శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Feb 27, 2020 , 02:56:52

మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన ఆంతర్యం..?

మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన ఆంతర్యం..?

(వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ):రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన ఆంతర్యం ఏమిటీ? రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు అందరూ కార్యోన్ముఖులు అయ్యారా? లేదా? ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంది? స్థానికంగా ఎక్కడిక్కడ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కార్యరంగంలోకి దిగారా? లేదా? అన్న విషయాన్ని స్వయంగా తెలుసుకునేందుకు కనీసం టూర్‌ షెడ్యూల్‌ కూడా విడుదల చేయకుండా, ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా మంత్రి కేటీఆర్‌ రంగంలోకి రంగంలోకి ఎందుకు దిగారు? అన్నది అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమై మూడు రోజులు అవుతుంది. వచ్చేనెల నాలుగుతో పది రోజుల పట్టణ ప్రగతి ముగుస్తుంది.  ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, పట్టణ శాఖ మంత్రి కేటీఆర్‌ సహ ఇతర మంత్రులు, జిల్లా, మున్సిపల్‌ ఉన్నతాధికారులు, అడిషనల్‌ కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేసినప్పుడే ‘రాష్ట్రం నుంచి ప్రత్యేక అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎంపిక చేసుకున్న లక్ష్యాల సాధనకు అందరూ సిద్ధం కావలసిందే. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా కట్టుదాటితే వేటు తప్పదు అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మంత్రి కేటీఆర్‌ జనగామ మున్సిపాలిటీలో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నదో మంత్రి పర్యటనతో స్పష్టమైంది. నిజానికి పల్లె ప్రగతి కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతమైంది. ఉద్యమస్ఫూర్తితో స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు  ఉదయం మొదలు సాయంత్రం వరకు క్షేత్రస్థాయిలో ముందుగా నిర్దేశించుకున్న కాలపట్టిక ప్రకారం వెళ్లిపోయారు. అందరి భాగస్వామ్యం, సమష్టి సమన్వయంతో పల్లె ప్రగతి సూపర్‌హిట్‌ అయింది. ఆచరణాత్మకమైన విజయాన్ని అందిపుచ్చుకున్న ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పది రోజులపాటు అందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఇల్లు ఇల్లూ జల్లెడ పట్టి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని తెలుసుకొని వాటికి సంబధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. 


అప్రమత్తంగా లేకుంటే..

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఏ స్థాయిలో అయినా ఏమరపాటు కూడదన్న సంకేతాలను బుధవారం మంత్రి కేటీఆర్‌ ఇచ్చారు. అప్రమత్తంగా ఉండకపోతే అందుకు బాధ్యులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన పర్యటన ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అన్ని మున్సిపాలిటీలతోపాటు వరంగల్‌ నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ఇంకా ఉద్యమ స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమం ఊపకందుకోలేదని వివిధ మార్గాల ద్వారా సర్కార్‌కు సంకేతాలు వెళ్లాయా? జరుగుతున్న పరిణామాలు అవునననే  అంటున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చాలా వరకు మున్సిపాలిటీల్లో, నగర పాలక సంస్థ పరిధిలో ఎమ్మెల్యేలు పర్యటించినప్పుడో? లేదా మంత్రుల పర్యటన ఉన్నప్పుడో మాత్రమే  తిరుగుతున్నారని, ప్రముఖుల పర్యటన ముగియగానే ఎక్కడివాళ్లు అక్కడ వెళుతూ ఆ రోజు కార్యక్రమం ముగిసినట్టుగా చేస్తున్నారని సర్కార్‌కు వివిధ మార్గాల ద్వారా నివేదికలు అందినట్టు తెలుస్తున్నది. ఆ సమాచారం ఆధారంగానే మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగి ప్రతిష్టాత్మక పట్టణ ప్రగతిని పరుగులు పెట్టించాలన్న సంకల్పంతో రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. మరోవైపు జనగామ పర్యటనలో మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రసంగం, ఎవరేమి చేయాలి? చేయకపోతే ఎలా ఉంటుంది? అనే వాటిలో దాదాపు అందరికీ స్పష్టత వచ్చినట్లు అయింది. 


స్థానిక ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా.. 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్యసాధకులు కౌన్సిలర్లు, కార్పొరేటర్లేన్నది మరోసారి మంత్రి కేటీఆర్‌ తన జనగామ పర్యటనలో స్పష్టం చేశారు.   వాడ వాడలా ఏ డివిజన్‌ లేదా వార్డు పరిధిలో వారు హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలి. నాటిన మొక్కల్లో 85శాతం మొక్కలు బతకాలి. ఒకవేళ అలా కాని పక్షంలో సంబంధిత వార్డు లేదా డివిజన్‌ బాధ్యులైన కౌల్సిలర్‌, కార్పొరేటరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందివ్వటంలో చురుకుగా ఉండాలన్న సంకేతాన్నిచ్చారు. అదే సమయంలో కొత్త మున్సిపల్‌ చట్టంలో దఖలు పరచిన విధులు, నెరవేర్చాల్సిన బాధ్యతల నుంచి ఎవరైనా పక్కకు జరిగినట్టు రూఢీ అయితే పక్కనపెట్టకపెట్టక తప్పదన్న స్పష్టమైన సంకేతాన్ని మంత్రి కేటీఆర్‌ ఇచ్చారు. అంతేకాకుండా అధికార యంత్రాంగం సైతం బాధ్యతగా ఉండాలి. అవినీతి ఆరోపణలు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. 


పనిమంతులకు ప్రోత్సాహం 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క్రీయాశీల పథకాల అమలులో బాగా పనిచేసేవారికి సర్కార్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. చట్టానికి లోబడి ప్రజల యోగక్షేమాలే పరమావధిగా పనిచేసేవారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న సంకేతాన్ని మంత్రి కేటీఆర్‌ ఇచ్చారు. దీంతో అధికార యంత్రాంగానికి భరోసా దొరికిందన్న అభిఫ్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు నాలుగు కమిటీలు, కమిటీకి 15 మంది చొప్పున కార్పొరేషన్‌లో డివిజన్‌కు 60 మంది చొప్పున నగర పాలక సంస్థ పరిధిలో 3480 మంది  ఒక్కసారిగా క్షేత్రస్థాయిలో దిగితే ప్రజల్లో ప్రభుత్వం పట్ల గౌరవం పెరుగుతుంది. ప్రజలకు భరోసా దొరుకుతుంది. అయితే చాలా చోట్ల ఈ సభ్యులు ఇంకారంగంలోకి దిగలేదని సర్కార్‌కు సమాచారం అందినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికైనా ఈ కార్యక్రమం మొదలై మూడు రోజులే అయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరూ కార్యక్షేత్రంలోకి దిగి ముందుకు సాగాల్సిన అనివార్యతలు నెలకొన్నాయి. డివిజన్లలో ఎమ్మెల్యే లేదా మంత్రుల పర్యటన ఉన్నప్పుడే రంగంలోకి దిగే కంటే ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారానికి ప్రతీరోజూ ఎంపిక చేసుకున్న కార్యక్రమాల అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని, ఆ పనులు సరిగ్గా జరుగుతున్నవా లేదా అన్నది ఎమ్మెల్యేలు సమీక్షించుకుంటూ ముందుకు సాగాల్సిందేనని మంత్రి కేటీఆర్‌ పర్యటనతో తేలిపోయిన నేపథ్యంలో పట్టణ ప్రగతిని పరుగులు పెట్టించకపోతే పరిస్థితులు మరోలా ఉండే అవకాశాలున్నాయని గ్రహించిన నేతలు సరికొత్త కార్యాచరణకు రంగంలోకి దిగాలని నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తున్నది. 


logo