శుక్రవారం 05 జూన్ 2020
Warangal-rural - Feb 22, 2020 , 04:05:10

పాప ఎక్కడ..?

పాప ఎక్కడ..?

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ : పుట్టిన వెంటనే శిశువు అదృశ్యం... పాలు పట్టకుండానే తల్లి పొత్తిళ్ల నుంచి మాయం... ఆడ శిశువు జన్మించడంతో విక్రయించామంటున్న తల్లిదండ్రులు... మధ్యవర్తుల ద్వారా దవాఖానలోనే విక్రయం జరిగిందని స్పష్టం... ఒప్పందం ప్రకారం తమకు డబ్బులు కూడాముట్టాయని వెల్లడి... మనసు మార్చుకున్న తమకు బిడ్డను ఇప్పించాలని వేడుకోలు... రంగంలోకి దిగిన అధికారులు... వివిధ శాఖల అధికారులు సంయుక్త విచారణ... శిశువు చనిపోయిందని ఒకసారి, మాకు తెలియదని మరోసారి మధ్యవర్తుల పొంతన లేని సమాధానాలు... శిశువుకు సంబంధించిన రికార్డులేమి దవాఖానలో లేని వైనం... చివరకు అనుమతులు లేవని శిశువు జన్మించిన దవాఖాన మూసివేత... విచారణ మొదలై రోజులు గడిచినప్పటికీ శిశువు ఆచూకీ తెలియలేదు. దీంతో అసలు ఏమి జరిగింది అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం హన్మకొండలోని బాల రక్షణ భవన్‌లో జరిగే సమగ్ర విచారణపై సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకుంది. 


ఉమ్మడి వరంగల్‌ జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ నిర్వహించే ఈ విచారణతో శిశువు విక్రయ వ్యవహారం తేలేనా అనేది ప్రస్తుతం ఆసక్తికర చర్చనీయాంశమైంది. నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామ శివారులోని మాల్యనందతండాకు చెందిన మాలోతు సుశీల ఈ నెల 7వ తేదీన నెక్కొండలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు రోజుల తర్వాత 11న ఆమె ఆసుపత్రి నుంచి తన భర్త ప్రశాంత్‌తో కలిసి మాల్యనందతండాలోని ఇంటికి చేరుకున్నది. జన్మించిన ఆడ శిశువు చనిపోయినట్లు తమ బంధువులు, గ్రామస్తులకు చెప్పారు. చనిపోతే శిశువు మృతదేహం ఎక్కడ? అని బంధువులు, గ్రామస్తులు మాలోతు సుశీల, ప్రశాంత్‌ దంపతులను నిలదీశారు. స్థానిక ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్త రంగంలోకి శిశువు మరణిస్తే డెత్‌ సర్టిఫికెట్‌ చూపాలని అడిగారు. దీంతో పశ్చత్తాపపడిన సుశీల, ప్రశాంత్‌ దంపతులు తమ శిశువును విక్రయించినట్లు చెప్పారు. తనకు మొదటి కాన్పులో ఆడ శిశువు జన్మించిన తరుణంలో ఈ నెల 7న రెండో కాన్పులోనూ మళ్లీ ఆడ శిశువు జన్మించడంతో మధ్యవర్తుల ద్వారా శిశువును విక్రయించినట్లు తల్లి మాలోతు సుశీల తెలిపారు. 


మధ్యవర్తులెవరంటే..

శిశువు తల్లిదండ్రుల కథనం ప్రకారం మధ్యవర్తులు సుశీల డెలివరీ అయిన నెక్కొండలోని ప్రైవేట్‌ ఆసుపత్రి యాజమాన్యం, ఈ దవాఖానలో పనిచేసే ఓ నర్సు. శిశువు విక్రయానికి మొత్తం రూ.27వేలకు ఒప్పందం కుదిరింది. ఇందులో రూ.25 వేలు సుశీల భర్త ప్రశాంత్‌కు ముట్టాయి. డబ్బు ఇచ్చి కొన్న వ్యక్తులు 7వ తేదీన ఆసుపత్రిలో సుశీల జన్మ ఇచ్చిన అర గంటకే ఆడ శిశువును తీసుకెళ్లారు. ఖర్చుల పేరుతో మధ్యవర్తులు రూ.5 వేలు తీసుకోగా సుశీల, ప్రశాంత్‌ దంపతులకు అందినవి రూ.25 వేలు మాత్రమే. బంధువులు, గ్రామస్తుల నిలదీతతో పరివర్తన చెందిన సుశీల, ప్రశాంత్‌ దంపతులు రెండురోజుల అనంతరం తమ బిడ్డను అప్పగించాలని నెక్కొండలోని ఆసుపత్రికి వచ్చారు. అయితే శిశువు మృతి చెందినట్లు ఆసుపత్రి యాజమాన్యం, నర్సు పద్మ చెప్పారు. దీంతో మధ్యవర్తులైన ఆసుపత్రి యాజమాన్యం, నర్సుపై నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రశాంత్‌ వెల్లడించారు. అప్పటికే మాల్యనందతండాకు చెందిన ఏఎన్‌ఎం సంబంధిత అలంకానిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) మెడికల్‌ ఆఫీసర్‌ సుమంత్‌ దృష్టికి తెచ్చారు. దరిమిల మహిళ, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. 


