇచ్చిన తేదీని పొందుపరుస్తున్నారు. ఈ కార్డు ఆధారంగా నాలుగు నెలల దూడ నుంచి గోజాతి, గేదె జాతి పశువులన్నింటికీ డీవార్మింగ్‌, గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, ఎదకొచ్చినపుడు కృత్రిమ గర్భధారణ వ్యాక్సినేషన్‌ వంటివి ఇస్తారు. యజమాని వద్ద ఉండే హెల్త్‌కార్డును పరిశీలిస్తే ఆయా పశువు ఆరోగ్య ప్రొఫైల్‌ తెలిసిపోతుంది.  రిజిస్టర్‌లో రాస్తున్న ఆయా పశువు వివరాలను పశుసంవర్థక శాఖ ఉద్యోగులు తమ శాఖ కంప్యూటర్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీనివల్ల ప్రతి పశువు వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం కలుగుతుంది.పశు ఉత్పత్తుల విలువను పెంచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు పశుసంవర్థక శాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె.రవికుమార్‌ చెప్పారు. గాలికుంటు వ్యాధి అంటు వ్యాధి అని, ఈ వ్యాధి సొకడం వల్ల మరణాల శాతం తక్కువైనప్పటికీ పశువుల్లో ఉత్పాదక శక్తి సామర్థ్యం  కుంటుపడుతుంద న్నారు. ఈ వ్యాధి తీవ్రత దేశవాళి పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. మార్చి, ఏప్రిల్‌, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఇది ఎక్కువగా వస్తుందని రవికుమార్‌ చెప్పారు. వ్యాధి లక్షణాలు గుర్తించి యజమానులు తమ పశువులకు  ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని ఆయన తెలిపారు. 


logo