బుధవారం 03 జూన్ 2020
Warangal-rural - Feb 29, 2020 , 02:57:36

‘ప్రగతి’ శోభ!

‘ప్రగతి’ శోభ!

(వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణలో జిల్లా పరుగులు పెడుతున్నది. ఈ కార్యక్రమం ద్వారా చేపట్టిన వివిధ పనులు రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధిస్తూ మెరుగైన స్థానంలో నిలుస్తున్నది. ప్రస్తుతం ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీలో మొలకల పెంపకం, పొడవైన మొక్కల మొలకలకు మార్పిడి బ్యాగ్‌ నింపడం (బాగ్‌ ఫిల్లింగ్‌)లో టాప్‌లో ఉంది. బాగ్‌ ఫిల్లింగ్‌లో సగటున రాష్ట్రంలో 71శాతం పనులు చేపడితే జిల్లా 91శాతంతో నంబర్‌వన్‌ స్థానంలో దూసుకెళ్తుండటం విశేషం. వైకుంఠ ధామాల పనుల్లో రాష్ట్రం సగటు శాతం 71.9ఉంటే 96.80శాతంతో జిల్లా మూడో స్థానంలో నిలిచింది. డంపింగ్‌ యార్డుల పనుల్లో 98.5శాతంతో జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో రాష్ట్రంలో సగటు శాతం 91శాతం మొక్కల సంరక్షణలోనూ జిల్లాలో 89శాతంతో నాలుగో స్థానంలో ఉంది. రాష్ట్రంలో దీని సగటు ఫిగర్‌ 84శాతం. పారిశుధ్య నిర్వహణ కోసం గ్రామ పంచాయతీలకు వాహనాల కొనుగోలులో కూడా జిల్లా ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో ప్రభుత్వం పొందుపర్చిన సమాచారం ద్వారా తెలుస్తున్నది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రోత్సాహం, జిల్లా కలెక్టర్‌ హరిత పట్టుదల, సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారుల సమన్వయంతో పల్లెప్రగతి పనుల్లో జిల్లా దూసుకెళ్తున్నది. పల్లెలు కొత్త శోభను సంతరించుకుంటున్నట్లు చెప్పవచ్చు. 


పల్లెప్రగతి తన శాఖకు సంబంధించినదే కావడం వల్ల మంత్రి ఎర్రబెల్లి ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో నిర్వహించిన పల్లె ప్రగతి అవగాహన సదస్సు, పల్లె ప్రగతి నిర్వహణ, పనుల పురోగతి సమీక్ష సమావేశాల్లో ఆయన పల్లెప్రగతి లక్ష్యాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియజేయటంతో పాటు సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమం నిర్వహణకు ఇస్తున్న పాధాన్యతను చెప్పారు. పల్లెప్రగతి పనుల్లో లక్ష్యాలను అధిగమించే గ్రామపంచాయతీలకు ప్రోత్సహకాలు ప్రకటించారు. ప్రభుత్వ టార్గెట్‌ను రీచ్‌అయిన పంచాయతీలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి నిధుల కేటాయింపులో పెద్దపేట వేయనున్నట్లు స్పష్టంచేశారు. ఆయా గ్రామంలో జన్మించి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రముఖులు, ఎన్నారైలు, ఇతరులను కలిసి అభివృద్ధి పనుల కోసం సహాయం కోరాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఆయనతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి పల్లె ప్రగతి పనుల్లో తమదైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ హరిత పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఎన్పీడీసీఎల్‌ సహా ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులను పల్లె ప్రగతి పనుల నిర్వహణలో పరుగులు పెట్టిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాధాన్య అంశాలైన గ్రామ పంచాయతీకో నర్సరీ, డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం, ట్రాక్టర్‌ లేదా ఇతర వాహనం కొనుగోలుతో పాటు మొక్కల సంరక్షణపై ఆమె సంబంధిత అధికారులకు లక్ష్యాలు నిర్ధేశించి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రత్యేక అధికారులు, సంబంధిత శాఖల అధికారులను సమన్వయపరుస్తూ పల్లె ప్రగతిని ముందుకు తీసుకెళ్తున్నారు.


389 జీపీలకు వాహనాలు..

