సోమవారం 18 జనవరి 2021
Warangal-rural - Feb 26, 2020 , 03:17:26

మహర్దశ!

మహర్దశ!

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : జిల్లాలో అంతర్గత రహదారులకు మహర్దశ పట్టనుంది. గ్రామాల్లో ఇంటర్నల్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ (సీసీ) రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నుంచి నిధులు మంజూరు చేసింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి 487 సీసీ రోడ్లు నిర్మించేందుకు రూ.39.05 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఎం రఘునందన్‌రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31వ తేదీలోగా ఈ సీసీ రోడ్ల నిర్మాణ పనులు  పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి మార్చి నెలాఖరు వరకు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి పంచాయతీరాజ్‌(పీఆర్‌) శాఖ ఇంజినీర్లు కసరత్తు ప్రారంభించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిబంధనల ప్రకారం రూ.39.05 కోట్లతో ఈ సీసీ రోడ్లు నిర్మించనున్నట్లు పీఆర్‌ వరంగల్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ (ఎస్‌ఈ) ఎస్‌ సంపత్‌కుమార్‌ వెల్లడించారు. జిల్లా కలెక్టర్‌ ఎం హరిత అనుమతి తీసుకుని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని 16 మండలాలకు ప్రభుత్వం అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఈ రూ.39.05 కోట్లు ఉపాధి హామీ పథకం నుంచి కేటాయించింది. ఈ నిధుల మంజూరులో ప్రతి మండలానికి చోటు దక్కడం విశేషం. మండలాల వారీగా సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరైన నిధులను పరిశీలిస్తే జిల్లాలో రాయపర్తి మండలం అగ్రభాగాన ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి మండలానికి రూ.6.20 కోట్ల నిధుల కేటాయింపు జరిగింది. రూ.6 కోట్లతో పర్వతగిరి మండలం రెండో స్థానంలో ఉంది. కొత్తగా ఏర్పడిన నడికూడ మండలం రూ.4.56 కోట్ల మంజూరుతో మూడో స్థానం కైవసం చేసుకుంది. వర్ధన్నపేట మండలం రూ.4 కోట్లతో సీసీ రోడ్లకు ఉపాధి హామీ నిధుల కేటాయింపులో నాలుగో స్థానంలో నిలిచింది. సంగెం మండలం రూ.3.25 కోట్ల మంజూరుతో ఐదో స్థానం దక్కించుకుంది. వర్ధన్నపేట,  పర్వతగిరి మండలాలు వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోనివి. అతి తక్కువగా అంటే రూ.30 లక్షలతో శాయంపేట మండలం చివరి స్థానంలో ఉంది. ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట రూరల్‌, పరకాల మండలాలకు రూ.కోటి చొప్పున నిధుల కేటాయింపు జరిగింది. రూ.39.05 కోట్లతో జిల్లాలోని పలు గ్రామాల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధి జరుగనుంది. ఆయా గ్రామంలోని ప్రతి రహదారి కూడా సీసీ రోడ్డు కానుంది.