ఆదివారం 07 జూన్ 2020
Warangal-rural - Feb 21, 2020 , 03:50:41

మేమంతే..!

మేమంతే..!

కొందరు అవినీతి అధికారుల పనితీరు పోలీసుశాఖకు మాయని మచ్చగా మారుతున్నది. కర్తవ్యాన్ని పక్కనబెట్టి సొంత వ్యవహారం చక్కదిద్దుకుంటున్న తీరు విస్తుగొలుపుతున్నది. సివిల్‌ తగాదాల్లో తలదూరుస్తూ అక్రమార్కులకు వత్తాసుపలుతున్న వ్యవహారం బట్టబయలవుతున్నది.

  • పోలీసుశాఖలో మారని కొందరు అధికారుల వైఖరి
  • అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్న వైనం
  • అవగాహనతో భూకబ్జాదారులు, రియల్టర్లకు దన్ను
  • న్యాయం కోసం సంప్రదించే సామాన్యులపై జులుం
  • అదనపు ఆముదాన్‌పైనే ఓ అధికారి స్పెషల్‌ నజర్‌
  • తాజా పరిణామాలపై జిల్లాలో హాట్‌ టాపిక్‌

కొందరు అవినీతి అధికారుల పనితీరు పోలీసుశాఖకు మాయని మచ్చగా మారుతున్నది. కర్తవ్యాన్ని పక్కనబెట్టి సొంత వ్యవహారం చక్కదిద్దుకుంటున్న తీరు విస్తుగొలుపుతున్నది. సివిల్‌ తగాదాల్లో తలదూరుస్తూ అక్రమార్కులకు వత్తాసుపలుతున్న వ్యవహారం బట్టబయలవుతున్నది. ప్రభుత్వ ఆదేశాలను పక్కనబెడుతూ భూ కబ్జాదారులు, రియల్టర్లకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. న్యాయం కోసం సంప్రదించే సామాన్యులపై జులుం ప్రదర్శిస్తున్నారు. కొంత మంది అవినీతి అధికారులపై వేటు పడినా వారి రూటు మాత్రం మారడంలేదు. ప్రస్తుతం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు, వరంగల్‌ ఏసీపీ సారంగపాణిని హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడిన దరిమిల జిల్లాలో పోలీసు అధికారుల పనితీరుపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. వీరి బదిలీ వెనుక భూతగాదాలే కారణమనే ప్రచారం జరుగుతున్నది.  దీంతో జిల్లాలోని కొందరు పోలీసు అధికారుల వ్యవహారశైలిపై చర్చ హాట్‌ టాఫిక్‌గా మారింది.

-వరంగల్‌ రూరల్‌ జిల్లాప్రతినిధి/నమస్తే తెలంగాణ


 వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ : పోలీసు శాఖలో కొందరు అధికారులు తమ రూటే సప‘రేటు’ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కాసులు కూడబెట్టడమే కర్తవ్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సివిల్‌ తగాదాల్లో తలదూర్చుతున్నారు. భూకబ్జాదారులు, రియల్టర్లకు దన్నుగా నిలుస్తున్నారు. తమతో అవగాహన కుదుర్చుకున్న అక్రమార్కులకు అన్నీ తామై సహకరిస్తున్నారు. అందినకాడికి దండుకోవడానికి సామాన్యులపై జులుం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా భూవివాదాల్లో కలగజేసుకోవద్దనే ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు. అవినీతిపరులపై వేటు పడుతున్నప్పటికీ తమ వైఖరి మార్చుకోవడం లేదు. ప్రస్తుతం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఈస్ట్‌ జోన్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు, వరంగల్‌ ఏసీపీ సారంగపాణిని హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీసుకు అటాచ్‌ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో జిల్లాలో పోలీసు అధికారుల పనితీరుపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఎందుకంటే డీసీపీ నాగరాజు, ఏసీపీ సారంగపాణి బదిలీ వెనుక భూతగాదాలే కారణమనే ప్రచారంతో ఒక్కసారిగా జిల్లాలో కొందరు పోలీసు అధికారుల వ్యవహారశైలిపై హాట్‌ టాపిక్‌ నడుస్తుంది.


