‘పట్టణ ప్రగతి’ని సవాల్‌గా తీసుకోండి

‘కొత్త మున్సిపల్ చట్టంలో పని చేసే ప్రజాప్రతినిధులకు బాధ్యతలతోపాటే గౌరవం ఉంది. నిర్లక్ష్యంగా పని చేసే చైర్మన్, కౌన్సిలర్లను పదవుల నుంచి తొలగించే అధికారం కలెక్టర్లకు ఉంది’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం జనగామ మున్సిపాలిటీ పరిధి 13, 30వ వార్డులోని దళిత వాడల్లో ఆయన పట్టణ ప్రగతిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలనీల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ జిల్లా కలెక్టర్ కే నిఖిలతో కలిసి కాలినడకన తిరుగుతూ ప్రజలు, మహిళలతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆసరా పింఛన్లు వస్తున్నాయా? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? తాగునీరు, విద్యుత్ సరఫరా జరుగుతుందా? తడి, పొడి చెత్తబుట్టలు ఇచ్చారా? వాటిని మీరు వాడుతున్నారా? పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారా? అంటూ గృహిణులను మంత్రి కేసీఆర్ అడిగారు. చెత్తబుట్టలు మళ్లీ ఇస్తాం.. తడి, పొడి చెత్తను కార్మికులకు విడివిడిగా ఇవ్వండి.. మున్సిపల్ సిబ్బందికి కొత్తగా ఆటో రిక్షాలు, రిక్షాలు ఇస్తాం.. వాళ్లు వేర్వేరు డబ్బాల్లో పోయకుంటే ఇవ్వకండి అంటూ మహిళలకు అవగాహన కల్పించారు.
మొక్కల సంరక్షణ బాధ్యత కౌన్సిలర్లదే..
ఏడాదికి రూ. 12.45 కోట్ల జనగామ మున్సిపల్ బడ్జెట్లో 10 శాతం హరితహారానికి కేటాయించాలి. ప్రతి వార్డులో నిర్దేశించిన మేరకు మొక్కలు నాటాలి. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవసరమైన మొక్కల వివరాలతో హరిత ప్రణాళిక ద్వారా మొక్కలు అందించి, నాటిన వాటిలో 85 శాతం దక్కాలే చూడాల్సిన బాధ్యత వార్డు కౌన్సిలర్‌పై ఉంది అని మంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏవైనా హరిత మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం చేసినా.. పట్టణ ప్రగతి లక్ష్యాలను నెరవేర్చకుంటే చైర్మన్ సహా కౌన్సిలర్ల పదవులు పోతాయ్ అని కేటీఆర్ హెచ్చరించారు. లక్ష మంది జనాభా ఉన్న మున్సిపాలిటీలో వెయ్యి మంది జనాభాకు ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండాలి. ఆ లెక్కన 100 మూత్రశాలలు నిర్మించాలి. ఎమ్మెల్యే యాదన్న దగ్గరుండి కట్టిస్తా అంటున్నడు. 2 నెలల్లో వచ్చే ఏప్రిల్, మేలో మళ్లీ జనగామకు వస్తా. సవాల్‌గా తీసుకొని పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిద్దుకోండి. ఈసారి వచ్చినప్పుడు పని చేయని వారిపై కఠినంగా వ్యవహరిస్తా’ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అదేవిధంగా పట్టణ ప్రణాళికలో భాగస్వామ్యం అవుతున్న ప్రత్యేక అధికారులు, అభివృద్ధి కమిటీలు ఆయా వార్డుల్లో పారిశుద్ధ్యం, హరితహరం, ఒక్కో మనిషికి రోజు 135 లీటర్ల నీళ్లు అందేలా వాటర్ ఆడిట్ చేయాలని సూచించారు.
