శుక్రవారం 29 మే 2020
Warangal-rural - Mar 01, 2020 , 02:47:27

‘పట్టణ’ కాంతులు!

‘పట్టణ’ కాంతులు!

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల పరిధిలోని విద్యుత్‌ సమస్యలకు తెరపడుతుంది. ఆయా మున్సిపాలిటీ పరిధిలో గుర్తించిన కరెంటు ప్రాబ్లమ్స్‌ను ఎన్పీడీసీఎల్‌ అధికారులు పరిష్కరిస్తున్నారు. కాలనీలు, వాడలు, వీదుల్లో వంగిన స్తంభాలు సరిచేస్తున్నారు. తుప్పు పట్టిన, డ్యామేజ్డ్‌, రహదారి మధ్య ఉన్న పోల్స్‌ను తొలగిస్తున్నారు. లూజు లైన్‌ సరి చేయడంతో పాటు అదనపు స్తంభాలు అమర్చుతున్నారు. పుట్‌ఫాత్‌పై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల తొలగింపుతో పాటు ఇతర ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టు కంచె వేస్తున్నారు. నేలకు సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల ఎత్తు పెంచుతున్నారు. వీది లైట్లు కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. వీటికి నూతనంగా మీటర్లు పెడుతున్నారు. వీది లైట్ల కోసం ప్రత్యేకంగా మూడో లైన్‌ అమర్చుతున్నారు. జిల్లాలో మున్సిపాలిటీలైన నర్సంపేట, పరకాల, వర్దన్నపేట పట్టణాలు, వరంగల్‌ నగర పాలక సంస్థ పరిధిలోకి వచ్చే గీసుగొండ మండలంలోని గొర్రెకుంట ప్రాంతంలో రూ.80.10 లక్షల ఖర్చుతో ఈ పనులు చేపట్టి కొనసాగిస్తున్నారు. దీంతో పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయి. దీర్ఘకాలంగా ఇక్కడ నెలకొన్న కరెంట్‌ సమస్యలు తొలగిపోతున్నాయి. కొత్త వీది దీపాలు, మూడో లైన్‌ ఏర్పాటుతో పట్టణాల్లోని కాలనీలు, వాడలు, వీదులన్ని విద్యుత్‌ కాంతుల్లో వెలిగిపోతున్నాయి. పల్లెల ప్రగతి లక్ష్యంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో రెండు విడతలు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్పీడీసీఎల్‌ అధికారులు తొలి విడత పల్లె ప్రగతిలో మొదటి రోజు ఆయా గ్రామంలో గుర్తించిన కరెంటు సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించారు. వంగిన పోల్స్‌ను సరిచేసి తుప్పు పట్టిన, డ్యామేజ్‌, రోడ్డు మద్యన ఉన్న పోల్స్‌ను తొలగించి వాటి స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు. పుట్‌ఫాత్‌పై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లనూ తొలగించారు. లూజు లైన్‌ సరిచేసి అదనపు పోల్స్‌ అమర్చారు. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టు కంచె వేశారు. నేలకు దగ్గరలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల ఎత్తు పెంచారు. కొత్త వీది లైట్లు అమర్చి వీటికి మీటర్లు ఏర్పాటు చేశారు. వీది లైట్ల కోసం ప్రత్యేకంగా మూడో వైరు అమర్చారు. చాలా ఏళ్లుగా తమను వెంటాడిన విద్యుత్‌ సమస్యలు పల్లె ప్రగతితో పారిపోవడం పట్ల ఆయా గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పకడ్బందీ ప్రణాళికతో ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి తెచ్చారు. మార్చి 4 వరకు ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ పరిధిలో పట్టణ ప్రగతి కొనసాగనుంది.


తొలి రోజు సమస్యల గుర్తింపు

ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తొలిరోజు ఫిబ్రవరి 24న ఆయా మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో కలిసి పర్యటించారు. గల్లీగల్లీలో కలియతిరిగి స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించారు. వీరిలో ఎన్పీడీసీఎల్‌ అధికారులు కూడా ఉన్నారు. నర్సంపేట, పరకాల, వర్దన్నపేట మున్సిపాలిటీల పరిధిలోని 58 వార్డులు, జిల్లా పరిధిలోకి వచ్చే వరంగల్‌ నగర పాలక సంస్థ పరిధిలోని గొర్రెకుంట ప్రాంతం (2, 3 డివిజన్లు)లో గుర్తించిన కరెంటు సమస్యలపై ఎన్పీడీసీఎల్‌ అధికారులు నివేదిక రూపొందించారు. ఈ నాలుగు పట్టణాల్లో వంగిన, తుప్పు పట్టిన, డ్యామేజ్డ్‌, రోడ్డు మద్య ఉన్న పోల్స్‌, పుట్‌ఫాత్‌లపై గల ట్రాన్స్‌ఫార్మర్లు, లూజు లైన్లు, ప్రమాదం పొంచి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, వీది లైట్లు, మూడో వైరు అమర్చాల్సిన ప్రదేశాలను నివేదికలో పొందుపరిచారు. ఈ పనులకు మొత్తం రూ.80.10 లక్షలు ఖర్చు కానుందని అంచనా వేశారు. ఎన్పీడీసీఎల్‌ సీఎండీ నుంచి అనుమతి పొంది జిల్లాలోని నాలుగు పట్టణాల్లో విద్యుత్‌ సమస్యలు పరిష్కరించే పనులు చేపట్టారు.