సుశీల ప్రసవించిన నెక్కొండలోని ఆసుపత్రిని ఈ నెల 17వ తేదీన సందర్శించారు. శిశువు విక్రయం వ్యవహారంపై విచారణ చేపట్టారు. సుశీల, ప్రశాంత్‌ చెపుతున్నట్లు ఈ వ్యవహారంలో మధ్యవర్తులైన ఆసుపత్రి యాజమాన్యంతో పాటు నర్సు పద్మను ప్రశ్నించారు. శిశువు చనిపోయిందని, మాకు తెలియదని నర్సు పద్మ, ఆసుపత్రి యాజమాన్యం నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో శిశువు విక్రయం జరిగిందనే తల్లిదండ్రుల కథనానికి బలం చేకూరింది. నాలుగు రోజల పాటు విచారణ అనంతరం ఆసుపత్రి నిర్వహణకు ఉండాల్సిన ప్రభుత్వ అనుమతులు లేవని, రికార్డులు కూడా సరిగా నిర్వహించడం లేదని అధికారులు సుశీల ప్రసవించిన నెక్కొండలోని ప్రైవేట్‌ ఆసుపత్రిని గురువారం సీజ్‌ చేశారు. వీరిలో డిప్యూటీ డీఎంహెచ్‌వో కొమురయ్య, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి శ్యామనీరజ, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి, అలంకానిపేట పీహెచ్‌సీ డాక్టర్‌ సుమంత్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శ్యామల ఉన్నారు.


చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ నోటీసులు..

నెక్కొండలో జరిగిన శిశువు విక్రయ వ్యవహారంపై ప్రాథమిక విచారణ నివేదికను జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి ఈ నెల 18వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ పరుశురాములు, సభ్యులు బాలరాజు, మంజులకు అందజేశారు. దీంతో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ శిశువు జన్మించిన నెక్కొండలోని ప్రైవేట్‌ ఆసుపత్రి యాజమాన్యం, ఈ దవాఖానలోని నర్సు పద్మ, శిశువు తల్లిదండ్రులైన సుశీల, ప్రశాంత్‌కు గురువారం నోటీసులు జారీ చేసింది. అంతేకాదు శిశువు విక్రయ వ్యవహారంపై విచారణ జరుపుతున్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకూ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న హన్మకొండలోని బాల రక్షణ భవన్‌లో జరిగే సమగ్ర విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. శనివారం హన్మకొండలోని బాల రక్షణ భవన్‌లో జరిగే విచారణకు శిశువు తల్లిదండ్రులు, ఆసుపత్రి యాజమాన్యం, నర్సు పద్మతోపాటు విచారణ చేపట్టిన వివిధ శాఖల అధికారులు హాజరుకానుండడంతో శిశువు ఆచూకీ వ్యవహారం కొలిక్కి రావొచ్చని తెలుస్తుంది. 


తమ బిడ్డను ఇప్పించాలని శిశువు తండ్రి ప్రశాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నాడు. పోలీసులు మాత్రం తమకు శిశువు విక్రయం వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొంటున్నట్లు తెలిసింది. శనివారం చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ నిర్వహించే విచారణలో ప్రధానంగా ఈ అంశం ప్రస్తావనకు రానుంది. తండ్రి ప్రశాంత్‌ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందలేదని విచారణలో తేలితే సంబంధిత అధికారులే శనివారం లేదా ఆదివారం గాని నెక్కొండ పోలీస్‌ స్టేషన్‌లో శిశువు విక్రయంపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అధికారుల విచారణలో నర్సంపేట సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తులే నెక్కొండలోని ఆసుపత్రి యాజమాన్యం, నర్సు పద్మ ద్వారా శిశువును కొన్నారని తేలినట్లు సమాచారం. శనివారం బాల రక్షణ భవన్‌లో జరిగే  సమగ్ర విచారణకు కొందరు శిశువుతో హాజరయ్యే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తుంది. అనేక ట్విస్టులు గల ఈ వ్యవహారంలో తన పాప ఆచూకీ కోసం తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. శిశువు కోసం కొద్ది రోజుల నుంచి వేచిచూస్తుంది.


logo