శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Mar 02, 2020 , 02:47:18

‘పట్టణ ప్రగతి’కి కార్యాచరణ

‘పట్టణ ప్రగతి’కి కార్యాచరణ

నర్సంపేట టౌన్‌, మార్చి 01: నర్సంపేట మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు. పట్టణంలోని అన్ని వార్డుల కౌన్సిలర్లతో వారు గుర్తించిన సమస్యలపై చర్చించారు. ప్రగతిని పరుగులు పెట్టించడానికి కార్యాచరణ రూపొందించారు. పట్టణ ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే ప్రగతి సాధ్యమని కౌన్సిలర్లు, అధికారులకు ఆయన సూచించారు. పారిశుద్ధ్యం ప్రధానాంశంగా చర్చ కొనసాగించారు. పట్టణంలో మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణపై సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. అధికారులు, ప్రజలు మమేకమైతేనే దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పెద్ది అన్నారు. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మద్యం దుకాణాల వల్ల చుట్టుపక్కల ఇళ్లవాసులు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు, చిరువ్యాపారుల ప్రగతి కోసం ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి, ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలన్నారు. ప్లాస్టిక్‌ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 

వంద శాతం సీసీరోడ్లు..

పట్టణంలో నూరుశాతం సీసీరోడ్ల నిర్మాణం చేపడతామని, అందుకు ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే పెద్ది కౌన్సిలర్లు, అధికారులకు సూచించారు. సమస్యాత్మక ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. వీధిదీపాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని, ఫిర్యాదుల పరిష్కారం కోసం సమగ్ర నిర్వహణ ఉండాలన్నారు. పౌర సేవా కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలన్నారు. పందులు, కుక్కల స్వైరవిహారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మెరుగైన జీవన విధానం కోసం పారిశుద్ధ్య పనుల నిర్వహణతోనే సాధ్యమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పట్టణ ప్రగతి విజయవంతానికి అందరి సహకారం అవసరమన్నారు. మోడల్‌ సిటీ రూపకల్పనలో ఎలాంటి రాజకీయ విభేదాలు లేకుండా పని చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజిని కిషన్‌, వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకటరెడ్డి, కమిషనర్‌ విద్యాధర్‌, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo