లాభాల బాటలో డీసీసీబీని నడిపిస్తా

వరంగల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ)ని లాభాల్లోకి తీసుకొస్తాం. రైతాంగానికి మరింత చేరువలా బ్యాంక్ కార్యకలాపాలు విస్తరించేలా పటిష్టమైన కార్యాచరణతో వెళ్లడమే మా ముందున్న తక్షణ కర్తవ్యం. గత పాలవర్గం చేసిన అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని మార్నేని రవీందర్రావు స్పష్టం చేశారు. వరంగల్ డీసీసీబీ చరిత్రలో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత పాలకులు చేసిన అవినీతికి ఇప్పటికే ప్రభుత్వ పరంగా సమగ్ర విచారణ జరిగిందని, అయితే వాటిపై కొత్త పాలకవర్గం విధానపరమైన నిర్ణయం తీసుకొని చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీతో చిన్న, సన్నకారు రైతులు రుణాలు తిరిగి చెల్లిస్తున్నా, పెద్దరైతులు మాత్రం చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని ఎప్పటి నుంచో ఉంది. అయితే తమ పాలకవర్గం లోతుగా చర్చించి దీనిపై సమగ్ర కార్యాచరణతో ముందుకెళుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ సహా ఎమ్మెల్యేలందరూ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా నిజాయితీగా పనిచేస్తామని పేర్కొంటూ ఖాతాదారులకు బ్యాంక్‌పై విశ్వసనీయత పెరిగేలా పనిచేస్తామని ఆయన అన్నారు. కొత్తగా ఎన్నికైన సందర్భంగా ఆయన ఆలోచనలు, కార్యాచరణ మొదలైన అంశాలపై ఆయన వెల్లడించిన అభిప్రాయాలిలా ఉన్నాయి.
నమస్తే తెలంగాణ: డీసీసీబీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? మీ స్పందన?
మార్నేని: డీసీసీబీ చరిత్రలో పాలకవర్గం అంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక కూడా ఏకగ్రీవం కావడం మరచిపోలేని అనుభూతి. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. మా ఎన్నికకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి డీసీసీబీ డైరెక్టర్లుగా ఎన్నికైన వారికి ధన్యవాదాలు.
నమస్తే తెలంగాణ: మీ రాజకీయ ప్రస్థానం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచే మొదలైంది. రైతు నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం డీసీసీబీ నష్టాల బాటలో ఉందని ప్రచారం సాగుతున్నది? దీనిని దారిలోకి తేగలమనే నమ్మకం ఉందా?
మార్నేని: నా రాజకీయ జీవితం సొసైటీ చైర్మన్‌గా మొదలైంది. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నిక కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం, రైతును రాజు చేయడమే ధ్యేయంగా అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలే కారణం. డీసీసీబీ ద్వారా రైతులకు మరింత విస్తృతమైన సేవలు అందించాలి. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని బ్యాంక్‌ను గాడిలో పెట్టడం మా తక్షణ కర్తవ్యం. సహకార వ్యవస్థ నిర్వీర్యమైపోయింది? అన్న భావన పూర్తిగా తొలగించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అయితే బ్యాంక్ చరిత్రలో మునుపెన్నడూలేనివిధంగా గత పాలకవర్గాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనుసరించిన విధానాల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు జరిగాయి. కొన్ని సొసైటీలు లాభాల్లో ఉన్నాయి. కొంతమంది వల్ల కొన్ని సొసైటీలు నిర్వీర్యం అయ్యాయన్న అపవాదు ఉంది. దానిని తొలగించడం, బ్యాంక్‌పై రైతుల్లో నమ్మకాన్ని కలిగించడం, పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న సంకల్పంతో అందరం సమష్టిగా ముందుకు సాగుతాం. ప్రస్తుత పాలకవర్గంలో ఉన్న వారందరికీ లాభాపేక్ష లేదు. నిజాయితీగా, నిర్భీతిగా పనిచేసి ఇతర కమర్షియల్ బ్యాంకుల మాదిరిగా డీసీసీబీని గాడిలో పెట్టాలని భావిస్తున్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, సహకార సంఘాల చైర్మన్లతో ఎప్పటికప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలను రచించుకొని ముందుకు సాగుతాం. అందరి సలహాలు, సూచనలు స్వీకరించి అంతిమంగా బ్యాంక్‌ను లాభాల వైపు నడిపిస్తాం.