 చెన్నారావుపేట ఎస్సైగా పనిచేసిన విఠల్‌పై ఇటీవల అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌ వేటు పడింది. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి డబ్బులు గుంజాడనే ఆరోపణలపై తనకు అందిన ఫిర్యాదు మేరకు వరంగల్‌ పోలీసు కమిషనర్‌(సీపీ) రవీందర్‌ ఎస్సై విఠల్‌ను సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు విడదల చేశారు. నెక్కొండ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌(సీఐ) పెద్దన్నకుమార్‌ తప్పుడు నివేదిక ఇవ్వడం వల్లే ఎస్సై విఠల్‌పై సస్పెన్షన్‌ వేటు పడిందని, సస్పెన్షన్‌ ఉత్తర్వులు రద్దు చేయాలనే డిమాండ్‌తో ఓ తండావాసులు చెన్నారావుపేటలో రాస్తారోకో చేశారు. చివరకు పోలీసు ఉన్నతాధికారులు నెక్కొండ సీఐ పెద్దన్నకుమార్‌ను సీపీ ఆఫీస్‌కు, చెన్నారావుపేట ఏఎస్సై సాంబరెడ్డిని నెక్కొండ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ఎస్సై విఠల్‌ సస్పెన్షన్‌, సీఐ పెద్దన్నకుమార్‌, ఏఎస్సై బదిలీకి చెన్నారావుపేట మండలంలోని ఒక తండా వద్ద జరిగిన భూవివాదమే కారణమని ప్రచారంలో ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం పోలీసుశాఖకు మచ్చ తెచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాతైనా భూతగాదాల్లో జోక్యం చేసుకునే, కాసుల వేటలో పడే కొందరు పోలీసు అధికారులు గాని తమ పద్దతి మార్చుకున్నారా? అంటే అది జరగలేదని జిల్లాలో ముసురుకుంటున్న ఆరోపణలను పరిశీలిస్తే తెలుస్తుంది.


మచ్చుకు కొన్ని ఉదాహరణలు..

*వరంగల్‌ మహా నగరం శరవేగంగా విస్తరిస్తుండడంతో శివారులో ఉన్న దామెర మండలంలోని భూముల ధరలకు రెక్కొలొచ్చాయి. ప్రధానంగా ఈ మండలంలో హైదరాబాద్‌- భూపాలపట్నం 163వ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌) పక్కన ఉన్న భూముల ధరలు మండిపోతున్నాయి. దీంతో రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ఎన్‌హెచ్‌ పక్కన, కొద్ది దూరంలో వ్యవసాయ భూములను కొని వెంచర్లు చేస్తున్నారు. ఈ క్రమంలో భూవివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తమ వెంచర్ల పక్కన ఉన్న రైతులు, ఇతరుల భూములను రియల్టర్లు కొందరు ఆక్రమించుకుంటున్నారని, తమకు అవసరమైన భూమి ఇవ్వని రైతులు, ఇతరులపై దౌర్జన్యానికి దిగుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. సదరు రియల్టర్లకు పోలీసుశాఖలోని కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారనే ఫిర్యాదులు ప్రభుత్వంలోని పెద్దల దృష్టికీ చేరాయి.

*దామెర మండలంలోని ఓ గ్రామం వద్ద ఎన్‌హెచ్‌ను ఆనుకుని ఒక ప్రైవేట్‌ విద్యా సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థకు సంబంధించిన భూమి పక్కన ఉన్న వ్యవసాయ భూమిని కొందరు రియల్టర్లు కొనుగోలు చేసి ఇటీవల వెంచర్‌ చేశారు. సదరు రియల్టర్లు దౌర్జన్యంగా తమ భూమిని ఆక్రమించి ప్రహరీ నిర్మిస్తున్నారని విద్యా సంస్థ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. ప్రహరీ నిర్మాణ పనులు ఆగలేదు. రియల్టర్లు తాము అనుకున్నట్లు ప్రహరీ నిర్మించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గాని ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కారణం ఈ రియల్టర్లకు ఓ పోలీసు అధికారి ఆశీస్సులు ఉండడమేనని తెలిసింది.

