శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Feb 27, 2020 , 02:56:12

కాళేశ్వరం జోష్‌!

కాళేశ్వరం జోష్‌!

వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ : ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. వీటికితోడు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీరు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలలను సాకారం చేస్తున్నది. కొద్ది నెలల నుంచి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు చెరువుల్లోకి చేరుతున్నది. దీంతో జిల్లాలోని చెరువులు నీటితో నిండి ఉన్నాయి. గతంలో వానాకాలం సీజన్‌లోనూ జలకళను సం తరించుకుని తమ చెరువులు ఈ ఏడాది యాసంగి సీజన్‌లో నిండు కుండలను తలపిస్తుండడంతో రైతులు మురిసిపోతున్నారు. సాగునీరు అందుబాటులో ఉండ డం వల్ల ప్రస్తుతం యాసంగి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మున్నెన్నడూ లేని రీతిలో ఇపుడు సాధారణ విస్తీర్ణంపై అదనంగా మరో 55 శాతం పంట సాగులోకి రావడం విశేషం. అంటే వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకా రం జిల్లాలో యాసంగి 155 శాతం పంటల సాగు జరిగింది. ఇక్కడ యాసం గి సాధారణ విస్తీర్ణం 38,904 హెక్టార్లు. ఈ ఏడాది ‘కాళేశ్వరం’ పుణ్యమా అని చెరువుల్లో నీరు ఉండడం వల్ల వీటి కింద రైతులు అదనంగా 12,700 హెక్టార్లలో వరి పంటను సాగుచేశారు. దీంతో ప్రస్తు త యాసంగి సీజన్‌లో 60,163 హెక్టార్ల విస్తీర్ణం సాగులోకి వచ్చింది. ప్రధానంగా ఇప్పుడు జిల్లాలో వరి, మొక్కజొన్న పంటల సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. ఈ రెండు పంటల సాధారణ సాగు విస్తీర్ణం పరిశీలిస్తే యాసంగి సీజన్‌లో మొక్కజొన్న పంట 188 శాతం, వరి పంట 159.08 శాతం రైతులు సాగు చేసినట్లు స్పష్టం అవుతున్నది. రైతులు సాగు చేసిన యాసంగి పంటల విస్తీర్ణంలో వరి పంట 25,2200 హెక్టార్లు ఉంది. ఇందులో చెరువుల కింది విస్తీర్ణం 12,700 హెక్టార్లు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా 12,500 హెక్టార్లు వ్యవసాయ బావులు, బోర్ల కింద రైతులు సాగు చేసిన విస్తీర్ణం ఉన్నట్లు ప్రకటించారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో రైతులు సాగు చేసిన మొత్తం 60,163 హెక్టార్ల విస్తీర్ణంలో చెరువుల కింది ఆయకట్టు 12,700 హెక్టార్లు ఉంటే మిగత 47,463 హెక్టార్లు బావులు, బోర్లపై ఆధారపడి రైతులు సాగు చేసిందిగా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. 

పెరిగిన భూగర్భ జలమట్టం

ఇంత పెద్దమొత్తం అంటే 47,463 హెక్టార్లలో బావులు, బోర్లపై ఆధారపడి రైతులు వివిధ పంటలు సాగు చేయటానికి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమైందని చెప్పవచ్చు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా జిల్లాకు ‘కాళేశ్వరం’ నీరు నిరంతరం వస్తుండడం, చెరువుల్లో నిండుతుండడం వల్ల భూగర్భ జలమట్టం పెరిగింది. దీనికి వ్యవసాయరంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా తోడు కావడంతో బావులు, బోర్ల కింద యాసంగి పంటల సాగు విస్తీర్ణం పెరుగుదలకు దోహదపడింది. ఈ మేరకు తాజాగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. చెరువుల కింద యాసంగి రైతులు సాగు చేసిన 12,700 హెక్టార్ల విస్తీర్ణంలో నూటికి నూరుశాతం వరి పంట నాటినట్లు తెలిపారు. జిల్లాలో వరి పంట సాధారణ విస్తీర్ణం 15,772 హెక్టార్లు. దీనికి తోడు ఈ యాసంగి సీజన్‌లో రైతులు మరో 9,428 హెక్టార్లలో వరి పంట సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు నివేదికలో వెల్లడించారు. ప్రస్తుత సీజన్‌లో వరి పంట మొత్తం సాగు విస్తీర్ణం 25,200 హెక్టార్లుగా పేర్కొన్నారు. అంటే ఇప్పుడు జిల్లాలో చెరువులు, బావులు, బోర్ల కింద రైతులు 63 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేసినట్లు విశదమవుతుంది. వరి పంట సాగు కంటే జిల్లాలో ఈ యాసంగి మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండడం అధికారులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. యాసంగి మొక్కజొన్న పంట సాగు సాధారణ విస్తీర్ణం 16,443 హెక్టార్లు. ప్రస్తుత సీజన్‌లో ఇది 30,983 హెక్టార్లకు ఎగబాకింది. బావులు, బోర్లపై ఆధారపడి తాము ఇంత విస్తీర్ణంలో ధైర్యంగా మొక్కజొన్న పంట సాగు చేయటానికి భూగర్భ జలమట్టం పెరగడం, నిరంతర కరంట్‌ సరఫరా కారణమని రైతులు చెబుతున్నారు. సరిపడా నీరందగలదని, ఈసారి తమ పంట ఎండిపోయే అవకాశమే లేదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తగ్గిన ఇతర పంటల సాగు

మొక్కజొన్న, వరి పంటను మినహాయిస్తే జిల్లాలో యాసంగి ఇతర పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. యాసంగి పంటల సాధారణ విస్తీర్ణంలో వేరుశనగ 3,885, మిరప 1,555, శనగ 506, పెసర 311, నువ్వు 36, కౌగ్రామ్‌ 113, మినుము 145, జొన్న 115 హెక్టార్లు. అయితే ఈ పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది. వేరుశనగ పంటను రైతులు సాధారణం కంటే తక్కువ అంటే కేవలం 2,017 హెక్టార్లలోనే సాగు చేశారు. ఇది సాధారణ పంట సాగు విస్తీర్ణంపై 52 శాతమే. సాధారణ పంట సాగు విస్తీర్ణంపై మిరప పంట 68 శాతం అంటే 1,065, శెనగ పంట 92 శాతం అంటే 465 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. పెసర పంట 70 శాతం అంటే 219 హెక్టార్లు, మినుము పంట 79 శాతం అంటే 115, జొన్న పంట 50 శాతం అంటే 58 హెక్టార్లలో మాత్రమే రైతులు సాగు చేశారు. నువ్వు, కౌగ్రాం పంటల సాగుది ఇదే పరిస్థితి. సాగు నీరు సమృద్ధిగా ఉండడం వల్ల రైతులు లాభదాయకమైన పంటల సాగుపైనే యాసంగి సీజన్‌లో దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వరి, మొక్కజొన్న సాగుకే మొగ్గు చూపినట్లు స్పష్టం అవుతున్నది. వరి పంట సాగు విస్తీర్ణం పెరిగిన దరిమిల ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. గన్నీ సంచుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.


logo