నమస్తే తెలంగాణ: కొంతమందికే బ్యాంక్ ప్రయోజనాలు దక్కాయి. అధికారంలో ఉన్నవాళ్లకు అవెక్కువగా అందుబాటులో ఉన్నాయన్న అపవాదుంది. గత పాలకవర్గంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటినెలా కొలిక్కి తెస్తారు?
మార్నేని: సహకార వ్యవస్థలో డీసీసీబీ కీలకం. పరపతిని పెంచడం, ప్రతి రైతుకూ బ్యాంక్ భరోసా ఇచ్చేవిధంగా ముందుకు సాగుతాం. ఇక నుంచి రైతులందరూ బ్యాంక్ ప్రయోజనాలు పొందడంలో సమానమే. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. ఇక గత పాలకవర్గంపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వం వాటిపై న్యాయబద్ధంగా, శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్ర విచారణ చేసి, తరవాత చేపట్టాల్సిన చర్యలపై కూడా సూచనలు చేసింది. ఆ విచారణ సందర్భంగా వచ్చిన ఆరోపణలపై మొదటి సమావేశంలో చర్యలు చేపట్టేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. బినామీ పేర్లతో రుణాలు పొందటం, వాటిని సక్రమంగా చెల్లించకపోడం, కాగితాలకే పరిమితమైన అంశాలను లోతుగా పరిశీలించి ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరిస్తాం. ఇతర కమర్షియల్ బ్యాంకులు అనుసరిస్తున్న పద్ధతుల్ని అమలు చేస్తాం. బ్యాంక్ అంటే అందరికీ విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. లోపాలను సవరించి సన్మార్గంలో బ్యాంక్‌ను నడిపిస్తాం. అంతేకాదు బ్యాంక్‌కు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్నాయి. వాటిని పరిరక్షిస్తూ కొత్త ఆస్తులను సమకూర్చడం కోసం సరికొత్త, సమగ్రమైన కార్యాచరణను రూపొందిస్తాం.
నమస్తే తెలంగాణ: కట్టగలిగే స్తోమత ఉండి రుణాలు చెల్లించకుండా ఎగవేత దారులుగా (విల్ ఫుల్ డిఫాల్టర్స్) ముద్రపడ్డ వారిపై మీ వైఖరి ఎలా ఉండబోతున్నది?
మార్నేని: నిజానికి రైతుబంధు వంటి పథకాలతో అన్నదాతలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. రుణమాఫీతో సన్న, చిన్నకారు రైతులే కాకుండా, పెద్ద రైతులకూ ప్రయోజనాలు అందుతున్నాయి. స్వల్పకాలిక రుణాల వసూళ్లలో చిన్న, సన్నకారు రైతులు బాధ్యతగా ఉంటారు. కానీ దీర్ఘకాలిక రుణాలు పొందిన వారు తిరిగి చెల్లించేందుకు అంతగా ముందుకు రావడం లేదు. అటువంటి వారిపై కఠినంగానే వ్యవహరిస్తాం. చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. అంతిమంగా ఈ బ్యాంక్ అందరిదీ అన్న భావన అందరిలో కలిగిస్తాం. ఈ క్రమంలో బ్యాంక్ ఉద్యోగుల సహకారం తీసుకుంటాం. బాగా పనిచేసే అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
తాజావార్తలు
- భారత అభిమానిపై జాత్యహంకార వ్యాఖ్యలు
- టీఆర్ఎస్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- బైడెన్ ప్రమాణస్వీకారంలో ప్రత్యేక ఆకర్శణగా లేడీ గాగా, లోపెజ్
- బీహార్‌లో నేరాలు ఎందుకు పెరిగాయి?
- కమలాహారిస్‌కు అభినందనలు తెలిపిన మైక్ పెన్స్
- కరోనా నియంత్రణ చర్యలు అద్వితీయం : మంత్రి పువ్వాడ
- ఆక్సిజన్ సిలిండర్ల కోసం భారీ క్యూ లైన్లు..
- వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదు : మంత్రి గంగుల కమలాకర్
- తెలుగు రాష్ర్టాల సీఎంలకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ
- సోనూసూద్ టైలరింగ్ షాప్.. కస్టమర్ దుస్తులకు నో గ్యారంటీ! ..వీడియో వైరల్