బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Feb 17, 2020 , 04:18:27

ఐటీ హబ్‌గా ఓరుగల్లు

ఐటీ హబ్‌గా ఓరుగల్లు

మడికొండ, ఫిబ్రవరి 16: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓరుగల్లులో ఐటీ రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ పరిశ్రమలు ఒక్కొక్కటిగా ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. ఆదివారం మడికొండలోని టీఎస్‌ఐఐసీకి చెందిన ఐటీ పార్కులో క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ఐటీ కంపెనీకి చెందిన డెలివరీ సెంటర్‌కు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. 


ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతితోపాటు అతిథులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్వాడ్రంట్‌ ఐటీ కంపెనీ సీఈవో కంచరకుంట్ల వంశీరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో ప్రముఖ ఐటీ కంపెనీలు సైయెంట్‌, టెక్‌ మహీంద్ర కంపెనీలు వరంగల్‌కు వచ్చాయని చెప్పారు. క్వాడ్రంట్‌ సంస్థ సీఈవో వంశీరెడ్డితో తనకు గత పదేళ్లుగా పరిచయం ఉందన్నారు.జిల్లాకు చెందిన నిరుద్యోగులకు అమెరికాలోని తన కంపెనీలో ఉపాధి కల్పించేలా వంశీరెడ్డి కృషి చేశారని ఆయన తెలిపారు. మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ను ఐటీ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారని, ఇందులో భాగంగానే ఐటీ కంపెనీలు నగరానికి వస్తున్నాయని పేర్కొన్నారు. సుమారు 500 మంది ఐటీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్న సీఈవో వంశీరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత జరుగుతున్న అభివృద్ధి, పరిణామాలను సమీక్షించుకోవాలని అన్నారు. జూలైలో అమెరికా పర్యటన నేపథ్యంలో అక్కడ జిల్లాకు చెందిన ఐటీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఐటీ కంపెనీల స్థాపనకు కృషి చేస్తానని ఎర్రబెల్లి వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో అజాంజాహి మిల్లు, కమలాపూర్‌లోని రేయాన్స్‌ ఫ్యాక్టరీ మూతపడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు మూతపడ్డ పరిశ్రమలు తెరిపిస్తూనే మరోవైపు నూతన పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నదని అన్నారు. సూరత్‌, భీవండికి వలస వెళ్లిన నేత కార్మికులను తీసుకువచ్చి సుమారు వెయ్యి ఎకరాల్లో ఆసియాలోనే అతిపెద్ద మెగా టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కేంద్రం, ఇతర రాష్ర్టాలపై ఆధారపడకుండా సీఎం కేసీఆర్‌ సొంతంగా కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు. నగరానికి వచ్చే పరిశ్రమలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.


logo