గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Feb 19, 2020 , 03:14:40

బంజారాల జాతిరత్నం సేవాలాల్‌

బంజారాల జాతిరత్నం సేవాలాల్‌

నర్సంపేటటౌన్‌, ఫిబ్రవరి 18 : బంజారా జాతిలో జన్మించిన రత్నం సంత్‌శ్రీసేవాలాల్‌ మహరాజ్‌ అని మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ అన్నారు. సేవాలాల్‌ 281వ జయంతి ఉత్సవాలు మంగళవారం నర్సంపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్‌ మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భోగ్‌బండారో కార్యక్రమంలో భాగంగా నెయ్యితో ప్రత్యేకంగా చేసిన నైవేద్యం సేవాలాల్‌కు సమర్పించారు. మందిరం నుంచి పద్మశాలీ గార్డెన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.  అనంతరం పద్మశాలీ గార్డెన్‌లో నర్సంపేట తహసీల్దార్‌ రామ్మూర్తి అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశంలో సీతారాంనాయక్‌ పాల్గొని మాట్లాడారు. 1739లో ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రాంగీనాయక్‌తండాలో భీమానాయక్‌, ధర్మిణి దంపతులకు జగదాంబమాత ఆశీర్వాదంతో కారణజన్ముడైన సేవాలాల్‌ జన్మించారన్నారు.  సేవాలాల్‌ చిన్ననాటి నుంచే ఎంతో విజ్ఞతతో ఉండేవాడన్నారు. లంబాడీలకు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు విద్యాబుద్దులు నేర్పిన విద్యావేత్త అని కొనియాడారు. జీవితాంతం శాఖాహారం భుజిస్తూ బ్రహ్మచర్యం పాటించారని చెప్పారు. ప్రపంచ దేశాల్లో 470 గిరిజన తెగలు మనుగడలో ఉన్నాయని, ఎవరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో జీవిస్తున్నా ఒకే భాష మాట్లాడేది కేవలం లంబాడీ సంతతి వారే అన్నారు. అలాంటి సంతతి, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం సీతారాంనాయక్‌ను గిరిజనులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గిరిజన ప్రతినిధులు వాసూనాయక్‌, ఆంగోతు భద్రయ్య, డాక్టర్‌ ఉదయ్‌సింగ్‌, రామస్వామి, జెడ్పీటీసీ సభ్యుడు పత్తినాయక్‌, హరికిషన్‌, ఎంపీపీలు విజేందర్‌, రమేశ్‌నాయక్‌, బానోత్‌ సారంగపాణి, బోడ బద్దూనాయక్‌, జేత్రామ్‌, జగన్‌నాయక్‌, గోల్యా, కవితాబాయి, నరేందర్‌, కల్యాణ్‌ పాల్గొన్నారు.


logo