*ఇదే వెంచర్‌కు సమీపంలో ఎన్‌హెచ్‌ను ఆనుకుని మరో వెంచర్‌ వెలిసింది. రియల్టర్లు ఈ వెంచర్‌లో డెవలప్‌మెంట్‌ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రహరీ నిర్మించారు. తమ భూమిలో కట్టారని కొందరు ఈ ప్రహరీ కూల్చేశారు. ఈ వివాదంలో ఇరు వర్గాలు పోలీసులను సంప్రదించాయి. అయితే ఓ పోలీసు అధికారి ఒక వర్గానికి మద్దతు ఇస్తుండడంతో ఇక్కడ భూవివాదానికి తెరపడలేదు.

* ఈ రెండు వెంచర్లకు కొద్ది దూరంలో ఎన్‌హెచ్‌కు సమీపాన ఇంకో వెంచర్‌ తయారవుతుంది. ఇక్కడ డెవలప్‌మెంట్‌ పనులు చేపట్టిన రియల్టర్లు తమ వెంచర్‌లోకి దారి కోసం ఎన్‌హెచ్‌కు తమ భూమికి మధ్య ఉన్న ఓ రైతు భూమిలో అడుగుపెట్టారు. రహదారి కోసం ఇటీవల ఏకంగా సదరు రైతు అనుమతి లేకుండా అతని భూమిలో ఉన్న పంట చేనును ధ్వంసం చేయడం వివాదానికి దారి తీసింది. దీంతో రైతు, రియల్టర్ల మధ్య ఘర్షణ జరిగింది. గాయపడిన రైతు చికిత్స కోసం దవాఖానలో చేరాడు. బాధితుడి ఫిర్యాదును పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు. చివరకు బాధిత రైతు తనయుడు ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. తప్పని పరిస్థితిలో రియల్టర్లు బాధిత రైతుతో రాజీ పడ్దారు.

* ఇటీవల పోలీసు శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాల నుంచి పలువురు అధికారులు జిల్లాకు వచ్చారు. వీరిలో డిమాండ్‌ ఉన్న కీలకమైన పోస్టులో నియామకమైన ఓ అధికారి వచ్చి రావడంతోనే అదనపు ఆమ్‌దాన్‌పై నజర్‌ వేశాడు. అక్రమ ఆదాయాన్ని సమకూర్చునే పనిలో పడ్డాడు. ఇంకేముంది కిందిస్థాయి అధికారులు ఆయనకు కావాల్సిన నీడ్స్‌ అరెంజ్‌ చేశారు. ఒకరు ఏసీ, మరొకరు ఫ్రిడ్జి, ఇంకొకరు టీవీ ఇలా సారు క్వార్టర్‌లో వస్తువులను దింపేశారు.

* గతంలో తాను పనిచేసిన ఏరియా కావడంతో సదరు పోలీసు అధికారికి ప్రస్తుత కార్యక్షేత్రంపై అవగాహన ఉంది. తన ఇలాకలో పనిచేస్తున్న వారిలో ఎవరికి ఎంత ఆదాయం వస్తుందో తెలిసిన ఆయన ఓ పోలీసు స్టేషన్‌కు నెలనెల వచ్చే మామూళ్లపై కన్నేశాడు. రెండు నెలల మామూళ్లను తీసేసుకున్నాడు. ఈ ఠాణాలో పనిచేస్తున్న అధికారికి కొత్త పోస్టింగ్‌ కావడం వల్ల అతను అనుకున్నది సాఫీగా జరిగింది. వైన్‌ షాపులు, ఇతర మార్గాల ద్వారా ప్రతి నెల మామూళ్ల రూపంలో రూ.వేలు అందే పోలీసు స్టేషన్లలో ఇదొకటని తెలిసింది. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలోనూ ఇరు వర్గాలను సంతృప్తిపరిచి ఆయన తన టార్గెట్‌ రీచ్‌ అయినట్లు సమాచారం. 


logo