పల్లెలప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా గ్రామ పంచాయతీలకు రూ.339 కోట్లు ఇస్తుంది. ప్రతి గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారు. పారిశుద్ధ్యం కోసం పంచాయతీకో ట్రాక్టర్‌ లేదా ఇతర వాహనం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అదే వాహనంతో గ్రామంలో మొక్కలకు నీరు పెట్టడానికి ట్యాంకర్‌ సమకూర్చాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలికాలంగా అధికారులు ఆయా గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన వాహనాల కొనుగోలు జరుగుతున్నది. ఆయా గ్రామ పంచాయతీ నిధులతో అధికారులు స్థానిక సర్పంచ్‌తో కలిసి ట్రాక్టర్‌ లేదా మినీ ట్రాక్టర్‌, ఆటో ట్రాలీ, టేలర్‌, ట్యాంకర్‌ వంటివి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 401గ్రామ పంచాయతీలు ఉంటే వీటిలో ఇప్పటివరకు 389పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, టేలర్లు కొన్నారు. వీటిలో 347జీపీలకు ప్రత్యేకంగా ట్యాంకర్లు కూడా కొనుగోలు చేశారు. మిగతా 12గ్రామ పంచాయతీలకూ త్వరలోనే వాహనాల కొనుగోలు పూర్తి చేయనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) నారాయణరావు వెల్లడించారు. 


395 డంపింగ్‌ యార్డులు..

పారిశుద్ధ్యంలో భాగంగా 395గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌ యార్డుల పనులు జరుగుతున్నాయి. వీటిలో స్థల సేకరణ పూర్తయిందని, పనులు చురుగ్గా సాగుతున్నాయని డీపీవో తెలిపారు. మరో ఆరు జీపీల్లో స్థలసేకరణ చేపట్టి డంపింగ్‌ యార్డుల పనులు చేపట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో డంపింగ్‌ యార్డుల పనుల్లో జిల్లా నాలుగో స్థానంలో ఉంది. డంపింగ్‌ యార్డుల పనుల్లో 100శాతంతో పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలు ప్రధమ స్థానంలో ఉంటే 99.9శాతంతో నల్గొండ, వికారాబాద్‌, నిజామాబాద్‌ రెండో స్థానంలో, 98.8 శాతంతో వనపర్తి, ఆదిలాబాద్‌ మూడో స్థానంలో ఉండగా 98.5శాతంతో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది.


బాగ్‌ ఫిల్లింగ్‌లో ఫస్ట్‌..

పచ్చదనం కోసం పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేకంగా ఒక నర్సరీ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని 401గ్రామ పంచాయతీల పరిధిలో అధికారులు స్థల సేకరణ చేసి 401 నర్సరీల నిర్వహణ చేపట్టారు. మొలకల పెంపకానికి బాగ్‌ నింపటం, పొడవైన మొక్కల మొలకలకు మార్పిడి బాగ్‌ నింపడంతో పాటు మొత్తం బాగ్‌ నింపటం జిల్లాలో పూర్తయింది. బాగ్‌ ఫిల్లింగ్‌లో 91 శాతంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో జిల్లా తర్వాత 90 శాతంతో భద్రాద్రికొత్తగూడెం, నల్గొండ జిల్లాలు రెండోస్థానం, 87 శాతంతో కుమ్రంభీం అసిఫాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలు మూడో స్థానంలో ఉన్నాయి. తాజాగా జిల్లా కలెక్టర్‌ హరిత శుక్రవారం రాయపర్తి మండలంలోని బందన్‌పల్లి, కొత్తూరు గ్రామాల్లో ఆకస్మిక పర్యటన చేసి నర్సరీల్లో బాగ్‌ ఫిల్లింగ్‌ పనులను పరిశీలించారు.


మొక్కల సంరక్షణలో ఫోర్త్‌..

హరితహారంలో భాగంగా పల్లెల్లో నాటిన మొక్కల సంరక్షణలో జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణలో జిల్లా 89శాతంతో రాష్ట్రంలో నాలుగో స్థానం కైవసం చేసుకుంది. 93శాతంతో రాష్ట్రంలో నాగర్‌కర్నూలు, వరంగల్‌అర్బన్‌ జిల్లాలు ప్రధమ, 92శాతంతో మెదక్‌, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలు ద్వితీయ స్థానంలో ఉంటే 91 శాతంతో పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలు మూడో స్థానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొక్కల సంరక్షణలో రాష్ర్టానిది సగటు శాతం 84 ఉంది. పచ్చదనం కోసం ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది.


logo