స్తంభాల తొలగింపు

నర్సంపేట, పరకాల, వర్దన్నపేట పట్టణాలు, గొర్రెకుంట ప్రాంతంలో వంగిన పోల్స్‌ 119 ఉన్నట్లు ఎన్పీడీసీఎల్‌ అధికారులు గుర్తించారు. వీటిలో అత్యధికంగా పరకాలలో 53 ఉంటే నర్సంపేటలో 32, వర్దన్నపేటలో 32, గొర్రెకుంటలో 2 ఉన్నట్లు నివేదికలో తెలిపారు. ఇప్పటికే శనివారం వరకు వంగిన పోల్స్‌లో 17 సరిచేశారు. మరో 102 పోల్స్‌ను సరిచేయాల్సి ఉంది. మూడు పట్టణాల్లో తుప్పు పట్టిన పోల్స్‌ 51 ఉంటే వీటిలో అత్యధికంగా పరకాలలో 29 ఉన్నాయి. వర్ధన్నపేటలో 15, నర్సంపేటలో 7 ఉండగా ఈ మూడు పట్టణాల్లో శనివారం వరకు 21 పోల్స్‌ను ఎన్పీడీసీఎల్‌ అధికారులు తొలగించారు. ఇంకో 30 పోల్స్‌ను తొలగించాల్సి ఉంది. నాలుగు పట్టణాల్లో డ్యామేజ్డ్‌ పోల్స్‌ 61 ఉన్నాయి. వీటిలో అత్యధికంగా వర్దన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 30 ఉంటే నర్సంపేట పట్టణంలో 25, గొర్రెకుంట ప్రాంతంలో 6 ఉన్నట్లు ఎన్పీడీసీఎల్‌ అధికారులు గుర్తించారు. శనివారం వరకు వర్ధన్నపేటలో 5 డ్యామేజ్డ్‌ పోల్స్‌ తొలగించారు. మిగతా 56 పోల్స్‌ను తొలగించాల్సి ఉంది. నాలుగు పట్టణాల్లో రహదారి మధ్యలో 110 పోల్స్‌ ఉన్నాయి. వీటిలో అత్యధికంగా నర్సంపేట పట్టణంలో 55 ఉంటే పరకాలలో 28, వర్ధన్నపేటలో 24, గొర్రెకుంటలో 3 ఉన్నట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటివరకు నాలుగు పట్టణాల్లోనూ రహదారి మద్యలో ఉన్న పోల్స్‌లో 33 స్తంభాలను తొలగించారు. శనివారం ఒకరోజే రోడ్డు మద్య ఉన్న 23 పోల్స్‌ను తీసేశారు. ఇంకో 77 పోల్స్‌ను తొలగించే పనిలో ఉన్నారు.


 ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టు కంచె

వర్ధన్నపేట, పరకాల, గొర్రెకుంటలో పుట్‌ఫాత్‌లపై 10 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నట్లు ఎన్పీడీసీఎల్‌ అధికారులు తేల్చారు. వీటిలో వర్ధన్నపేటలో 7, పరకాలలో 1, గొర్రెకుంటలో 2 ఉన్నాయి. ఈ ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించేందుకు అధికారులు ప్లాన్‌ తయారు చేశారు. నాలుగు పట్టణాల్లో 19 ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో 2 వర్ధన్నపేట, 8 పరకాల, 4 గొర్రెకుంట, 5 నర్సంపేటలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఎత్తు పెంచాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు నాలుగు పట్టణాల్లో 26 ఉన్నట్లు గుర్తించారు. వీటిలో వర్ధన్నపేటలో 10, పరకాలలో 4, గొర్రెకుంటలో 10, నర్సంపేటలో 2 ఉండగా శనివారం ఒకేరోజు వర్దన్నపేటలో 5 ట్రాన్స్‌ఫార్మర్ల ఎత్తు పెంచారు. నాలుగు పట్టణాల్లో ఇంకో 21 ట్రాన్స్‌ఫార్మర్ల ఎత్తు పెంచాల్సి ఉంది. 


 లూజు లైన్‌పై నజర్‌

పట్టణ ప్రగతిలో ఎన్పీడీసీఎల్‌ అధికారులు లూజు లైన్‌పై దృష్టి సారించారు. నాలుగు పట్టణాల్లో 192 ఆద్యంతాలు లూజు లైన్‌ సరిచేయాల్సి ఉందని గుర్తించారు. శనివారం వరకు 56 ఆద్యంతాలు లూజు లైన్‌ సరిచేశారు. మరో 136 ఆద్యంతాలు లూజు లైన్‌ సరిచేయాల్సి ఉంది. నాలుగు పట్టణాల్లో 292 అదనపు పోల్స్‌ ఏర్పాటుతో లూజు లైన్లు సరిచేయాలని అధికారులు తమ నివేదికలో తెలిపారు. ఇప్పటి వరకు 43 అదనపు స్తంభాలు ఏర్పాటు చేశారు. మరో 249 అదనపు పోల్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం వీది లైట్లు ఉన్న ప్రదేశాల్లో కొత్తగా వర్దన్నపేటలో ఐదు చోట్ల వీదిలైట్లు అమర్చారు. ఇదే వర్దన్నపేటలో 20 పాయింట్లలో వీది లైట్లకు అవసరమైన మీటర్లు ఏర్పాటు చేశారు. వీది లైట్ల కోసం ప్రత్యేకంగా వర్దన్నపేటలో 5, పరకాలలో 2 కిలోమీటర్లు మూడో వైరు అవసరమని గుర్తించారు. శనివారం వర్దన్నపేటలో 1, పరకాలలో 1 కిమీ చొప్పున మొత్తం 2 కిమీ మూడో వైర్‌ అమర్చారు. ఇక్కడ మరో 5 కిమీ మూడో వైర్‌ అమర్చాల్సి ఉందని ఎన్పీడీసీఎల్‌ సర్కిల్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) రాజునాయక్‌ తెలిపారు.


logo