ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Feb 23, 2020 , 03:12:13

పల్లె మురిసింది.. పట్టణం పరిఢవిల్లాలె..

పల్లె మురిసింది.. పట్టణం పరిఢవిల్లాలె..

పల్లెలు ప్రగతి దిశగా అడుగులేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి. రెండు విడతలుగా పల్లెప్రగతిని ఉద్యమంలా చేపట్టారు. ప్రజలు, అధికారులు అందరూ భాగస్వాములయ్యారు. మొదటి విడత సెప్టెంబర్‌ 6వతేదీనుంచి అక్టోబర్‌ 6వతేదీ వరకు 30 రోజుల పాటు నిర్వహించారు. రెండో విడత జనవరి 2నుంచి 12వతేదీ వరకు 10రోజుల పాటు చేపట్టారు. దీంతో పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం, నర్సరీల ఏర్పాటు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తికాగా, మరికొన్ని గ్రామాల్లో కొనసాగుతున్నాయి. అదే స్ఫూర్తితో పట్టణాలను ప్రగతిబాట పట్టించేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి పది రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. వార్డుల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది. వార్డు ఇన్‌చార్జిలను నియమించింది. ప్రజల భాగస్వామ్యంతో పట్ణణాలను ప్రకాశవంతంగా తీర్చిదిద్దనున్నారు.

  • పల్లెప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు
  • అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతికి శ్రీకారం
  • రేపటి నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం
  • పదిరోజుల పాటు నిర్వహణ
  • పరుగులు తీస్తున్న అధికారులు

నర్సంపేట టౌన్‌, ఫిబ్రవరి  22 : పల్లెల  అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి కార్యకమ్రాన్ని నిర్వహిస్తున్నది. ఇప్పటివరకు ఈ కార్యక్రమం రెండు విడతలుగా నిర్వహించారు. మొదటి విడత గత సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి అక్టోబర్‌ 6 వరకు,  రెండో విడత జనవరి 2వ నుంచి 12 వరకు జరిగింది. మొదటి విడత పల్లెప్రగతి ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టారు. 30 రోజుల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పారిశుధ్యం, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, ఇంకుడు గుంతల నిర్మాణం , విద్యుత్‌ స్తంభాల మరమ్మతులు, ఇంటి పన్నుల వసూలుకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. రెండో విడత సైతం ఇదే తరహాలో కొనసాగింది. 


ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో పట్టణాలను సైతం అద్దంలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచనలో  భాగంగా పురుడు బోసుకున్నదే పట్టణ ప్రగతి.  పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధివిధానాలు రూపొందించింది. ఈ మేరకు అధికారులకు శిక్షణ సైతం పూర్తి చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానుంది. పల్లెల మాదిరిగానే  పట్టణాల్లో సైతం ప్రగతి వెల్లివిరియాలనే  ఉద్దేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమాయత్తం అవుతున్నారు. 


పల్లెప్రగతిలో సాధించిన లక్ష్యాలు!

పల్లెప్రగతి కార్యక్రమం మొదటి విడత 30 రోజులు, రెండో విడత 10 రోజలు పాటు నిర్వహించారు. రెండు విడతల్లో జిల్లా పరిధిలోని 401 గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యంతో పాటు వివిధ రకాల పనులు చేపట్టారు. హరితహారం, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, ఇంకుడు గుంతల నిర్మాణం, పారిశుధ్యం తదితర పనులు అగ్రభాగన నిలిచాయి. రోడ్ల వెంట , ప్రభుత్వ కార్యాలయాల్లో మొత్తం 5.50 లక్షల మొక్కలు నాటారు. 14,076 కిలోమీటర్ల మేర రోడ్లు, అంతర్గత రోడ్లు శుభ్రం చేశారు. 428 కిలోమీటర్ల మేర మురుగుకాల్వలు శుద్ధి చేశారు. 395 చోట్ల విధి దీపాలు ఏర్పాటు చేశారు. అన్ని గ్రామాల్లో కలిపి 3,214 చోట్ల చెట్ల పొదలు, ముళ్ల పొదలను తొలగించారు. 


401 గ్రామాల్లో 376 గ్రామాలకు వైకుంఠధామాల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించి పనులు ప్రారంభించారు. 25 గ్రామాల్లో స్థలాలను గుర్తించాల్సి ఉంది. 380 గ్రామాల్లో డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 20 గ్రామాల్లో పనులు ప్రారంభించాల్సి ఉంది. 401 గ్రామ పంచాయతీల పరిధిలో 1.55 లక్షల ఇళ్లకు రెండు చెత్తబుట్టల చొప్పున పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 12.52 కోట్ల ఇంటి పన్ను బకాయి ఉండగా ఇప్పటి వరకు మొత్తం 6.8 కోట్ల పన్ను బకాయి వసూలు చేశారు. వీటితో పాటు ప్రజల భాగస్వామ్యంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారు. గతంలో మురికి కూపాలుగా ఉన్న పల్లెలు నేడు పరిశుభ్రతతో కళకళాడుతున్నాయి. 


పట్టణ ప్రగతి వెల్లివిరియాలి!

పల్లెలకు దీటుగా పట్టణాల్లో సైతం ప్రగతి దూసుకు పోవాలి. పట్టణాల్లోని వార్డులన్నీ పారిశుధ్యంతో మల్లెపూలను తలపించాలి. రోడ్లన్నీ పరిశుభ్రతతో మెరవాలి. మురుగుకాల్వ దుర్గంధం వెదజల్లకుండా, నీరు నిల్వకుండా ఉండాలి. రోడ్లపై గుంతలు కనిపించకూడదు. పట్టణాల్లో పచ్చదనం పరిఢవిల్లాలి. ప్రజల నుంచి పన్ను వసూలు చేయడంతోపాటు వసతులు సైతం కల్పించాలి. ఇవన్నీ జరగాలంటే పట్టణ ప్రగతితోనే సాధ్యం అని నిరూపించాలి. పల్లెలతో పోల్చితే పట్టణాల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. గ్రామాల్లో జనాభా 300 నుంచి 5 వేల లోపు ఉంటుంది. ఆర్థిక అసమానతలు అధికంగా ఉంటాయి. సామాజిక భేదాలతో పాటు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. 


ప్రస్తుతం జిల్లాలో 9 వేల నుంచి 56 వేల జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అధికారులు సమాయత్తం అవుతున్నారు.  ప్రజాప్రతినిధులతో కలిసి ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. గ్రామాల్లో అంతర్గత రహదారులు తక్కువగా ఉంటాయి. పట్టణాల్లో ఒక్కో వార్డులో కనీసం 50కి తగ్గకుండా రోడ్లు ఉంటాయి. మురుగునీటి వ్యవస్థ భారీగా విస్తరించి ఉండడంతోపాటు అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరణ చేయడం సవాల్‌గా మారుతుంది. జిల్లాలో ఉన్న మూడు మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పాటు చేసినవే కావడంతో చెత్తసేకరణకు యంత్రాంగం పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా పనిచేయాల్సి ఉంటంది. 


మున్సిపాలిటీల పాలకవర్గాలతో పాటు కమిషనర్లు సైతం కొత్త వారే కావడతోం అభివృద్ధిపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వైకుంఠధామాల నిర్మాణం  కోసం స్థలాల సేకరణ జరగాలి. వైకుంఠధామాల నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా హరితహారం కార్యక్రమం నిర్వహించడానికి కావాల్సిన నర్సరీలు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేసి పల్లెలకు దీటుగా పట్టణాలను సైతం ప్రగతిపథాన తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.


logo