21 రోజుల్లో పర్మిషన్
‘కొత్త మున్సిపల్ చట్టణంలో 596 చదరపు గజాల స్థలం వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నాం. 75 గజాలలోపు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించుకోవచ్చు. టౌన్ ప్లానింగ్ అధికారులు రూపాయి లంచం అడిగినా ఇవ్వద్దు. ఒకవేళ డిమాండ్ చేసినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే అధికారులు, సిబ్బంది తాట తీస్తాం’ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అక్రమ లే అవుట్లు, దొంగ వెంచర్లపై ఉక్కుపాదం మోపాలని, ఖాళీ స్థలాల్లో మురికి తుమ్మలు, చెత్తాచెదారం ఉంటే యజమానికి నోటీసు ఇవ్వండని, వినకుంటే రూ. 5 వేల జరిమానా విధిస్తామని, అయినా వినకుంటే స్థలాన్ని మున్సిపల్ స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణంలో పందులు లేకుండా పెంపకందారులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారు వృత్తి మానేస్తారని చెప్పారు. విద్యుత్ సంబంధించిన అవసరాలు 10 రోజుల్లో గుర్తిస్తే.. 6 నెలల్లో పూర్తిచేస్తాం. ఇప్పుడున్న వైకుంఠధామాలను ఆధునీకరించుకునేందుకు దశల వారీగా నిధులు ఇస్తామని వెల్లడించారు. పల్లె, పట్నం వెళ్లి ప్రజలతో మమేకం కావాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో దళితవాడలు, పేదలు నివసించే బస్తీల్లో తిరిగి సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని అద్భుతంగా తీర్చిదిదుకుందామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. 10 జిల్లాల తెలంగాణ.. 33 జిల్లాలుగా మారింది.. కలలో కూడా జనగామ జిల్లా అయితదని అనుకున్నారా? అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది కేసీఆర్ ప్రభుత్వం.. కలెక్టర్, డీసీపీ స్థాయి అధికారులు ఇక్కడ ఉంటున్నారు. ఊహించని విధంగా డివిజన్లు, మండలాలు, గిరిజనులు, ఆదివాసుల తండాలను పంచాయతీలుగా మార్చుకున్నామని వివరించారు. 8,700 పంచాయతీలు ఉంటే కొత్తగా 3400 చేసుకొని 12,751 జీపీలు అయ్యాయి.. ప్రజల దగ్గరికి పరిపాలన పోవాలె, వారి గడప ముంగిటకు వెళ్లి సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ఇవ్వాలనే లక్ష్యంతో పేదలకు అండగా కష్టాల్లో తోడునీడగా ప్రభుత్వం ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆదర్శ మున్సిపాలిటీ కావాలి..
అభివృద్ధి కోసం ప్రజలందరూ తమతమ బాధ్యతలు నిర్వర్తించి, ఆర్నెళ్లలో జనగామ పట్టణ రూపురేఖలు మార్చుకుంటే కోరినన్ని నిధులు ఇస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఖబ్రస్థాన్, ఖనన వాటిక, వైకుంఠధాలాలతోపాటు అత్యాధునిక సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పార్కుల అభివృద్ధి, డంపింగ్‌యార్డు అభివృద్ధి వంటి పనులు చేపడుతామని తెలిపారు. ఒక్కో కౌన్సిలర్ ఒక్కో కేసీఆర్‌గా మారి తమ వార్డును అభివృద్ధి చేసుకోవాలన్నారు. గతంలో జనగామలో వారం రోజులకోసారి మంచినీళ్లు వచ్చేవని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నదని, దాని తొలి ఫలితం జనగామ నియోజకవర్గానికి దక్కడం.. ఆ నీటిని తాగడం ద్వారా ఆరోగ్య పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు. పట్టణంలో మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్లు ఇవ్వని వారికి రాబోయే రెండు, మూడు రోజుల్లో రూపాయికే ఇస్తామన్నారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణాలను అభివృద్ధి చేసుకునేందుకు కదులుతున్నామని, రాబోయే నాలుగేండ్లలో జనగామను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడంలో రాజకీయాలు, పార్టీలకతీతంగా అందరు కలిసి పని చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఓజే మధు, డీసీపీ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున లింగయ్య, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, కౌన్సిలర్లు చంద్రకళ, బొట్ల శ్రీనివాస్, బండ పద్మ, వాంకుడోత్ అనిత, డాక్టర్ సుధాసుగుణాకర్రాజు, సమద్, పాక రమ, కర్రె శ్రీనివాస్, గుర్రం భూలక్ష్మి, అరవింద్‌రెడ్డి, దయాకర్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, ఎంపీపీ మేకల కళింగరాజు, జెడ్పీటీసీ నిమ్మతి దీపిక, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మాశెట్టి వెంకన్న, ఉడుగుల కిష్టయ్య, కొలగాని కావ్య, మంజుల, గుర్రం నాగరాజు, మెడె గంగా, సురుగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మాతృవియోగంతో బాధపడుతున్న టీఆర్ఎస్ నాయకులు ఉడుగుల నర్సింహులు ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్ పరామర్శించారు.
తాజావార్తలు
- షార్ట్‌సర్య్కూట్‌తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్‌లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- హరిహరన్ మెడలోని డైమండ్ చైన్ మాయం..!
- చరిత్రలో ఈరోజు.. బ్రిటిష్ గవర్నర్‌పై బాంబు విసిరిన దేశభక్తుడతడు..
- ఇంటెలిజెన్స్ అధికారులమంటూ.. తండ్రీకొడుకుల షికారు
- కులవృత్తులకు రూ.వెయ్యి కోట్లతో చేయూత
- సోనుసూద్ పిటిషన్‌ను కొట్టివేసిన బాంబే హైకోర్టు
- మేనల్లుడి వివాహాన్ని కన్ఫాం చేసిన వరుణ్ ధావన్ మామ